సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Jatadhara Movie: సుధీర్ బాబు.. జటాధర మూవీ రివ్యూ

ABN, Publish Date - Nov 07 , 2025 | 01:40 PM

సుధీర్ బాబు తాజా చిత్రం 'జటాధర' శుక్రవారం జనం ముందుకు వచ్చింది. సోనాక్షి సిన్హా, దివ్యా ఖోస్లా, రాజీవ్ కనకాల, ఝాన్సీ, శిల్పా శిరోద్కర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.

Jatadhara Movie

హీరో సుధీర్ బాబుకు హిట్ వచ్చింది ఎంతకాలం అయ్యింది అంటే చెప్పడం కష్టమే! 2018లో వచ్చిన 'సమ్మోహనం' తర్వాత ఆ స్థాయి సక్సెస్ మళ్ళీ దక్కలేదు. ఎలాంటి కథలు ఎంచుకుంటే సక్సెస్ లభిస్తుందో తేల్చుకోలేక 'శ్రీదేవి సోడా సెంటర్, హంట్, మామా మశ్చింద్ర' వంటి చిత్ర విచిత్రమైన సినిమాలను సుధీర్ బాబు చేశాడు. అతని లేటెస్ట్ మూవీ 'జటాధర' కూడా ఇప్పుడు ఆ జాబితాలోకే చేరిపోయింది.

అప్పుడెప్పుడో తొమ్మిదేళ్ళ క్రితం సుధీర్ బాబు హిందీలో 'బాఘీ' మూవీలో విలన్ గా నటించాడు. మళ్ళీ ఇంతకాలానికి తెలుగు, హిందీ భాషల్లో 'జటాధర'మూవీ చేశాడు. ఉత్తరాది నిర్మాతలు తీసిన 'జటాధర'లో కీలక పాత్రలను అక్కడివారే పోషించారు. దివ్యా ఖోస్లా, శిల్పాశిరోద్కర్ ఈ మూవీతో టాలీవుడ్ రీ-ఎంట్రీ ఇస్తే... సోనాక్షి సిన్హా ఫస్ట్ టైమ్ 'జటాధర'తో తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. ఈ మధ్య కాలంలో డివోషనల్ బ్యాక్ డ్రాప్ ఉన్న హారర్ థ్రిల్లర్స్ విజయం సాధిస్తుండటంతో దర్శకులు వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ అలాంటి కథాంశంతోనే జనం ముందుకు వచ్చారు. రెగ్యులర్ పాట్రన్ కు కాస్తంత భిన్నంగా లంకె బిందెలు, పిశాచ బంధం అంటూ కొత్తగా ట్రై చేశారు కానీ ఇవేవీ వర్కౌట్ కాకపోగా ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టాయి.


'జటాధర' కథేమిటంటే... శివ (సుధీర్ బాబు)కు ఆత్మలంటే నమ్మకం లేదు. ఆ పేరు చెప్పి ఎవరైనా మోసం చేయాలని చూస్తే వారి గుట్టు రట్టు చేస్తుంటాడు. దీనికి భిన్నంగా మనీష్‌ శర్మ (అవసరాల శ్రీనివాస్) కంటికి కనిపించని ఆత్మలు ఉంటాయని చెబుతాడు. శివకు ఓ చంటి పిల్లాడిని ఇద్దరు వ్యక్తులు చంపుతున్నట్టు కల వస్తుంటుంది. దాన్ని ఛేదించాలని అనుకుంటాడు కానీ దారి దొరకదు. అదే సమయంలో అతన్ని ప్రేమించిన సితార (దివ్యాఖోస్లా ) శివ జాతకాన్ని ఓ పండితుడికి చూపించడంతో అతనితో పాటు కుటుంబ సభ్యులకూ ప్రాణాపాయం ఉందని చెబుతాడు. ఆయన చెప్పినట్టే వాళ్ళు తృటిలో ప్రమాదం నుండి బయటపడతారు. ఇదే సమయంలో రుద్రారం గ్రామంలో లంకె బిందెలకు సంబంధించిన చిక్కుముడిని తొలగించడానికి వెళ్ళిన మనీష్‌ అసిస్టెంట్ చనిపోతాడు. ఈ మిస్టరీని ఛేదించడానికి రుద్రారం గ్రామానికి శివ బయలు దేరతాడు. ఈ విషయం తెలిసి తల్లిదండ్రులు అతన్ని వారిస్తారు. శివకు వచ్చే కలకు, ఆ గ్రామానికి ఉన్న సంబంధం ఏమిటీ? శివ జాతకంలో ఎందుకు అన్ని ఆపదలు పొంచి ఉన్నాయి? లంకె బిందెలకూ శివకు ఉన్న బంధం ఏమిటీ? శివ తల్లిదండ్రులు అతనికి చెప్పకుండా దాచిపెట్టిన రహస్యం ఏమిటీ? అనేది మిగిలిన సినిమా.

