Vrusshabha Review: మోహన్ లాల్.. 'వృషభ' సినిమా రివ్యూ
ABN, Publish Date - Dec 25 , 2025 | 07:35 PM
మలయాళంలో తెరకెక్కిన ఫాంటసీ యాక్షన్ చిత్రం 'వృషభ’. సూపర్‌స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలో సమర్జీత్ లంకేష్, నయన్ సారిక జంటగా నటించారు. ’మగధీర’ తరహాలో పునర్జన్మల నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో బన్నీ వాసు విడుదల చేశారు.
సినిమా రివ్యూ: వృషభ
విడుదల తేది: 25–12–2025
మలయాళంలో తెరకెక్కిన ఫాంటసీ యాక్షన్ చిత్రం 'వృషభ’. సూపర్‌స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలో సమర్జీత్ లంకేష్, నయన్ సారిక జంటగా నటించారు. నంద కిషోర్ దర్శకత్వం వహించారు. ’మగధీర’ తరహాలో పునర్జన్మల నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో బన్నీ వాసు విడుదల చేశారు. ట్రైలర్‌తో సినిమా హైప్‌ను పెంచిన ఈ సినిమా వెండితెరపై ప్రేక్షకుల్ని అలరించిందా? అన్నది రివ్యూలో చూద్దాం.
కథ:
ఆదిదేవ వర్మ (మోహన్ లాల్) పెద్ద వ్యాపారవేత్త. ఆయనకు ఓ కుమారుడు తేజ్ (సమర్జీత్ లంకేష్) తండ్రి అంటే ఆపారమైన ప్రేమ. తండ్రికి కూడా కొడుకు అంటే అంతే ప్రేమ. ఆదిదేవకు గత జన్మ ఉంటుంది. దాని తాలుక జ్ఞాపకాలు అతన్ని వెంటాడుతుంటాయి. తరచూ కలలో రాజులు, రాజ్యాలు, యుద్థాలు గత జన్మ అనుభవాలతో ఆది దేవ వర్మ సతమతమవుతుంటాడు. ఈ విషయం తెలుసుకున్న తేజ్ తండ్రి కోసం సైక్రియాటిస్ట్‌ను కలవాలనుకుంటాడు. ఇదే క్రమంలో దామిని(నయన్ సారిక) అతనికి పరిచయం అవుతుంది. పరిచయమైన కొద్ది రోజుల్లోనే వీరి మఽధ్య ప్రేమ చిగురిస్తుంది. అలా ఇద్దరు కలిసి ఆదిదేవ వర్మ సమస్యకు పరిష్కారం కోసం శ్మశానంలో ఉండే రుద్ర (అయ్యప్ప శర్మ)ను కలుస్తాడు. అక్కడో ఓ విషయం తెలియగానే వెంటనే సొంత గ్రామమైన దేవ నగరికి బయలుదేరతాడు. అప్పుడే అసలు కథ మొదలవుతుంది. తండ్రి కోసం వెళ్లిన తేజ్ తండ్రినే చంపడానికి ఎందుకు సిద్ధపడ్డాడు. ఆ తండ్రీ మీద కొడుకుకి పగ ఎందుకు? ఆది దేవ వర్మకు గత జన్మ తాలుక జ్ఞాపకాలు ఎందుకు వెంటాడుతున్నాయి. త్రిలింగ సామ్రాజ్యాధినేత అయిన రాజా విజయేంద్ర వృషభకు ఓ మహిళ పెట్టిన శాపం ఏమిటి? ఆయన భార్య మహారాణి త్రిలోచన (రాగిణీ ద్వివేది) మరణానికి కారణం ఎవరు? చివరికి ఏమైంది అన్నది కథ.
