Virgin boys Review: బోల్డ్ కంటెంట్.. వర్జిన్ బాయ్స్ ఎలా ఉందంటే
ABN, Publish Date - Jul 11 , 2025 | 09:19 PM
వర్జిన్ బాయ్స్ టైటిల్ రిలీజ్ అయినప్పటి నుంచి సినిమాకు క్రేజ్ పెరిగింది. టైటిల్‌ను బట్టి ఈ సినిమాలో అసలు ఏముందో అనే చర్చ మొదలైంది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం.
సినిమా రివ్యూ: వర్జిన్ బాయ్స్ (Virgin boys Review)
విడుదల తేది: 11–7–2025
'వర్జిన్ బాయ్స్' టైటిల్ రిలీజ్ అయినప్పటి నుంచి సినిమాకు క్రేజ్ పెరిగింది. టైటిల్‌ను బట్టి ఈ సినిమాలో అసలు ఏముందో అనే చర్చ మొదలైంది. దానికి తగ్గట్టే సాంగ్స్, ట్రైలర్లు హాట్‌హాట్‌గా ఉండటంతో ఇంకాస్త బజ్ పెరిగింది. ఇంకా ‘మనీ రెయిన్ ఇన్ థియేటర్స్’, ‘టికెట్ కొట్టు – ఐఫోన్ పట్టు’ కాన్సెప్ట్‌లతో ప్రేక్షకుల దృష్టిని సినిమా వైపు మళ్లించారు మేకర్స్. గీతానంద్, మిత్రాశర్మ, శ్రీహాన్, రోనీత్, జన్నీఫర్, అన్షుల, సుజిత్ కుమార్ అభిలాష్ కీలక పాత్రలు పోషించారు. దయానంద్ దర్శకత్వంలో రాజా దారపునేని నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం.
కథ: (Virgin boys Review)
ఆర్య (గీతానంద్), డుండీ (శ్రీహన్), రోనీ (రోనీత్) బీటెక్ స్టూడెంట్స్. ముగ్గరూ వర్జిన్స్. తమ క్లాస్‌మేట్ ఇచ్చిన పార్టీలో చైల్డ్ హుడ్ ఫ్రెండ్ (కౌశల్ మంద) ఓ ఛాలెంజ్ విసురుతాడు. డిసెంబర్ 31లోపు వర్జినిటీ కోల్పోవాలన్నది అతని ఛాలెంజ్. సరయు (మిత్రా శర్మ)ను ఆర్య ప్రేమిస్తాడు. ఆ అమ్మాయి క్లాసికల్ డ్యాన్సర్. కాలేజీలో డ్యాన్స్ కాంపిటీషన్ కోసం రాధాకృష్ణులుగా సరయు, ఆర్య సెలెక్ట్ అవుతారు. లైలా (జెన్నిఫర్)తో డుండీ ప్రేమలో పడతాడు. రోనీకి ఓ అమ్మాయి (అన్షులా ధావన్) సెట్ అవుతుంది. ముగ్గురు అబ్బాయిలకు ప్రేమలో ఆ అమ్మాయి ఎటువంటి పరీక్షలు పెట్టారు? వాళ్ళ మధ్య దూరం పెరగడానికి కారణం ఏంటి? డిసెంబర్ 31లోపు తాము ప్రేమించిన అమ్మాయిలతో ఆ అబ్బాయిలు శారీరకంగా కలిశారా? లేదా? అనేది కథ
విశ్లేషణ:
తెలుగులో అడల్డ్ కామెడీ సినిమాలు అరుదుగా వస్తుంటాయి. ఒకరిద్దరు దర్శకులు మినహా మన దర్శకులు హద్దు దాటకుండా సినిమాలు చేస్తారు. బోల్డ్ కథల వైపు మన దర్శకులు పెద్దగా వెళ్లరు. అయితే ‘వర్జిన్ బాయ్స్’తో అదే చేసి చూపించాలని ముందే డిపైడ్ అయినట్లున్నారు దర్శకుడు దయానంద్. తమ సినిమా పెద్దల కోసమే అని ముందు నుంచే ప్రమోట్ చేసుకున్నారు. యువత నేపథ్యంలో సాగే కథ ఇది. కాలేజీలో కొత్తగా చేరిన యువతలో చాలా మందికి గర్ల్‌ఫ్రెండ్ ఉండాలని, వర్జినిటీ కోల్పోవాలని కోరిక ఉంటుంది. అదే మెయిన్ పాయింట్‌గా తీసుకుని దర్శకుడు ఈ సినిమా తీశారు. వర్జినిటీ కోల్పోవడానికి సిద్థమైన ముగ్గురు యువకుల కథను ఆసక్తికరంగా తెరకెక్కించారు. ఇలాంటి కథలో అడల్డ్ కంటెంట్ ఎంత ఉన్న చివర్లో ఓ సందేశం వదలడం కామన్.
