Maargan Review: క్రైమ్ థ్రిల్లర్ మార్గన్ ఎలా ఉందంటే
ABN, Publish Date - Jun 27 , 2025 | 06:41 PM
విజయ్ ఆంటోని తాజాగా నటించి, నిర్మించిన చిత్రం మార్గాన్. లియో జాన్ పాల్ దర్శకత్వంలో క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
సినిమా రివ్యూ: మార్గాన్ (Maargan Movie Review)
విడుదల తేది: 27–6–2025
నటీనటులు: విజయ్ ఆంటోని (Vijay Antony), బ్రిగిడా సాగా, అజయ్ దిషాన్, ప్రీతిక, సముద్రఖని తదితరులు
సంగీత దర్శకుడిగా కెరీర్ ప్రారంభించి నటుడిగా ఎదిగారు విజయ్ ఆంటోని. బిచ్చగాడుతో టాలీవుడ్‌లో మంచి క్రేజ్, మార్కెట్ సంపాదించుకున్నారు. వైవిధ్యమైన కథలకు కేరాఫ్‌గా నిలిచిన ఆయన కొత్త ప్రయోగాలు చేయడానికి వెనకాడరు. తాజాగా ఆయన నటించి, నిర్మించిన చిత్రం మార్గాన్. లియో జాన్ పాల్ దర్శకత్వంలో క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరీ చిత్రం తెలుగు ప్రేక్షకుల్ని ఎంతవరకూ ఆకట్టుకుందో చూద్దాం.
కథ: (Maargan Movie Review)
రమ్య అనే యువతి హత్యకు గురవుతుంది. నల్లగా తయారైన ఆమె బాడీ ఓ కాలనీలో చెత్త కుప్పలో దొరుకుతుంది. దాంతో పోలీసులు విచారణ ప్రారంభిస్తారు. దేశవ్యాప్యంగా సంచలనం సృష్టించిన ఈ కేసును డీల్ చేయడానికి ముంబై నుంచి ధ్రువ్ (విజయ్ ఆంటోని) అడిషనల్ డీజీపీగా హైదరాబాద్ వస్తారు. తన కూతురు కూడా అలాగే మర్దర్ కావడంతో రమ్య కేసుపై మరింత దృష్టి పెడతారు. హత్యకు సంబంధించిన చిన్న చిన్న ఆధారాల సాయంతో అరవింద్ (అజయ్ దిశాన్) అనే కుర్రాడిని అదుపులోకి తీసుకొని విచారణ మొదలుపెడతాడు. అరవింద్.. వల్ల అమ్మాయిల హత్యలకు సంబంధించి కొన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి. ఆ హత్యలకు కారణం ఎవరు? వాటికి అరవింద్‌కు సంబంధం ఏంటి? మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన వెన్నెల ఎవరు? పోలీస్ ఆఫీసర్ ధ్రువ కూతురు హత్యకు కారణం ఏంటి? ఈ కేసు ధ్రువ్ ఎలా ఛేదించారు అనేది కథ.
