Tribanadhari Barbarik Review: 'త్రిబాణధారి బార్బరిక్' సినిమా మెప్పించిందా..
ABN, Publish Date - Aug 29 , 2025 | 03:17 PM
మన పురాణాల్లోని పాత్రలను తీసుకొని పలు పుక్కిటి పురాణ గాథలు వెలుగు చూశాయి. అలాంటి గాథలతోనే పలు చిత్రాలు తెరకెక్కి అలరించాయి. ఇప్పుడు ఆ తరహా గాథతోనే 'త్రిబాణధారి బార్బరిక్' వెలుగు చూసింది.
సినిమా రివ్యూ: 'త్రిబాణధారి బార్బరిక్'
విడుదల తేది: 29-8-2025
మన పురాణాల్లోని పాత్రలను తీసుకొని పలు పుక్కిటి పురాణ గాథలు వెలుగు చూశాయి. అలాంటి గాథలతోనే పలు చిత్రాలు తెరకెక్కి అలరించాయి. ఇప్పుడు ఆ తరహా గాథతోనే 'త్రిబాణధారి బార్బరిక్' వెలుగు చూసింది. ఘటోత్కచుని కుమారుడైన బార్బరీకునికి యుద్ధవిద్యల్లో ఉన్న ప్రతిభను చూసి దేవతలు ముచ్చటపడి, అతనికి మూడు బాణాలను ప్రసాదించారు. ఆ మూడు బాణాలతో అతనికి ముల్లోకాలలోనూ తిరుగులేదంటూ వరాన్ని ప్రసాదించారు. అయితే ఆ వరం కారణంగా ఎక్కడ పాండవులకు ఆపద కలుగుతుందో అనే భయంతో కృష్ణుడు బార్బరీకుడిని వధించాడనే కథ ఒకటి ప్రాచుర్యంలో ఉంది. వ్యాస భారతంలో కానరాని ఈ కథను ఆధారం చేసుకొని ‘త్రిబాణధారి బార్బరిక్’ తెరకెక్కింది. సత్య రాజ్, వశిష్ట ఎన్ సింహా, ఉదయభాను, సత్యం రాజేశ్, క్రాంతి కిరణ్, సాంచీ రాయ్, మేఘన కీలక పాత్రల్లో నటించారు. మోహన్ శ్రీవత్స దర్శకత్వంలో మారుతి సమర్పణ.. వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద విజయ్ పాల్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది.
కథ:
డాక్టర్ శ్యామ్ కత్తు (సత్యరాజ్) పేరున్న సైకియాట్రిస్ట్. ఓ ప్రమాదంలో కొడుకు, కోడలు చనిపోవడంతో మనవరాలు నిధి (మేఘన) బాధ్యతను తానే తీసుకుని అల్లారుముద్దుగా పెంచుకుంటాడు. ఆగస్ట్ 15న నిధి కిడ్నాప్‌కు గురవుతుంది. మనవరాలి జాడ కోసం పోలీసులను ఆశ్రయిస్తాడు శ్యామ్. ఇన్స్‌పెక్టర్ (వీటివి గణేష్) కానిస్టేబుల్ చంద్ర (సత్యం రాజేశ్)కు ఈ కేసును అప్పగిస్తాడు. ఇదొక కోణం. మరోవైపు రామ్ (వశిష్ట) విదేశాలకు వెళ్లి స్థిరపడాలని, తల్లిని బాగా చూసుకోవాలని కలలు కంటాడు. అయితే ఆర్థిక పరిస్థితి సహకరంచదు. అతని స్నేహితుడు, హైదరాబాద్ నగరంలో ఒక ప్రాంతానికి డాన్‌గా ఉన్న వాకిలి పద్మకు మేనల్లుడు అయిన దేవ్ (క్రాంతి కిరణ్) చెడు వ్యసనాలకు అలవాటు పడి అప్పుల పాలవుతాడు. కష్టాలు తీరడానికి రామ్, దేవ్ కలసి అడ్డదారిలో డబ్బు సంపాదించాలనుకుంటారు. దాని కోసం వారేం చేశారు? తప్పిపోయిన నిధి ఏమయింది? మనవరాలి కోసం శ్యామ్ ఏం చేశాడు? నిధి మిస్సింగ్‌కు రామ్, దేవ్‌కి మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఈ కథకు బార్బరికుడికి సంబంధం ఏంటి? అన్నదే మిగతా కథ.
