సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

The Girlfriend Movie: రష్మిక మందన్న.. ది గర్ల్‌ ఫ్రెండ్‌ మూవీ రివ్యూ! సినిమా ఎలా ఉందంటే?

ABN, Publish Date - Nov 07 , 2025 | 07:37 AM

రశ్మికా మందణ్ణ, దీక్షిత్ శెట్టి, అనూ ఇమ్మాన్యుయేల్, రావు రామేశ్, రాహుల్ రవీంద్రన్ ప్రధాన పాత్రలు పోషించిన సినిమా 'ది గర్ల్ ఫ్రెండ్'. శుక్రవారం జనం ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం...

The Girlfriend Movie

ఈ యేడాది ప్రారంభంలోనే రష్మిక మందన్న (Rashmika Mandanna) 'ఛావా' (Chhawaa) తో సూపర్ డూపర్ హిట్ ను అందుకుంది. ఆ తర్వాత వచ్చిన 'సికిందర్', 'కుబేర (Kubera), థామా' చిత్రాలు పరాజయం పాలయ్యాయి. దాంతో ఎంతో కాలంగా సెట్స్ మీదే ఉండిపోయిన 'ది గర్ల్ ఫ్రెండ్‌' (The Girlfriend) గురించే అంతా ఎదురుచూస్తూ ఉన్నారు. ఈ సినిమా నుండి వచ్చిన పాటలు సెన్సిబుల్ గా ఉండటంతో మూవీపై జనాలకు ఆసక్తి కలిగి, అంచనాలు పెరిగాయి. మరి వాటికి తగ్గట్టుగా 'ది గర్ల్ ఫ్రెండ్' ఉందో లేదో తెలుసుకుందాం.

సింగిల్ పేరెంట్ గర్ల్ భూమా (రశ్మికా మందణ్ణ) వైజాగ్ నుండి పీజీ చేయడానికి హైదరాబాద్ వస్తుంది. అక్కడే కాలేజీలో పీజీ చేయడానికి బళ్ళారి ఉండి వచ్చిన విక్రమ్ (దీక్షిత్‌ శెట్టి Deekshith Shetty) పరిచయం అవుతాడు. ఒకానొక సందర్భంలో తన పట్ల కన్సర్న్ ప్రదర్శించిన విక్రమ్‌ పట్ల భూమాకు పాయిటివ్ వైబ్ ఏర్పడుతుంది. విక్రమ్ - భూమా ఒకరి పట్ల ఒకరు ఆకర్షితులవుతారు. ఆపైన ఇద్దరూ శారీరకంగానూ ఒక్కటవుతారు. చిత్రం ఏమంటే ఇదంతా కాలేజ్ హాస్టల్ లోనే జరుగుతుంది.

విక్రమ్, భూమా లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్నారని కాలేజీ మొత్తానికీ తెలుస్తుంది. అయితే అప్పటికే విక్రమ్ తో లవ్ లో ఉన్న దుర్గ (అనూ ఇమాన్యుయేల్ (Anu Emmanuel) భూమాతో స్నేహం చేసి... 'విక్రమ్ కు నువ్వు కరెక్ట్ కానీ నీకు విక్రమ్ కరెక్ట్ కాద'ని హితబోధ చేస్తుంది. దుర్గ మాటలను భూమా చెవికెక్కించుకుందా? కూతురే లోకంగా బ్రతికిన తండ్రి భూమా ప్రేమ విషయంలో ఎలా స్పందించాడు? భూమా బ్రేకప్ చెప్పగానే విక్రమ్ రియాక్షన్ ఏమిటీ? ఆ టాక్సిక్ లవర్ తో భూమా తెగదెంపులు చేసుకుందా? రాజీ పడి జీవించిందా? అనేదే 'ది గర్ల్ ఫ్రెండ్' కథ.


