Ari Movie Review: అరి మూవీ రివ్యూ
ABN, Publish Date - Oct 10 , 2025 | 02:50 PM
'పేపర్ బాయ్' చిత్రంతో దర్శకుడిగా మారిన జయశంకర్ తెరకెక్కించిన తాజా చిత్రం 'అరి'. శుక్రవారం జనం ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం.
గతంలో 'పేపర్ బాయ్' సినిమాను రూపొందించిన జయశంకర్ (Jayashankarr) మళ్ళీ ఇంతకాలానికి 'అరి' (Ari) చిత్రంతో జనం ముందుకు వచ్చాడు. అరిషడ్వర్గాలైన కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను ఆరు పాత్రలకు అన్వయిస్తూ 'అరి' చిత్రాన్ని జయశంకర్ రూపొందించాడు. శుక్రవారం విడుదలైన ఈ సోషియో ఫాంటసీ మూవీని శ్రీనివాస్ రామిరెడ్డి, శేషు రెడ్డి మారం రెడ్డి, నాయుడు నిర్మించారు.
'ఇక్కడ అందరి కోరికలు తీర్చబడను' అంటూ వివిధ మాధ్యమాలలో వచ్చిన ఓ ప్రకటనను చూసి ఆరుగురు వ్యక్తులు విడివిడిగా పురాతన గ్రంధాలయంలో ఓ వ్యక్తిని కలుస్తారు. ఆ ఆరుగురుకీ అతను ఆరు రకాల టాస్క్ లు ఇస్తాడు. వాటిని పూర్తి చేస్తే వారి కోరికలు తీరతాయని చెబుతాడు. అతని మాటల్ని నమ్మి తమకు ఇష్టం లేని పనులు చేయడానికి కొందరు, అనైతికమైన పనులను చేయడానికి ఇంకొందరు సిద్థపడతారు. మల్టీ మిలియనీర్ విప్రనారాయణ్ పాశ్వాన్ (సాయికుమార్ Saikumar) కు తన తర్వాత తరాలు కూడా అలానే ఉండాలనే కోరిక. కుటుంబ సభ్యులు తన వెనుక గోతులు తీస్తున్నారని తెలిసి, వారందరికంటే తాను గొప్పవాడిని కావాలనేది గుంజన్ (శుభలేఖ సుధాకర్ Subhalekha Sudhakar) కల. గుప్త నిధిని చేజిక్కించుకోవాలనే ఆరాటం పోలీస్ అధికారి అయిన చైతన్య (శ్రీకాంత్ అయ్యంగార్ Srikanth Ayyangar) ది. చనిపోయిన భర్త ప్రేమను తిరిగి పొందాలనే పిచ్చికోరిక మధ్య తరగతి గృహిణి లక్ష్మీ (సురభి ప్రభావతి)ది. తన గైడెన్స్ తోనే ఎదిగిన తోటి ఎయిర్ హోస్టస్ పై ద్వేషంతో రగిలిపోతుంటుంది ఆత్రేయి (అనసూయ భరద్వాజ్). పోర్న్ స్టార్ సన్ని లియోన్ తో ఓ రాత్రి గడపాలని ఊవ్విళ్ళూరుతూ పిచ్చి ఊహల్లో విహరిస్తుంటాడు అముల్ కుమార్ (వైవా హర్ష)... వీళ్ళ కోరికలు తీరడం కోసం లైబ్రరీలోని వ్యక్తి ఏ టాస్కులు ఇచ్చాడు? ఏ పరిస్థితుల్లో వారు వాటిని చేయడానికి సాహసించారు? చివరకు ఎలా యూ టర్న్ తీసుకున్నారనేదే అసలు కథ.
రామాయణ, భారత ప్రవచనంతో సినిమా ప్రారంభం కావడంతో... కోరికలు తీర్చుతానని హామీ ఇస్తున్న వ్యక్తి ఎవరూ అనేది మనకు అర్థమైపోతుంది. అలానే క్లయిమాక్స్ సైతం ఊహకు అందుతుంది. ఇక ప్రధాన పాత్రధారులు ఆరుగురిలో మార్పుకు దర్శకుడు చూపించిన కారణాలు బలంగా లేవనేది... సినిమాలోని రెండు పాత్రల ద్వారా దర్శకుడే చెప్పించడం చిత్రంగా అనిపిస్తుంది. నమ్మిన వాళ్ళు నమ్ముతారు... నమ్మని వారు నమ్మరు అనేది దర్శకుడి ధోరణి అని అర్థమైపోతుంది.
సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకూ ఓ ట్రాన్స్ లో డైరెక్టర్ జయశంకర్ సీన్ టు సీన్ తీసుకుంటూ వెళ్ళిపోయాడు. ఇందులో కొన్ని పాత్రలకు ఇచ్చిన లింక్ ఆసక్తికరంగా ఉంది. మిగిలిన కొన్ని పాత్రల తీరు చిత్రంగా అనిపిస్తుంది. ఉన్న రెండు మూడు పాటలు కూడా ప్రమోషన్ కోసం తీసినట్టున్నాయి తప్పితే... సినిమా కంటెంట్ ను ముందుకు తీసుకెళ్ళేవిగా లేవు. అరిషడ్వర్గాలకు లోను కాని మనుషులు ఈ సమాజయంలో ఉండటం చాలా అరుదు. కానీ వాటి నుండి బయట పడటం కోసం ఇచ్చే టాస్క్ లు, వాటిని అమలు చేయడానికి వారు సిద్థపడటం... ఏమాత్రం కన్వెన్సింగ్ గా లేవు. దాంతో బలమైన పునాది లేకుండా భవంతిని కట్టడానికి దర్శకుడు జయశంకర్ ప్రయత్నించినట్టు అయ్యింది.
నటీనటుల విషయానికి వస్తే... ప్రధాన పాత్రధారులు సాయికుమార్ (Sai Kumar), సురభి ప్రభావతి (Surabhi Prabhavati), శుభలేఖ సుధాకర్ (Shubaleka Sudhakar), అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj), శ్రీకాంత్ అయ్యంగార్ (Srikanth Iyengar), వైవా హర్ష (Viva Harsha) బాగా చేశారు. ఇందులో లైబ్రేరియన్ గా కీలక పాత్రను వినోద్ వర్మ (Vinod Varma) చక్కగా చేశాడు. ఇతర పాత్రలలో సుమన్ (Suman), ఆమని (Aamani), రాజ్ తిరందాస్, శ్రీనివాసరెడ్డి, చమ్మక్ చంద్ర, మేకా రామకృష్ణ, అక్షయా శెట్టి, రిధిమా పండిట్, నవీనారెడ్డి, పావని రెడ్డి, జెమినీ సురేశ్, అంజలి తదితరులు కనిపిస్తారు. కృష్ణప్రసాద్, శివశంకర వర ప్రసాద్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించగా, అనూప్ రూబెన్స్ (Anup Rubens) సంగీతాన్ని సమకూర్చాడు. ఎంచుకున్న అంశం, దాన్ని ప్రేక్షకులకు చూపించాలనే దర్శకుడి ఇన్ టెన్షన్ మంచిదే అయినా... ఎక్కడో సోల్ మిస్ అయిపోయింది. దీన్ని ఇంకాస్తంత వివరంగా ఓ వెబ్ సీరిస్ గా తీసి ఉంటే బెటర్ గా ఉండేది.
రేటింగ్: 2.5/5
ట్యాగ్ లైన్ : 'అరి... హరి' కథ!