Kerala Crime Files 2: చేతి వేలితో.. కేసు ఎలా సాల్వ్ చేశారు! కేర‌ళ‌ క్రైమ్ ఫైల్స్ సీజ‌న్ 2 రివ్యూ

ABN , Publish Date - Jun 23 , 2025 | 04:10 PM

ఇటీవ‌ల ఓటీటీకి వ‌చ్చిన మ‌ళ‌యాల సిరీస్‌ కేర‌ళ‌ క్రైమ్ ఫైల్స్ ది సెర్చ్ ఫ‌ర్ సీపీవో అంబిలి రాజు సీజ‌న్2 రివ్యూ.

kerala

కేర‌ళ నుంచి రూపొందిన‌ మొట్ట మొద‌టి వెబ్‌ సిరీస్‌గా రెండేండ్ల క్రితం డిజిటల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చి మంచి ఆద‌ర‌ణ‌ను ద‌క్కించుకున్న క్రైమ్ సిరీస్ కేర‌ళ‌ క్రైమ్ ఫైల్స్ (Kerala Crime Files). కేర‌ళ‌లో ఒక‌ప్పుడు నిజంగా జ‌రిగిన అంతు చిక్క‌ని మ‌ర్డ‌ర్ కేసుల్లో ప్ర‌ధానమైన వాటిని తీసుకుని ఆ హ‌త్య ఎలా జ‌రిగింది, ఎవ‌రు చేశార‌నే అంశాల‌ను పోలీసులు ఏవిధంగా ఇన్వెస్టిగేష‌న్ చేశారు, అస‌లు నిందితుల‌ను ఏ విధంగా ఛేదించి ప‌ట్టుకున్నారు, అందుకు వారు ఎన్ని వ్య‌య ప్ర‌యాస‌లు ఎదుర్కొన్నార‌నే కోణంలో సాగుతూ చివ‌రి వ‌ర‌కు స‌స్పెన్స్, ట్విస్టుల‌తో రూపొందించి ప్రేక్ష‌కుల‌కు మంచి థ్రిల్‌ను పంచారు. ఇప్పుడు రెండు సంవ‌త్స‌రాల త‌ర్వాత ఈ సిరీస్‌లో రెండో సీజ‌న్ కేర‌ళ‌ క్రైమ్ ఫైల్స్ ది సెర్చ్ ఫ‌ర్ సీపీవో అంబిలి రాజు (Kerala Crime Files Season 2, The Search for CPO Ambili Raju) ఇటీవ‌ల డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చింది. మ‌రి ఈ సీజ‌న్ ఎలా ఉంది, తొలి సీజ‌న్‌ను మ‌రిపించిందా అనేది చూద్దాం.

Gt0UzNfXEAAJi7H.jpg

సీజ‌న్‌2 ఆరంభ ఎపిసోడ్‌లోనే కేర‌ళ‌లోని ఓ సిటీ మ్యూజియంలో ఓ భారీ దొంగ‌త‌నం జ‌రుగుతుంది. దీంతో దొంగ‌ల‌ ఆన‌వాళ్లు క‌నిపెట్టేందుకు పోలీస్ డాగ్‌ రంగ ప్ర‌వేశం చేస్తుంది కానీ ఆ డాగ్ పిచ్చిగా వ్య‌వ‌హ‌రిస్తూ అక్క‌డి పిన్ హోల్డ‌ర్‌ను మింగి తీవ్ర అనారోగ్యం పాల‌వుతుంది. ఆపై కొంత‌కాలానికి ఆ కేసు మ‌రుగున ప‌డుతుంది. కొద్ది రోజుల త‌ర్వాత కేర‌ళ‌లోని ఓ పోలీస్ స్టేష‌న్‌లో ప‌ని చేసే వారంద‌రినీ అవినితీ, నిర్ల‌క్ష్యం త‌దిత‌ర కారణాల‌తో ట్రాన్స్ఫ‌ర్ చేస్తారు. వారి స్థానంలో కొత్త‌గా సీఐ కురియన్‌, ఎస్సైలు నోబుల్‌, మనోజ్‌ శ్రీధరన్‌, ప్రవీణ్‌ చంద్రన్ చార్జ్ తీసుకుంటారు. అయితే అదే స్టేష‌న్ నుంచి బ‌దిలీ కావాల్సి ఉన్న నీతి, నిజాయితీ గ‌ల సీనియ‌ర్ కానిస్టేబుల్, రైట‌ర్ అయిన‌ అంబిలి రాజు డ్యూటీకి వెళుతూ అనుమానాస్పదంగా మిస్స‌వుతాడు. అదే స‌మ‌యంలో ఫ్యామిలీ మెంబ‌ర్స్ సైతం పోలీసుల‌కు స‌మాచారం ఇవ్వ‌డంతో కొత్త‌గా డ్యూటీలో దిగిన‌ పోలీసులు షాక్ తిని అంబిలి రాజు చివ‌రి ఫోన్ కాల్ ఆధారంగా వెత‌క‌డం ప్రారంభిస్తారు.


