సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Kingdom: కింగ్ డమ్ మూవీ రివ్యూ

ABN, Publish Date - Jul 31 , 2025 | 01:45 PM

విజయ్ దేవరకొండ నటించిన 'కింగ్ డమ్' మూవీ గురువారం జనం ముందుకు వచ్చింది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం.

Kingdom movie

రౌడీ హీరోగా అభిమానులు పిలుచుకునే విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) గత కొంతకాలంగా సరైన విజయం కోసం ఎదురుచూస్తున్నాడు. ఫ్యామిలీ ఆడియెన్స్ ను మెప్పించగలనని భావించిన 'ఫ్యామిలీ స్టార్' (Family Star) డిజప్పాయింట్ చేసిన తర్వాత గౌతమ్ తిన్ననూరి ట్రాక్ రికార్డ్ తో 'కింగ్ డమ్' (Kingdom) కు పచ్చజెండా ఊపాడు. సూర్యదేవర నాగవంశీ (Suryadevara Nagavamsi) భారీ స్థాయిలో తెరకెక్కించిన 'కింగ్ డమ్' విజయ్ దేవరకొండను పట్టాభిషిక్తుడిని చేసిందా... మీరే తెలుసుకోండి.


కథేంటంటే...

ఇది 1920 నాటి మాట. బ్రిటీషర్స్ భారతదేశాన్ని పరిపాలిస్తున్న కాలం. శ్రీకాకుళం తీర ప్రాంతంలో బంగారు గనులపై కన్నేసిన తెల్లదొరలు అక్కడి ఓ జాతిని అంతం చేసి బంగారు గనులను కొల్లగొట్టాలని చూస్తారు. అక్కడి ఓ యోధుడు తన జాతికి అండగా నిలిచి, కొందరు ఓ ఓడలో సముద్రంపైకి పంపి ప్రాణ త్యాగం చేస్తాడు. అలా బయలుదేరిన ఆ గూడెం జనం శ్రీలంక తీర ప్రాంతమైన జాఫ్నా చేరతారు. అక్కడ నుండి ఎప్పటికైనా తమ స్వదేశానికి రావాలని ఉవ్విళ్ళూరుతుంటారు.

ఇది జరిగిన ఏడు దశాబ్దాలకు... కానిస్టేబుల్ అయిన సూరి (విజయ్ దేవరకొండ)... పన్నెండేళ్ళ క్రితం ఇల్లు వదిలి వెళ్ళిపోయిన తన అన్న శివ (సత్యదేవ్) ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవాలని తాపత్రయ పడుతుంటాడు. అతను శ్రీలంకలోని జాఫ్నాలో శ్రీకాకుళం నుండి వెళ్ళిన తెగకు నాయకుడిగా ఉన్నాడని, అతన్ని కలుసుకుని, భారతదేశానికి తెచ్చుకోమని 'రా' అధికారి చెబుతాడు. అయితే ఇది అండర్ కవర్ ఆపరేషన్ గా జరగాలని సూచిస్తాడు. భారతదేశ గూఢచార అధికారి సూరిని ఈ కార్యం కోసం ఎంచుకోవడానికి కారణం ఏమిటీ? శివను ఆ గూడెం నుండి తప్పించాలని అధికారులు ఎందుకు అనుకున్నారు? ఇంటి నుండి పారిపోయి శ్రీలంక చేరిన శివ... అక్కడి వారికి ఎలా నాయకుడు కాగలిగాడు? అసలు ఈ మొత్తం వ్యవహారంలో అ్రకమ ఆయుధాల రవాణా, దాని ద్వారా భారత్ కు జరిగే ముప్పు ఏమిటీ? అనేదే 'కింగ్ డమ్' కథాంశం.