పూర్వకాలంలో మనుషులు తమ బంగారాన్ని లంకె బిందెల్లో పెట్టి భూమిలో దాచిపెట్టే వారని కథలు కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. వాటికి పిశాచ బంధనం వేస్తే ఎవరు దాని జోలికి పోలేరనే నమ్మకం. అలా రుద్రారం గ్రామంలో ఓ ఇంటిలో ఉన్న లంకె బిందులను సొంతం చేసుకోవాలనుకున్న ఓ దంపతుల ధనదాహ పర్యవసానం ఏమిటనేది ఈ సినిమా బేసిక్ పాయింట్. అయితే సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకూ ఎలాంటి ఆసక్తి కలిగించకుండా దర్శకులు ఇద్దరూ బేజా ఫ్రై చేసేశారు. ఏ సన్నివేశం ఎందుకు వస్తోందో? అది ఎటు వైపుకు దారి తీస్తోందో అర్థం కాని పరిస్థితి. చెప్పుకోవడానికి మంచి స్టార్ కాస్టే ఉన్నా... వాళ్ళను సరిగ్గా దర్శకులు ఉపయోగించుకోలేదు. నిజానికి చెప్పుకోవడానికి ఇందులో బలమైన కథే లేదు, దానికి తోడు స్క్రీన్ ప్లే ఇంకా దారుణం. చైల్డ్ సెంటిమెంట్ అనేది ఉన్నా... దాన్నీ ఆకట్టుకునేలా తీయలేదు.


సుధీర్ బాబు తన వంతు కష్టం తాను పడ్డాడు. కానీ అదంతా అడివి కాచిన వెన్నెల అయిపోయింది. సోనాక్షి సిన్హా టాలీవుడ్ ఎంట్రీ అంటే జనాలు ఏదేదో ఊహించుకుంటారు. ఆమె శరీర ఆకృతి కారణంగా ధన పిశాచి పాత్రలో నిండుగా కనిపించింది. కెరీర్ పరంగా ఇంతవరకూ చేసిన చిత్రాలకు ఇది పూర్తి భిన్నమైన పాత్రే. అందులో సందేహం లేదు. కానీ ఈ పాత్ర ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ఏ ఫలితం లేకపోయింది. టీ-సీరిస్ అధినేత భూషణ్‌ కుమార్ భార్య దివ్యా ఖోస్లా సినిమాలు కాకుండా వీడియో ఆల్బమ్ చేసుకుంటేనే బెటర్. శిల్పా శిరోద్కర్ పాత్రనూ దర్శకుడు ఏమంత గొప్పగా మలచలేదు. ఇందులో ఇతర ప్రధాన పాత్రలను రాజీవ్ కనకాల, ఝాన్సీ, రవిప్రకాశ్‌, ఇందిరా కృష్ణన్, శుభలేఖ సుధాకర్, అవసరాల శ్రీనివాస్, ప్రదీప్ రావత్, నవీన్ నేనే, అలేఖ్య తదితరులు పోషించారు. నేపథ్య సంగీతం తలనొప్పి తెప్పించేలా ఉంది. వీఎఫ్ఎక్స్ కూడా ఏమంత గొప్పగా లేదు. 'జటాధర' టైటిల్ చూసి ఇదేదో డివోషనల్ కంటెంట్ మూవీ అనుకుని థియేటర్ కు వెళ్ళే వారు తీవ్ర నిరాశకు గురికాక తప్పదు.

రేటింగ్ : 2/5

ట్యాగ్ లైన్: బీభత్సం!

Also Read: The Girlfriend Movie: రష్మిక మందణ్ణ.. ది గర్ల్‌ ఫ్రెండ్‌ మూవీ రివ్యూ! సినిమా ఎలా ఉందంటే?

Also Read: The Great Pre-Wedding Show Review: ‘ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్‌ షో’ ఎలా ఉందంటే...

Updated Date - Nov 07 , 2025 | 03:03 PM