విశ్లేషణ:
బార్బరీకుడు త్రిబాణాలతో కురుక్షేత్రంను ఆపగలడని, ఆయన దగ్గర ఉండే మూడు బాణాలకు ఒక్కో ప్రత్యేకత ఉంటుందని వాటిని తెలియజేస్తూ ఆసక్తికరంగా కథను ప్రారంభించాడు దర్శకుడు. అలాగని ఇది మైథలాజికల్ సినిమా కాదు. కీలక పాత్రధారికి బార్బరికుడు అనే క్యారెక్టర్‌ను ప్రేరణగా తీసుకున్నారంతే. ఆ తర్వాత తాత - మనవరాలి స్టోరీలోకి తీసుకెళ్లాడు. ఫస్ట్ హాఫ్ వేగంగా సాగుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ సూపర్ అనేలా ఉంటుంది. ఇంటర్వెల్ తర్వాత కానిస్టేబుల్ సాయంతో సత్యరాజ్ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టినప్పటి నుంచి కథలో సంఘర్షణ, మరింత ఆసక్తి పెరుగుతాయి. కానీ సెకెండ్ హాఫ్ స్లోగా నడుస్తుంది. కథ అక్కడక్కడే తిరుగుతున్న భావన కలుగుతుంది. కేసును ఛేదించే క్రమంలో బార్బరికుడు ఏం చేశాడనేది ఇక్కడ సత్యరాజ్ పాత్రకు లింక్ చేయడం ఆసక్తి కలిగించింది. క్లైమాక్స్ ట్విస్ట్‌లు అలరిస్తాయి. పరిస్థితుల వల్ల మనుషుల్లో ఎలాంటి మార్పులొస్తాయో ఈ కథలో చెప్పారు. రాముడి వేషంలో రావణుడిలా మన చుట్టూ ఉన్న వాళ్ళని కనిపెట్టాలి అంటూ అమ్మాయిలకు సందేశం ఇచ్చారు. అయితే ఉదయ భాను, దేవ్ సన్నివేశాల్లో చాలా చోట్ల లాజిక్స్ మిస్ అయ్యాయి.
నటీనటులు, సాంకేతిక నిపుణులు పనితీరు...
మానసిక నిపుణుడిగా శ్యామ్ కత్తు పాత్రకు సత్యరాజ్ న్యాయం చేశారు. కేసు చేధించే క్రమంలో మాటలతో కాకుండా కళ్ళతోనే ఎక్కువగా అభినయించారు. సత్యరాజ్ మనవరాలు నిధి పాత్రలో మేఘన నటన బావుంది. ఎక్కువ కథ ఆమె చుట్టూ తిరుగుతుంది. పలు చిత్రాల్లో నెగటివ్ పాత్రలు చేసిన వశిష్ట ఎన్ సింహా ఇందులో పాజిటివ్, నెగటివ్ రెండు రకాల పాత్రలు చేశాడు. మంచి జీవితం కోసం విదేశాలకు వెళ్ళాలని, తల్లిని బాగా చూసుకోవాలనే కొడుకుగా మంచి నటన ప్రదర్శించాడు. కొత్తగా వెండితెరకు పరిచయమైన క్రాంతి కిరణ్ ఫర్వాలేదనిపించాడు. ఉదయభాను చాలా గ్యాప్ తర్వాత వెండితెరపై కనిపించింది. వాకిలి పద్మగా లేడీ డాన్ పాత్రలో మెప్పించింది. నటనకు మంచి ఆస్కారం ఉన్న పాత్రే. కానీ ఒక పాట, కొన్ని సీన్లకే పరిమితం చేశారు. సత్యం రాజేశ్ పాత్ర కీలకం. పోలీస్ పాత్రకు తన వంతు న్యాయం చేశాడు. సాంచీ రాయ్, మేఘన ఫర్వాలేదనిపించారు. వీటీవీ గణేష్ పాత్ర ఓకే అనేలా ఉంది. కానీ అంతగా నవ్వులు పండలేదు. కుశేందర్ రమేష్ రెడ్డి సినిమాటోగ్రఫీ బావుంది. నైట్ మోడ్ సీన్స్ బాగా తెరకెక్కించాడు. ఎడిటర్ ఇన్వెస్టిగేషన్ సీన్స్‌లో అక్కడక్కడా కత్తెర వేసుంటే బావుండేది. ఇన్ఫ్యూజన్ బ్యాండ్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు ఎసెట్. అయితే పాటలు అంతగా ఆకట్టుకునేలా లేవు. నిర్మాణ విలువలు కూడా బావున్నాయి. అయితే కథగా చూస్తే కొత్తదేమీ కాదు. రెగ్యులర్ రివేంజ్ డ్రామానే. కథను నడపడంలో దర్శకుడు కొంత మేర సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. మాటలు బావున్నాయి. టైటిల్, ట్రైలర్ చూసి సోషియో ఫాంటసీ అంశాలు ఉంటాయని ఆశిస్తే నిరాశ తప్పదు.రివేంజ్ డ్రామాలు ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చుతుంది.
ట్యాగ్‌లైన్: ప్రేక్షకులపై 'త్రిబాణాలు'
రేటింగ్: 2.5/5