ఇందులోని కాలేజీ క్యాంపస్ సీన్స్ చూస్తుంటే మనసులో ఎంత కాదన్నా 'అర్జున్ రెడ్డి' మూవీ గుర్తొస్తుంటుంది. తాను ప్రేమించిన అమ్మాయిని మరొకరు కన్నెత్తి చూడకూడదనే యాటిట్యూడ్ ను ఇందులోనూ హీరో ప్రదర్శిస్తుంటాడు. ఇక హీరో ఉండే హాస్టల్ గదిని ఊడ్చి, అతని బట్టలు ఉతికి, కాలేజీ క్యాంటిన్ లోనూ అందరి ముందు అన్నం ముద్దలు కలిపి హీరోయిన్ తినిపించడం, అది ఆమె డ్యూటీ అన్నట్టుగా హీరో ప్రవర్తించడం చూస్తుంటే ఆ మధ్య వచ్చిన 'ది గ్రేట్ ఇండియన్ కిచెన్' మూవీ గుర్తొస్తుంది. ఇందులోని భూమా పాత్రను చూస్తే ఏ గ్రహం నుండి ఈవిడ ఊడి పడిందనే ఆశ్చర్య కలుగుతుంది. నిజం చెప్పాలంటే సింగిల్ పేరెంట్ చిల్డ్రన్ ఇతరుల కంటే స్ట్రాంగ్ గా ఉంటారు. సొంత నిర్ణయాలు తీసుకునే విషయంలో ముందుంటారు. హీరోయిన్ అలా తత్తరబిత్తరగా ఉండటానికి బలమైన కారణం ఏదీ చూపించలేదు. ఇక వీధిలోనే కాదు... ఇంటిలోనూ దించిన తల ఎత్తని హీరో తల్లి పాత్ర చూస్తే థియేటర్ లో జనాలకు ఫ్యూజులు ఎగిరిపోతాయి. భర్త తాలుకూ భయంతో ఆమె అతను బతికి ఉన్నంత వరకూ అలా ప్రవర్తించిందనుకోవడంలో తప్పులేదు. కానీ కొడుకు భర్త అంత దుర్మార్గుడు కాదుకదా... అయినా ఆమె జీవితం అలానే సాగడం ఏమిటో అర్థం కాదు. అయితే హీరో తల్లిలో భూమా తన భవిష్యత్తును ఊహించుకోవడానికి ఆమె పాత్రను బాగా ఉపయోగించుకున్నాడు.

చిత్రం ఏమంటే... సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకూ సో కాల్డ్ స్ట్రెస్ లోనే భూమా పాత్ర ఉంటుంది. ఏం చేస్తోందో, ఏం చేయాలో తెలియని సందిగ్థ స్థితి ఆమెది. ఏదో సాధించాలనే కోరిక ఉన్నా, తాను చేస్తోంది తప్పో ఒప్పో జడ్జ్ చేసుకోలేని నిస్సహాయ స్థితి. ఇలాంటి అమ్మాయిని చూస్తే సహజంగా ఎవరికైనా జాలి కలుగుతుంది. కానీ ఇందులో భూమా పాత్ర పట్ల ఎవరికీ కనీసం సానుభూతి కూడా కలగదు. ఏమిటీ పిచ్చిపిల్ల ఇలా ప్రవర్తిస్తోందనే చికాకు కలుగుతుంది. చివరిలో ఆ పాత్ర రియాక్ట్ అయిన తీరును కూడా థియేటర్ లోని ప్రేక్షకులకు పెద్దగా తృప్తిని ఇవ్వదు. అప్పటికే జరగాల్సిన డామేజ్ జరిగిపోయింది. ఒకరకంగా ఆలోచిస్తే హీరోయిన్ లో ఉన్న కన్ ఫ్యూజనే దర్శకుడిలోనూ ఉందేమో అనిపిస్తుంది. ఇక కాలేజీ లోని హాస్టల్స్ ను ఓయో రూమ్ మాదిరి దర్శకుడు చూపించడం దారుణం. పైగా తమ కాలేజ్ హాస్టల్ లోని స్టూడెంట్స్ లివ్ ఇన్ రిలేషన్ ను పట్టించుకోమని హెచ్ ఓడీ చెప్పడం కొసమెరుపు. దానికి రావు రమేశ్ కౌంటర్ బాగున్నా... దర్శకుడు ఏం సందేశాన్ని ప్రేక్షకులకు ఇవ్వాలనుకున్నాడో అర్థం కాదు. నిజం చెప్పాలంటే... ఇవాళ భూమా లాంటి పాత్రలు మనకు చాలా రేర్ గా కనిపిస్తాయి. అలాంటి పాత్రలను ఎవరూ ఓన్ చేసుకోలేరు కూడా! ఈ సినిమా మెయిన్ డ్రా బ్యాక్ అదే!