సినిమా ప్రథమార్ధం చూస్తే అద్భుతంగా అనిపిస్తుంది. శ్రీకాకుళంలోని ఓ చిన్న గూడెం వాసులు బ్రిటీషర్స్ నుండి తప్పించుకోవడం, తమ అస్తిత్వాన్ని నిలుపుకోవడం కోసం అక్కడ స్మగ్లర్లుగా మారడం, వారిని అడ్డం పెట్టుకుని అండర్ వరల్డ్ గ్యాంగ్ అ్రకమ ఆయుధాలను సరఫరా చేయడం... ఇవన్నీ ఆసక్తిని కలిగిస్తాయి. ఇక ఇల్లు వదిలి పారిపోయిన అన్నను సూరి కలవడం కోసం చేసే ప్రయత్నం, అందులో ఎదురైన సమస్యలను ఎదుర్కొన్న తీరు చూస్తే గూజ్ బంప్స్ వస్తాయి. ఈ సినిమా ఎక్కడికో వెళ్ళిపోతుందనే భావన ఇంట్రర్వెల్ వరకూ కలుగుతుంది. అయితే... అసలు కథ ఆ తర్వాతే మొదలుతుంది. సినిమాను ఎంతో ఎత్తుకు తీసుకెళ్ళి కూర్చోపెట్టిన దర్శకుడు గౌతమ్ తిన్ననూరి... అక్కడి నుండి సీన్ సీన్ కూ మూవీ గ్రాఫ్ ను కిందకు దించేశాడు. ఎక్కడ హీరోను ఎలివేట్ చేసే సీన్స్ ఉంటాయో అక్కడంతా మౌనం దాల్చాడు. దాంతో థియేటర్లలోని ప్రేక్షకులలో అసహనం పెరిగిపోతుంది. అసలు కథను ఎలా ముగించబోతున్నాడో అర్థం కాదు. అన్నా- తమ్ముళ్ళ సెంటిమెంట్ ను చివరకు నీరు కార్చేసే వరకూ గౌతమ్ తిన్ననూరి ఊరుకోలేదు. గూడెం వాళ్ళలో అత్యధికులు హత్యకు గురైన నేపథ్యంలో ఆ రాజ్యానికో రాజు వచ్చాడన్నట్టుగా సూరి నెత్తిన ఓ కిరీటాన్ని పెడతారు. అది నిజానికి ప్రేక్షకుల నెత్తిన దర్శకుడు పెట్టిన ముళ్ళ కిరీటం! ద్వితీయార్థాన్ని ఏ ఆలోచనతో ఖండఖండాలుగా చేసేశారరో అర్థమే కాదు. దాంతో ఫీల్ మిస్ అయిపోయింది. ఏ సన్నివేశంతోనూ ప్రేక్షకుడు మమేకం కాలేకపోతాడు. చివరకు ప్రేక్షకుల మనసుల్లో మెదిలే ప్రశ్నలనే ఓ వాయిస్ ఓవర్ లో వినిపించి... శుభం కార్డు వేశారు. ఆ ప్రశ్నలకు సమాధానం వస్తే గిస్తే 'కింగ్ డమ్' సెకండ్ పార్ట్ లో తెలుసుకోవాలి. ఈ మధ్య కాలంలో మేకర్స్ కు రెండు భాగాల పిచ్చి పట్టుకుందేమో అనిపిస్తోంది! తాము అనుకున్న కథను ఒక పార్ట్ గా చూపించకలేకపోవడం బలహీనత అనే విషయం వాళ్ళకు అర్థం కావడం లేదు. దాంతో అబ్రాప్ట్ గా మూవీని ముగించేస్తున్నారు. 'కింగ్ డమ్' విషయంలోనూ అదే జరిగింది.


నటీనటుల విషయానికి వస్తే... విజయ్ దేవరకొండ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టాడు. అన్నకోసం గంగవెర్రులెత్తే తమ్ముడిగా బాగా నటించాడు. అన్నదమ్ములు కలిసే సన్నివేశం రక్తికట్టినా... ఆ తర్వాత సీన్స్ ఏవీ బలంగా లేకపోయాయి. అన్న పాత్రలో సత్యదేవ్ బాగా ఇమిడిపోయాడు. అయితే అతని పాత్రను పూర్తి స్థాయిలో ఇందులో చూపించలేదు. ఇక హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేకు ఎలాంటి ప్రాధాన్యం లేకుండా పోయింది. హీరోహీరోయిన్లపై చిత్రీకరించిన 'హృదయం లోపల' పాటను కూడా చివరికి తీసేశారు. అంటే ఎంత ప్లానింగ్ లేకుండా స్క్రిప్ట్ ను తయారు చేసుకున్నారో అర్థమౌతోంది. 'ఫైనల్ ప్రాడక్ట్ బాగుండాలి. అందుకోసం ఎంత తీసి, ఏమి తొలగించినా తప్పులేదు' అని దర్శకులు భావిస్తూ ఉండొచ్చు. కానీ బుర్రకు తట్టిన ప్రతిదీ చిత్రీకరించడం వల్ల ఎన్ని కోట్లు నిర్మాతకు ఖర్చు అవుతుందో, దాని వల్ల ఎంత నష్టం వాటిల్లుతుందో దర్శకులు ఆలోచించడం లేదు. మురుగన్ పాత్రలో వెంకిటేష్ వి. పి. చాలా బాగా చేశాడు. ఇతర పాత్రలను రోహిణి, అయ్యప్ప పి శర్మ, మనీష్ చౌదరి, గోపరాజు రమణ, రాజ్ కుమార్ కసిరెడ్డి, మురళీధర్ గౌడ్ తదితరులు చేశారు. అనిరుథ్‌ నేపథ్య సంగీతం సన్నివేశాలను ఎలివేట్ చేసే విధంగా ఉంది. గిరీశ్‌ గంగాధరన్ సినిమాటోగ్రఫీ, జోమోన్ టి జాన్ సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రథమార్థంను అద్భుతంగా ఎడిట్ చేసిన నవీన్ నూలీనే సెకండ్ హాఫ్ ను కూడా ఎడిట్ చేశాడా? అనే సందేహం వస్తుంది. ద్వితీయార్థంలో అసలు ఫ్లో సరిగా లేదు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య కథనో, దర్శకుడినో నమ్మి కోట్ల రూపాయలను విచ్చలవిడిగా ఖర్చు పెట్టారు. కానీ అదంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుందేమో! మేకింగ్ పరంగా సినిమా బాగుంది. అలానే విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కు నచ్చే ఆస్కారం ఉంది. రెగ్యులర్ ఫిల్మ్ గోయర్ ను ఈ సినిమా ఆకట్టుకోవడం కష్టమే!

ట్యాగ్ లైన్: ముళ్ళకిరీటం!

రేటింగ్: 2.5/5

Updated Date - Jul 31 , 2025 | 01:45 PM