ఈ సినిమా విషయంలో కూడా అదే జరిగింది. సినిమా ప్రారంభం నుంచి క్లైమాక్స్ ముందు వరకూ గ్లామర్, డబుల్ మీనింగ్ డైలాగ్‌లతో నడిపించారు. అయితే కథకు తగ్గట్లుగా అక్కడక్కడ బోల్డ్ జోక్స్, స్కిన్ షో బాగానే ఉంది. కాకపోతే రైటింగ్‌లో బలం లేకపోవడంతో సాదాసీదాగా సినిమా సాగుతుంది. కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను విసిగిస్తాయి. అయితే ఓ సెక్షన్ ఆడియన్స్ ఏదైతే కోరుకుని సినిమాకు వెళ్తారో అలాంటి వారికి మాత్రం ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. ఇప్పటికే తెలుగులో చూసిన కొన్ని సినిమాలు ఈ సినిమాలో కనిపిస్తాయి. దర్శకుడు ఎలాంటి మొహమాటాలు పెట్టుకోకుండా అడల్ట్ జోక్స్, హీరోయిన్స్ గ్లామర్ మీద నమ్మకం పెట్టుకున్నారు. ఛాన్స్ దొరికిన ప్రతి సన్నివేశంలో గ్లామర్ హద్దులు మీరి చూపించారు. ఫైనల్‌గా వర్జినిటీ కోల్పోవడం కంటే నిజమైన ప్రేమే ముఖ్యమనే సందేశంతో ఫినిషింగ్ ఇచ్చారు.
నటీనటుల విషయానికొస్తే..
ఆర్య పాత్రలో గీతానంద్ ఫర్వాలేదనిపించారు. హీరోయిజం కోసమే అన్నట్లు బలవంతంగా అతనికి ఓ ఫైట్ ఇచ్చారు. మిత్రా శర్మ నటన గురించి పెద్దగా మాట్లాడుకోవల్సిన పనిలేదు. గ్లామర్‌కే పరిమితమైంది. జెన్నిఫర్, అన్షులా బాగానే చేశారు. అందాల ప్రదర్శనలో ఎక్కడా తక్కువ చేయలేదు. శ్రీహన్ నటన ఓవర్‌గా అనిపించినా కాస్త హాస్యం పంచాడు. మిగతా ఆర్టిస్ట్‌లు ఓకే అనిపించారు. స్మరణ్ సాయి సంగీతం ఫర్వాలేదనిపించింది. బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం బావు0ది. ఎడిటింగ్ కూడా ఓకే.. సినిమాటోగ్రఫీ కొంత వరకూ సినిమాకు ఎసెట్. నిర్మాత బాగానే ఖర్చు పెట్టారు. దర్శకుడు దయానంద్ బోల్డ్ కథను ప్రేక్షకులకు చెప్పాలనుకున్నాడు అదే స్ర్కీన్ మీద చూపించాడు. బోల్డ్ జోక్స్ కూడా బాగానే వేశాడు. యువతే టార్గెట్‌గా ఈ సినిమా తీశారు. అడల్డ్, బోల్డ్ కంటెంట్ కోరుకునే వారికి ఈ సినిమా సంతృప్తినిస్తుంది.
ట్యాగ్‌లైన్: వర్జిన్ బాయ్స్.. యువతకు మాత్రమే!
రేటింగ్: 2.5/5