The Great Pre-Wedding Show Review: ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ ఎలా ఉందంటే
ABN, Publish Date - Nov 06 , 2025 | 12:03 PM
పల్లెలో సాగే ప్రేమకథలకు ఆదరణ ఎప్పుడూ ఎక్కువే. దానికి హాస్యం జోడైతే హిట్టు పక్కా. అలాంటి కథాంశంతో వచ్చిన చిత్రం ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’. తిరువీర్, టినా శ్రావ్య జంటగా నటించారు. రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వంలో పప్పెట్ షో ప్రొడక్షన్, 7పీఎం ప్రొడక్షన్ సంస్థలు నిర్మించాయి. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం
సినిమా రివ్యూ: 'ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' (The Great Pre-Wedding Show Review)
విడుదల తేది: 7-11-2025
పల్లెలలో సాగే ప్రేమకథలకు ఆదరణ ఎప్పుడూ ఎక్కువే. దానికి హాస్యం జోడైతే హిట్టు పక్కా. అలాంటి కథాంశంతో వచ్చిన చిత్రం ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’. తిరువీర్, టినా శ్రావ్య జంటగా నటించగా... నరేంద్ర రవి, రోహన్‌రాయ్, యామిని నాగేశ్వర్ కీలక పాత్రలు పోషించారు. రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వంలో పప్పెట్ షో ప్రొడక్షన్, 7పీఎం ప్రొడక్షన్ సంస్థలు నిర్మించిన ఈ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉండో చూద్దాం…
కథ: (The Great Pre-Wedding Show)
ఉత్తరాంధ్రలోని ఓ గ్రామంలో రమేష్(తిరువీర్) ఫోటో స్టూడియో కమ్ జిరాక్స్ షాప్ నడుపుతుంటాడు. హేమ(టీనా శ్రావ్య) గ్రామ పంచాయతీలో సెక్రెటరీగా పనిచేస్తుంటుంది. ఒకరినొకరు ఇష్టపడతారు. కానీ చెప్పుకోరు. ఇద్దరి మధ్య ప్రేమ అలా నడుస్తుంటుంది. ఈ తరుణంలో ఆనంద్ (నరేంద్ర రవి)కి, సౌందర్య(యామిని)కి పెళ్లి కుదురుతుంది. తన పెళ్లి, ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ గ్రాండ్‌గా చేయాలని రమేశ్‌కి ఫొటో షూట్ వర్క్ ఇస్తాడు ఆనంద్. ప్రీ వెడ్డింగ్ షూట్ అంతా పూర్తయ్యాక... డేటా ఉన్న చిప్‌ను సిస్టమ్‌లో కాపీ చేయమని తన దగ్గర పని చేసే కుర్రాడు (రోహన్ రాయ్)కి ఇస్తాడు. అతను ఆ చిప్‌ను పోగొడతాడు. ఈ విషయం తెలిస్తే పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఉన్న ఆనంద్ ఏమన్నా చేస్తాడని ప్రీ వెడ్డింగ్ ఫొటోలు అడగకుండా ఉండాలంటే ఆనంద్, సౌందర్యల పెళ్లి ఆగిపోవాలని రమేశ్, హేమతో కలిసి రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. అనుకోకుండా ఆనంద్ పెళ్లి ఆగిపోతుంది. అసలు ఆ పెళ్లి ఎలా ఆగిపోయింది. ఆనంద్, సౌందర్య పెళ్ళి ఆగాలని కోరుకున్న రమేశ్ వారి పెళ్ళి జరగాలని ఎందుకు కోరుకుంటాడు? రమేశ్, హేమ మూగప్రేమ ఏమైంది అన్నదే ఈ సినిమా కథ.