విశ్లేషణ
'మగధీర' తరహా పునర్జన్మ నేపథ్యంలో సాగే సినిమా ఇది. ఈ తరహా కథలు తెలుగులో చాలానే వచ్చాయి. సక్సెస్‌ఫుల్ జానర్ ఇది. గత జన్మ ఉన్న రాజా విజయేంద్ర వృషభ గురించి చెబుతూ కథ ప్రారంభించాడు దర్శకుడు. మొదట్లోనే రాజుకు ఉన్న శాపం ఏంటో రివీల్ చేసి కథపై ఆసక్తి పెంచాడు. అయితే కథ పరంగా దర్శకుడు బాగానే రాసుకున్నాడు కానీ సీన్స్‌ని ఎగ్యిక్యూట్ చేయడంలో మిస్‌ఫైర్ చేశాడు. డైలాగ్‌లు అంతే! ఇంటర్వెల్ వరకూ కథ అంతా గజిబిజీగా సాగుతుంది. కథలో ట్విస్ట్ రివీల్ అయ్యాక కాస్త ఆసక్తి పెరుగుతుంది. అప్పటిదాకా ప్రేక్షకుడికి పరీక్షే. అయ్యప్ప శర్మ సన్నివేశాలు సినిమాపై ఆసక్తి రేపుతాయి. త్రిలింగ రాజ్యం నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ఫర్వాలేదనిపిస్తాయి. ఆ తర్వాత ప్రజెంట్, ఫాస్ట్ చూపించిన తీరులో ఏదో మిస్ అయిన భావన కలుగుతుంది. ఓ హోమం చేసి కొడుకుకి తండ్రిమీద ఉండే ద్వేషాన్ని తొలగించడం అనేది మింగుడు పడని అంశం. సినిమాకు అరడజనుకు పైగా నిర్మాతలు ఉన్నారు. క్వాలిటీ విషయంలో ఎక్కడ పట్టించుకోలేదు. మోహన్ లాల్ హార్స్ రైడింగ్ సీన్స్ వీఎఫ్‌ఎక్స్ చూస్తే హరిహర వీరమల్లు గుర్తొస్తుంది. ‘ఆచార్య’ కోసం వేసిన సెట్‌లో యుద్థ సన్నివేశాలు తెరకెక్కించారు. ఎంతో గొప్పగా చెప్పే త్రిలింగ రాజ్యం సెట్ కూడా లో క్వాలిటీలో ఉంటుంది. టెక్నికల్‌గా ఈ సినిమా గురించి పెద్దగా మాట్లాడుకునేలా లేదు. కెమెరా పనితనం మాత్రం బాగుంది. సామ్ సిఎస్ సంగీతం కూడా అంతంత మాత్రమే! ఇక సినిమా చూస్తున్నంత సేపు అసలు ఈ కథను మోహన్‌లాల్ లాంటి స్టార్ ఎలా అంగీకరించారనే అనుమానం రాకమానదు. ఇందులో ఆయన మహారాజుగా కనిపించారు. ఆ రాజసానికి తగ్గ సన్నివేశాలు లేవు. ఇంటర్వెల్ ముందు వరకు తండ్రి పాత్రకే పరిమితమయ్యారు. సమర్జీత్ లంకేశ్‌కు స్టార్ హీరోల లెక్కలో ఎలివేషన్లు ఇవ్వడం అంతగా బాగోలేదు. నటన పరంగా మోహన్‌లాల్‌కు ఎక్కడా పేరు పెట్టలేం. కుదిరిన ప్రతిసారీ ఆయ ప్రతిభ తెరపై ప్రతిభ కనిపించింది. సమర్జీత్ లంకేష్ అప్పియరెన్స్ బావుంది. యాక్షన్ సీన్స్ బాగా చేశారు. యాక్టింగ్‌లో మెళకువలు నేర్చుకోవాలి. రాణిగా రాగిణీ ద్వివేదికి మంచి పాత్రే దక్కింది. కనిపించి తక్కువ సమయమే అయినా ఆకట్టుకుంది. నయన్‌సారికది రొటీన్ పాత్రే. తెలుగు, మలయాళం బైలింగ్వల్ సినిమా కావడంతో తెలుగు ఆర్టిస్ట్‌లు బాగానే కనిపించారు. అజయ్, వినయ్ వర్మ, భద్రమ్, ‘బలగం’ సంజయ్... అయ్యప్ప శర్మ ఫర్వాలేదనిపించారు. మోహన్‌లాల్ అభిమానించేవారు ఈ సినిమాకు వెళ్లే నిరాశ చెందక తప్పదు. అయితే క్లైమాక్స్‌లో తండ్రీ కొడుకుల మధ్య యుద్థం – మానసిక సంఘర్షణ కాన్సెప్ట్ బావుంది. ఆ సన్నివేశాలు ఇంకాస్త డెప్త్‌గా, లాజిక్‌గా తీసి ఉంటే కొంతలో కొంత సినిమా మెప్పించేది. ఈ తరహా చిత్రాన్ని మగధీరతో పోల్చడం కూడా పొరపాటే అవుతుంది.
ట్యాగ్‌లైన్: గజిబిజీ వృషభ
రేటింగ్: 1.75/5