ముగ్గురు, న‌లుగురు పోలీసులు ఎంత వెతికినా అంద‌రికీ శ్రీ ముఖమే ఎదుర‌వుతుంటుంది. పోలీసులు ఈ కేసులో త‌ల‌మున‌క‌లై ఉండ‌గా.. మిస్స‌యిన అంబిలి రాజు స‌న్నిహితుడు అయ్య‌ప్ప‌న్ కూడా క‌న‌బ‌డ‌డం లేద‌ని, వారిరువురి మ‌ధ్య ఏదో ర‌హ‌స్యం ఉంద‌నే విష‌యం తెలుస్తుంది. అదే స‌మ‌యంలో వారి స్టేష‌న్ ప‌రిధిలో రెండు హ‌త్య‌లు జ‌రిగి పోలీసుల దృష్టికి వ‌స్తాయి. అయితే ఓ రోజు డ‌స్ట్‌బిన్ వ‌ద్ద వ‌ర్క‌ర్స్ క్లీనింగ్ చేస్తుండ‌గా మ‌నిషి వేలు క‌నిపించడంతో పోలీసుల‌కు ఫిర్యాదు చేస్తారు. దీంతో పోలీసులు సీసీ కెమెరాల అధారంగా ఎంక్వైరీ చేస్తుండ‌గా ఓ కుక్క దానిని అక్క‌డ వ‌దిలేసిన‌ట్లు తెలుస్తుంది. దీంతో తాము చేస్తున్న ఇన్వెస్టిగేష‌న్ తిరిగి ఊపందుకుంటుంది. ఈ నేప‌థ్యంలో చివ‌ర‌కు పోలీసులు హంతుకుడిని ఏలా ప‌ట్టుకున్నారు, అంబులి రాజు దొరికాడా, అయ్య‌ప్ప‌న్ ఎవ‌రు, డాగ్ స్కౌడ్‌కు వారికి ఉన్న లింకేంటి, చ‌నిపోయిన వారెవ‌రు అనే ఆస‌క్తిక‌ర పాయింట్‌తో మంచి సీట్ ఎడ్జ్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కించారు.

Gt8h7dkXwAA451s.jpg

గ‌తంలో వ‌చ్చిన సీజ‌న్‌కు దీనికి ఎలాంటి సంబంధం లేకుండా పూర్తిగా కొత్త కేసుతో ఆరు ఎపిసోడ్లుగా ఈ సీజ‌న్‌2 ప్ర‌స్తుతం జియో హాట్‌స్టార్ (Jio Hotstar)లో మ‌ల‌యాళంతో పాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతుంది. ఎక్క‌డా ఎలాంటి అస‌భ్య‌క‌ర, అశ్లీల‌ స‌న్నివేశాలు చివ‌ర‌కు యాక్ష‌న్ అనే మాటే లేకుండా పూర్తిగా ఇన్వెస్టిగేష‌న్ డ్రామాగానే ఈ సీజ‌న్ సాగుతుంది. ఈ క్ర‌మంలో పోలీసుల మ‌ధ్య, అధికారుల మ‌ధ్య ఉండే ఒత్తిడులు, కుటుంబాలు ఎదుర్కొనే స‌మ‌స్య‌లు చూయిస్తునే.. ఓ చేతి వేలు నుంచి స్టార్ట్ చేసి మిస్సింగ్‌, మ‌ర్డ‌ర్ కేసులు ఎలా చేధించార‌నే పాయింట్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ముఖ్యంగా సీసీ పుటేజ్ ఆధారంగా వీధి కుక్క‌ల‌ను ఫాలో అవుతూ క్లూ క‌నిపెట్టే స‌న్నివేశం మైండ్‌బ్లోయింగ్‌గా ఉంటుంది. అంతేగాక డాగ్‌స్కౌడ్‌లో ఉండే కుక్క‌ల‌కు సంబంధించి వివ‌రాలు, వాటి కోసం ప‌ని చేసే వారి మ‌న‌స్త‌త్వాలు ఎలా ఉంటాయ‌నే పాయింట్‌ను చూయించిన విధానం మ‌న‌స్సును హ‌త్తుకుంటుంది. మంచి థ్రిల్ల‌ర్ చూడానుకునే వారు ఈ సిరీస్‌ను మిస్స‌వ‌కుండా ఫ్యామిలీతో క‌లిసి చూసేయ‌వ‌చ్చు.

ట్యాగ్‌లైన్‌: మ‌న‌సు సృజించే థ్రిల్ల‌ర్

రేటింగ్‌: 3/5

Updated Date - Jun 23 , 2025 | 04:36 PM