Usure movie : ఉసురే మూవీ రివ్యూ
ABN, Publish Date - Aug 01 , 2025 | 02:03 PM
రాశి ప్రధాన పాత్ర పోషించిన తమిళ చిత్రం 'ఉసురే'. ఈ సినిమా తెలుగులోనూ అదే పేరుతో విడుదలైంది. ఆగస్ట్ 1న జనం ముందుకు కొచ్చిన ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం.
చిన్న సినిమాలు సైతం ఇవాళ రెండు భాషల్లో విడుదల అయిపోతున్నాయి. దానికి తాజా ఉదాహరణ 'ఉసురే' (Usure) చిత్రం. తమిళంలో నవీన్ డి గోపాల్ (Naveen D Gopal) రూపొందించిన ఈ సినిమాను ఆగస్ట్ 1న తమిళంతో పాటు తెలుగులోనూ విడుదల చేశారు. తెలుగువారికి అసలు పరిచయమే లేని నటీనటులు యాక్ట్ చేసిన ఈ చిత్రంలో తెలిసిన ముఖం ఎవరిదైనా ఉందంటే రాశి (Rasi) దే!
కథ విషయానికి వస్తే... ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరిహద్దులోని చిత్తూరులోని ఓ గ్రామంలో జరిగే చిత్రమిది. గ్రానైట్ కంపెనీలో పనిచేస్తుంటాడు రాఘవ (టీజయ్ అరుణాచలం). అదే ఊరికి తన తల్లి అనసూయమ్మ (రాశి)తో కలిసి రంజన (జననీ గుణశీలన్) వస్తుంది. సింగిల్ మదర్ అయిన అనసూయమ్మ తన కూతురు రంజన ను పోకిరీలకు దూరంగా ఉంచే ప్రయత్నం చేస్తుంది. ఎవరైనా వెంటపడితే... గట్టిగా మందలించడానికీ వెనుకాడదు. ఫ్రెండ్ తో వచ్చిన మాట పట్టింపుతో రాఘవ తన ఇంటి ముందే ఉండే రంజనతో ప్రేమలో పడతాడు. తల్లి అంటే భయపడే రంజన అతన్ని ప్రేమించడానికి మొదట్లో ఆసక్తి చూపించదు. కానీ రాఘవ మంచితనం తెలిసి, చివరకు ఆమె కూడా ప్రేమలో పడుతుంది. అయితే బాధ్యతగల కొడుకుగా ఉంటూనే ఊరిలో కొందరితో రాఘవ గొడవ పెట్టుకోవడంతో వాళ్ళు అతన్ని చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అనసూయమ్మను ఒప్పించి రాఘవ, రంజన ను పెళ్ళి చేసుకున్నాడా? రాఘవ మీద పగబట్టిన వాళ్ళు తమ పంతం నెగ్గించుకున్నారా? కన్నకూతురితో ఈ పల్లెలోకి అడుగుపెట్టిన అనసూయమ్మ గతం ఏమిటీ? అనేది మిగతా సినిమా.
ప్రేమకథా చిత్రాలు తెలుగులో కొత్త కాదు. అయితే... అన్ని ప్రేమకథల ముగింపు సుఖాంతం అవ్వాలని ఏమీలేదు. ఇది కూడా అలాంటి ట్రాజడీ లవ్ స్టోరీనే. అయితే ప్రీ క్లయిమాక్స్ లోని ముగింపు ఓ మేరకు ప్రేక్షకుల మదిలో మెదులుతుంది. కానీ కొసమెరుపును మాత్రం ఊహించలేరు. ఆ రకంగా థియేటర్ల నుండి బయటకు వచ్చే వారి గుండెలు బరువువెక్కినా... ఓ స్థాయిలో సంతృప్తి చెందుతారు. అయితే సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకూ కథ నత్తనడకలో సాగడం ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది. పైగా నటీనటులంతా కొత్త వాళ్ళు కావడం, హీరోహీరోయిన్ల మధ్య ప్రేమ సన్నివేశాలు సైతం పేలవంగా ఉండటంతో ఎక్కడా ఆసక్తి అనేది కలగదు. పరిమితమైన బడ్జెట్ లో ఈ సినిమాను నిర్మాత మౌళి ఎం రాధాకృష్ణ నిర్మించారు. కిరణ్ జోజ్ నేపథ్య సంగీతం, సినిమా అంతా పరుచుకుని ఉన్న నేపథ్య గీతాలు మూవీని కాస్తంత నిలబెట్టాయి. తెలుగు పాటల సాహిత్యం అర్థవంతంగా ఉంది. హీరో స్నేహితుడి సంభాషణలు పంచ్ డైలాగ్స్ తో కాస్తంత అలరిస్తాయి.
ఈ మధ్య కాలంలో లవ్ స్టోరీల ముగింపు ట్రాజడీ కావడానికి పరువు హత్యలే కారణం అన్నట్టుగా చూపుతున్నారు. 'ఉసురే'లో నటీనటులంతా సహజ నటన ప్రదర్శించారు. రాశి ఊహకందని ఓ పాత్ర చేసి మెప్పించింది. హీరోహీరోయిన్ల పాత్రల్లో టీజయ్ అరుణాచలం, జననీ గుణశీలన్ చక్కగా ఇమిడిపోయారు. ఇతర ప్రధాన పాత్రలను ఆదిత్య కతిర్, తంగదురై, పావల్ నవగీతన్, క్రేన్ మనోహర్, సెంథిల్ కుమారి తదితరులు చేశారు.
ఇలాంటి సినిమాలు చూడటానికి సహనం కావాలి. థియేటర్లకు పనిగట్టుకుని వెళ్ళి చూసే తీరిక, ఓపిక ఈ జనరేషన్ కు లేవు. ఎంత ప్రేమకథా చిత్రమైనా... ఇది యూత్ ను మెప్పించడం కష్టమే. ఓటీటీలో వచ్చినప్పుడు ఫాస్ట్ ఫార్వర్డ్ లో చూడటమే బెటర్!
రేటింగ్ 2/5
ట్యాగ్ లైన్ : ఉసురు తీసింది!