The 100 Review:మొగలి రేకులు సాగర్ నటించిన ది 100 మెప్పించిందా..
ABN, Publish Date - Jul 11 , 2025 | 12:28 AM
మొగలి రేకులు సీరియల్‌లో ఆర్‌కే నాయుడి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు చేరువయ్యారు సాగర్. మాన్ అఫ్ ది మ్యాచ్, సిద్థార్థ, షాదీ ముబారక్ సినిమాల్లో హీరోగా నటించి మంచి మార్కులే సంపాదించుకున్నాడు. కాస్త విరామం తర్వాత ‘ది 100’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు..
సినిమా రివ్యూ: 'ది 100'
విడుదల తేది: 11–7–2025
‘మొగలి రేకులు’ సీరియల్‌లో ఆర్‌కే నాయుడి (Rk Sagar) తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు చేరువయ్యారు సాగర్. ఆర్‌కే నాయుడి పాత్రకు మహిళల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఆ ఫేమ్‌తో సినిమాల్లో ఎంట్రీ ఇచ్చారు సాగర్. మాన్ అఫ్ ది మ్యాచ్, సిద్థార్థ, షాదీ ముబారక్ సినిమాల్లో హీరోగా నటించి మంచి మార్కులే సంపాదించుకున్నాడు. కాస్త విరామం తర్వాత ‘ది 100’ (The 100) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.. రాఘవ్ ఓంకార్ శశిధర్ ఈ చిత్రానికి దర్శకుడు. రమేష్ కరుటూరి, వెంకీ పూశడపు నిర్మాతలు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం. ( The 100 movie Rating)
కథ: (The 100 Movie Review)
విక్రాంత్(ఆర్కే సాగర్).. ఐపీఎస్ ట్రైనింగ్ పూర్తి చేసుకొని ఏసీపీగా బాధ్యతలు చేపడతాడు. అలా డ్యూటీ ఎక్కడో లేదో నగరంలో రాబరీ గ్యాంగ్ కేసును టేకప్ చేస్తాడు. అదే సమయంలో తను ఇష్టపడిన యువతి ఆర్తి(మిషా నారంగ్) కూడా రాబరీ గ్యాంగ్ బాధితురాలని తెలుస్తుంది. ధాంతో విక్రాంత్ ఆ కేసును మరింత సీరియస్‌గా తీసుకుంటాడు. విచారణలో అతనికి ఓ సంచలన నిజం తెలుస్తుంది. ఆ నిజం ఏంటి? ఆ గ్యాంగ్ ఆర్తి కుటుంబాన్నే ఎందుకు టార్గెట్ చేసింది? సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మధు (విష్ణు ప్రియ) ఆత్మహత్య వెనుక ఉన్న నిజం ఏంటి? బిజినెస్‌మ్యాన్, వల్లభ (తారక్ పొన్నప్ప), విద్యా(ధన్య బాలకృష్ణ) ఎవరు? అనేక చిక్కుముడులు ఉన్న ఈ కేసును విక్రాంత్ ఈ కేసుని ఎలా పరిష్కరించాడనేది కథ.
విశ్లేషణ: (The 100 Movie Rating)
పోలీస్ నేపథ్యం ఉన్న సినిమాలు, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌కు ఎప్పుడు ఓకే ఫార్మెట్ ఉంటుంది. విలన్ క్రైమ్ చేస్తే దాన్ని చేధించడం పోలీస్ పని. దీనికి తోడు టర్న్‌లు, ట్విస్ట్‌లు అదనంగా ఉంటాయి. అయితే ఈ క్రైమ్ జరిగిన తీరు, దాని చుట్టూ అల్లుకున్న కథ, హీరో తన విజన్‌లో విలన్‌ను ఎలా పట్టుకున్నాడనేది ముఖ్యం. దాని మీదే సినిమా ఫలితం ఉంటుంది. ఈ తరహా చిత్రాల్లో ట్విస్ట్‌లు, టర్న్‌లు ప్రేక్షకుడి ఊహకు అందకుండా ఉండాలి. స్ర్కీన్‌ప్లే టైట్‌గా ఉండాలి. థ్రిల్ చేసే సన్నివేశాలుండాలి. అప్పుడే ప్రేక్షకుడు కన్ను ఆర్పకుండా సినిమాలో లీనమవుతాడు. అక్కడే దర్శకుడి ప్రతిభ బయటపడుతుంది. అయితే ఇక్కడ దర్శకుడు కథను డెలివర్ చేయడంలో కాస్త తగబడ్డాడు. అమ్మాయి ఆత్మహత్య సీన్‌తో కథను ఆసక్తికరంగా మొదలుపెట్టాడు. తదుపరి ఐపీఎస్ అధికారిగా హీరో ఎంట్రీ సీన్‌ని చక్కగా ప్లాన్ చేశాడు. రాబరీ గ్యాంగ్ కేసుని టేకాప్ చేసిన తర్వాత కథపై ఆసక్తి పెరుగుతుంది. రాబరీ గ్యాంగ్‌ని పట్టుకునేందుకు హీరో చేసే ప్రయత్నం.. ఓ ట్విస్ట్.. ఆసక్తిని పెంచుతుంది. రాబరీ గ్యాంగ్ బంగారం మాత్రమే ఎత్తుకెళ్తడం వెనుక ఉన్న రహస్యం ఏంటనే క్యూరియాసిటీ ప్రేక్షకులకు కలుగుతుంది. గ్యాంగ్ దొరికిన తర్వాత ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. ఇక సెకండాఫ్ కాస్త ఎమోషనల్‌గా ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి కొత్త పాత్రలు, ప్లాష్‌బ్యాక్‌తో రన్ కాస్త స్లో అవుతుంది. అదంతా కూడా ఊహకు అందేలా ఉంటుంది. క్లైమాక్స్‌లో సందేశం బావుంది. అది ప్రేక్షకుల్ని ఆలోజింపచేస్తుంది.