నటీనటుల విషయానికి వస్తే రశ్మికా మందణ్ణ తన వరకూ కన్ ఫ్యూజ్డ్ గర్ల్ ఫ్రెండ్‌ క్యారెక్టర్ ను అంతే కన్ ఫ్యూజన్ తో చేసింది. ఆమెకు ఈ పాత్రతో జాతీయ అవార్డు వస్తుందని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అరవింద్ చెప్పడమే కాస్తంత ఎక్కువ అనిపిస్తుంది. దీక్షిత్ శెట్టి పాత్రను చివరి వరకూ పాజిటివ్ టోన్ లోనే దర్శకుడు ఎందుకు చూపించాలని అనుకున్నాడో అర్థం కాదు. దాంతో చివరి సీన్ వరకూ ప్రేక్షకులు అతని గురించి జడ్జ్ చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఆ పాత్రకు అతను చక్కటి న్యాయం చేశాడు. అనూ ఇమ్మన్యుయేల్ స్క్రీన్ మీద కనిపించేది కొన్ని సీన్సే అయినా అందరినీ డామినేట్ చేసింది. కాలేజ్ ప్రొఫెసర్ పాత్రలో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ చక్కగా ఇమిడిపోయాడు. అనుభవజ్ఞులైన రావు రమేశ్‌ (Rao Ramesh), రోహిణి పాత్రలను మరింత బాగా రాసుకుని ఉండాల్సింది. సాదా సీదా సన్నివేశాల్లోనూ ఏదో రకంగా జీవం పోయాలని సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్ ప్రయత్నించాడు. కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రఫీ బాగుంది. 'చి.ల.సౌ.'తో దర్శకుడిగా మారిన రాహుల్ రవీంద్రన్, ఆ తర్వాత తీసిన 'మన్మధుడు -2'లో దర్శకుడిగా బ్యాడ్ ఫేజ్ లోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు సెన్సిబుల్ కథను తీసుకుని అంతే సెన్సిబుల్ గా చెప్పాలని ప్రయత్నించాడు. వాష్ రూమ్ వాల్స్ కుదించుకుపోతున్నట్టు హీరోయిన్ భావించే సీన్ బాగుంది. అయితే... మొద్దుబారిపోయిన మనుషులకు, మనసులకు ఈ డోస్ సరిపోదు.

ఇష్యూ బేస్డ్ గా తెరకెక్కే ఇలాంటి సినిమాలు కమర్షియల్ గా ఏ మేరకు సక్సెస్ సాధిస్తాయనే సందేహం ఎప్పుడూ ఉంటుంది. అన్నింటికీ సిద్థపడే 'ది గర్ల్ ఫ్రెండ్' మూవీని నిర్మించామని సమర్పకుడు అల్లు అరవింద్, నిర్మాతలు విద్య, ధీరజ్ చెప్పారు. కథతో బాగా కనెక్ట్ అయిన రశ్మిక కూడా కమర్షియల్‌ గా ఆలోచించకుండా... ఇది అమ్మాయిలకు తాను ఇచ్చే బిగ్ హగ్ అని చెప్పింది. సో... ఈ మెసేజ్ ను యూత్ ఏ మేరకు స్వీకరిస్తారో చూడాలి.

ట్యాగ్ లైన్: టాక్సిక్ బోయ్ ఫ్రెండ్ - పూర్ గర్ల్ ఫ్రెండ్!

రేటింగ్: 2.25/5

Updated Date - Nov 07 , 2025 | 07:56 AM