విశ్లేషణ:
దాదాపుగా క్రైమ్, ఇన్వెస్టిగేటివ్ స్టోరీలన్నీ ఇదే మాదిరి ఉంటాయి. సీరియల్ కిల్లింగ్, దాని వెనకున్న బ్లాక్ మ్యాన్ ఎవరనేది ఫైనల్‌గా తేలుతుంది. ఈ తరహా కథలు తెలుగు తెరకు కొత్తేమీ కాదు. ఈ మధ్యకాలంలో ఇదే జానర్ కథలు, వెండితెరపైనే కాదు. ఓటీటీల్లోనూ చాలానే దర్శనమిచ్చాయి. కథ రొటీన్‌దే అయినా దానిని ఎంత ఆసక్తికరంగా దర్శకుడు మలిచారనేది ముఖ్యం. దర్శకుడు లియో జాన్ పాల్ ఆ స్ట్రాటజీని ఈ కథకు బాగానే అప్లై చేశారు.. కథ ప్రారంభమే రమ్య హత్య ఎపిసోడ్‌తో ఏం జరగబోతోందో క్లియర్‌గా చెప్పేశాడు. హీరో కేసును తీసుకోగానే కొన్ని ఆధారాలతో అరవింద్ అనే యువకుడిని అనుమానించి విచారణ చేయడంలో ఇంతేనా? అప్పుడే కేసు తేలిపోయిందా అనిపిస్తుంది. అయితే అక్కడే దర్శకుడు కథలో కొత్త టర్న్ తీసుకున్నాడు. అప్పటి దాకా సాధారణ కథే అన్న భావన తొలగిపోయేలా రూట్ మార్చాడు. జల స్తంభన మీద పట్టున్న అరవింద్‌లో ఉన్న శక్తి ఏంటో తెలుస్తుంది ధ్రువ్‌కు తెలుస్తుంది. అప్పుడే ధ్రువ తన గతాన్ని వివరించడంతో మరిన్ని అంశాలు బయటపడి అరవింద్‌కు ఈ కేసుకు ఏదో లింక్ ఉందనిపిస్తుంది. అయితే ఇంటర్వెల్‌కు వచ్చే సరికి అది కాదని తేలిపోతుంది. దాంతో వాట్ నెక్ట్స్ అనేలా సెకెండాఫ్‌పై ఆసక్తి పుట్టించాడు. అక్కడి వరకూ విచారణ సీరియల్ తరహాలో సాగినా ఇంటర్వెల్ నుంచి విచారణ ఊపందుకుంటుంది. కథ కూడా వేగంగా ముందుకు వెళ్తుంది. హీరో చేయాల్సిన ఇన్వెస్టిగేషన్ పూర్తిగా అరవింద్‌కు ఉన్న శక్తిపై ఆధారపడటంతో హీరో పాత్ర ఇంపాక్ట్ చూపించదు. అరవింద్ అసాధారణ శక్తితో రెండు సార్లు విచారణకు కీలక విషయాల్ని బయటపెట్టినా తర్వాత మాత్రం మొత్తం సినిమాటిక్‌గా మలచిన భావన కలుగుతుంది. బీచ్ ఒడ్డున ఓ రిసార్ట్‌లో సాగే పార్టీతో సినిమా క్లైమాక్స్‌కు చేరుకుంటుంది. అదంతా సాగదీతలా ఉంటుంది. అసలు కిల్లర్ ఎవరో చెప్పిందిన తీరు, దాని వెనకున్న రీజన్‌లో కొత్తలేదు. ఆకట్టుకునేలానూ లేదు.
నటీనటులు పనితీరు..
పోలీస్ ఆఫీసన్ పాత్రలో విజయ్ అంటోని చక్కగా నటించారు. తన గత పాత్రలతో పోల్చితే ఇదేమీ కొత్త పాత్ర కూడా కాదు. సీరియస్ లుక్‌లో కనిపించారు. ఆయనకు తెలుగు డబ్బింగ్ పర్ఫెక్ట్‌గా సరిపోయింది. అజయ్ దిశాన్ పాత్ర కథకు కీలకమే అయినా ఎక్కడో తేలిపోయిన భావన కలుగుతుంది. ఫస్టాఫ్‌లో అతనే సైకో కిల్లర్ అనే భావన కలిగించి సెకెండాఫ్‌లో సాఫ్ట్‌గా కనిపించి వేరియేషన్ చూపించాడు దర్శకుడు. సముద్రఖని అతిథిలా కనిపించారు. బ్రిగిడా సాగా పాత్ర ఫర్వాలేదనపించింది. ప్రీతిక, వినోద్ సాగర్, దీప్సిక తదితరులు పాత్రల మేరకు నటించారు. ఫొటోగ్రఫీ ఫర్వాలేదు. క్రైమ్ కథలకు సంగీతం చాలా కీలకం. అయితే విజయ్ ఆంటోని సంగీతం ఈ సినిమాకు ప్లస్ కాలేదు. నిర్మాణ విలువలు బావున్నాయి. దర్శకుడు రొటీన్ కథను తీసుకుని ఫస్టాఫ్‌ను ఆసక్తికరంగా మలిచారు. సెకెండాఫ్‌కు వచ్చేసరికి సాధారణంగా మారిపోయింది. క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడేవాళ్లకు ఈచిత్రం ఏమాత్రం నచ్చదు.
ట్యాగ్ లైన్: రొటీన్ క్రైమ్ థ్రిల్లర్
రేటింగ్: 2.25/5