విశ్లేషణ:
వెబ్ సిరీస్ నుంచి సినిమాల్లోకి వచ్చాడు తిరువీరు. మొదటి నుంచి అతని కథల ఎంపిక భిన్నంగా ఉంటుంది. ఈ కథ కూడా ఆ కోవకే చెందుతుంది. గ్రామీణ నేపథ్యంలో సాగే చిన్న ప్రేమకథ ఇది. ఫొటోగ్రాఫర్‌గా పని చేసే హీరో ప్రీ వెడ్డింగ్ షూట్ చేసి మెమరీ కార్డ్ పోగొట్టడం, దాన్ని కప్పిపుచ్చుకునేందుకు పెళ్లినే ఆపేయాలనుకోవడం, మరోపక్క తను ఇష్టపడే అమ్మాయి ముచ్చట్లతో ఫస్టాఫ్ సాగుతుంది. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకూ వినోదాత్మకంగా ఉంది. అయితే పెళ్లి చెడగొట్టే క్రమంలో.. సాగే సీన్లు కొంత బోర్ కొడతాయి. ఇక సెకెండాఫ్‌లో ఆగిన పెళ్లి జరపాలని చేసే ప్రయత్నాలు కూడా కొంత మేరకు భావోద్వేగాన్ని పండించాయి. ఇందులో ఎక్కడా హీరోహీరోయిన్ క్యారెక్టర్స్ అనే గొడవ లేదు. తెరపై పాత్రలే కనిపిస్తాయి. పాత్రల చిలిపి చేష్టలు, అమాయకత్వం కామెడీని జనరేట్ చేస్తూ ఉంటుంది. సినిమా రియాలిటీ దగ్గరగా, సహజంగా అనిపిస్తుంది. ఉత్తరాంధ్ర యాస కొందరు ఆర్టిస్ట్‌లకు సెట్ కాలేదు. టోటల్ గా థియేటర్లలో నవ్వుల పువ్వులు విరబూస్తాయి.
నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు...
తిరువీర్ నటనలో కాస్త అమాయకత్వం ఉంటుంది. అది ఈ సినిమాకు అస్సెట్ అయింది. పల్లెటూరి ఫొటోగ్రాఫర్‌గా రమేశ్ పాత్రకు న్యాయం చేశాడు. పాత్రోచితంగా డైలాగ్ డెలివరీ కూడా బావుంది. టీనా శ్రావ్య క్యూట్‌గా, బబ్లీగా కనిపించింది. చక్కని నటన, ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకుంది. ఒక హీరోతో సమానంగా ఆనంద్ పాత్రధారి నరేంద్ర తెరపై సందడి చేశాడు. సినిమాను ఎక్కువగా అతనే మోశాడనిపిస్తుంది. నవ్విస్తూనే ఎమోషనల్ సీన్స్ లో చక్కగా పెర్‌ఫామ్ చేశాడు. ఈ పాత్రతో అతనికి మరిన్ని అవకాశాలు రావడం ఖాయం. ఈ మధ్యన మోస్ట్ వాంటెడ్ చైల్డ్ ఆర్టిస్ట్ అయిన రోహన్ రాయ్ కూడా చక్కగా వినోదాన్ని పంచాడు. మిగతా పాత్రధారులంతా విలేజ్ వాతావరణానికి తగ్గట్లు పాత్రల్లో ఇమిడిపోయారు. ఇక సాంకేతిక నిపుణులకొస్తే సోమశేఖర్ సినిమాటోగ్రఫీ బావుంది. గ్రామీణ అందాల్ని చక్కగా క్యాప్చర్ చేశాడు. కథకు తగ్గట్టు లొకేషన్స్ సెట్ అయ్యాయి. సురేశ్ బొబ్బిలి సంగీతం సినిమాకు ఎసెట్. నేపథ్య సంగీతం బావుంది. నిర్మాణ విలువల గురించి చెప్పటానికి ఏమీ లేదు. గ్రామీణ నేపథ్యంలో సింపుల్ లవ్‌స్టోరీ క్యూట్‌గా చెప్పాడు దర్శకుడు. వినోదంతోపాటు, కథకు కావలసినంత మేర భావోద్వేగం ఉంది. సినిమాలో ఎలాంటి వల్గారిటీ లేదు. అంచనాలు లేకుండా సినిమాకి వెళ్లి హాయికి నవ్వుకుని రావచ్చు.
ట్యాగ్‌లైన్: నవ్వుల వెడ్డింగ్ షో
రేటింగ్: 2.75/5