మొగలి రేకులు సీరియల్‌లో ఆర్కే నాయుడిగా పోలీస్ పాత్ర పోషించి మెప్పించిన సాగర్ ఈ చిత్రంలోనూ అదే స్థాయి నటనతో ఆకట్టుకున్నాడు. ఐపీఎస్ అధికారిగా పాత్రలో ఒదిగిపోయాడు. బాడీ లాంగ్వేజ్, లుక్స్ అచ్చు పోలీస్ లా ఉండడం అతడిలో మెయిన్ ప్లస్ పాయింట్. యాక్షన్ సీన్స్ అదరగొట్టాడు. హీరోయిన్ మిషా నారంగ్ తన నటనతో ఆకట్టుకుంది. పాత్రలో భావోద్వేగాలను బాగా క్యారీ చేసింది, విష్ణు ప్రియ, విద్య పాత్రలో ధన్య బాలకృష్ణ పాత్రలకు న్యాయం చేశారు. తారక్ పొన్నప్ప విలనిజం బాగా పండించాడు. తల్లి పాత్రలో కల్యాణి నటరాజన్ ఎప్పట్లానే చాలా చక్కని స్ర్కీన్ ప్రెజన్స్‌తో అలరించారు. గిరిధర్, ఆనంద్ తదితరులు పరిధి మేరకు నటించారు. శ్యామ్ కె.నాయుడు సినిమాటోగ్రఫీ వర్క్ బావుంది. కానీ కలర్ గ్రేడింగ్ డల్‌గా ఉంది. హర్షవర్థన్ రామేశ్వర్ నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ అయింది. పాటలు ఆకట్టుకునేలా లేవు. ఎడిటర్ వర్క్ కూడా ఫర్వాలేదనిపించింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు ఉన్నాయి. ఇలాంటి ఇన్వెస్టిగేషన్ కథకు డీటెయిలింగ్ చాలా ముఖ్యం. అది లేకపోతే కథ రక్తి కట్టదు. అయితే పలు సన్నివేశాల్లో నాచురాలిటీ మిస్ అయింది. ఓ సందర్భంలో మర్డర్ స్పాట్‌ను చూపించే విధానంలో సహజత్వం కనిపించలేదు. దర్శకుడు రాఘవ్ ఓంకార్ శశిధర్ తెరపై అంతా సహజంగా చూపించాలనుకున్నాడు. ఆ తపన కనిపించింది కానీ. పూర్తి స్థాయిలో అది వర్కవుట్ కాలేదు. అక్కడక్కడా బలవంతంగా కమర్షియల్ అంశాలను జోడించాడు. కథ విషయంలో దర్శకుడి ఆలోచన బావుంది కానీ తెరకెక్కించే విధానంలో ఇంకాస్త వర్క్ చేసుంటే బావుండేది. లాజిక్కులు పెద్దగా మిస్ కాలేదు. కమర్షియల్ కోణంలోకి వెళ్లి సీన్స్‌ను డీవియేట్ చేయడం మినహాయిస్తే లాజిక్ పరంగా కథను బాగానే రన్ చేశాడు. ఒక షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ ఇక్కడి దాకా తీసుకురావడం గ్రేట్ అనే చెప్పాలి. ఓవరాల్‌గా దర్శకుడి ప్రయత్నం ఎంగేజింగ్‌గా ఉంది.
ట్యాగ్‌లైన్: ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ 'ది 100'
రేటింగ్:2.75/5