Premante Review: ప్రియదర్శి నటించిన.. 'ప్రేమంటే' ఎలా ఉందంటే
ABN, Publish Date - Nov 21 , 2025 | 04:17 PM
ఈ వారం విడుదలైన చిత్రాల్లో ప్రియదర్శి, ఆనంది జంటగా నటించిన ‘లవ్‌స్టోరీ ‘ప్రేమంటే’ చిత్రం ఒకటి. నవనీత్ రామ్ దర్శకుడిగా పరిచయమయ్యారు. సుమ కనకాల, వెన్నెల కిశోర్, కిరీటీ దామరాజు కీలక పాత్రధారులు. థ్రిల్ - యు- ప్రాప్తిరస్తు అనే ఉపశీర్షికతో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను థ్రిల్ ఫీల్ చేసిందా? చూద్దాం.
సినిమా రివ్యూ: ప్రేమంటే.. (థ్రిల్ యు ప్రాప్తిరస్తు)
విడుదల తేది: 21-11-2025
ఈ వారం విడుదలైన చిత్రాల్లో ప్రియదర్శి, ఆనంది జంటగా నటించిన ‘లవ్‌స్టోరీ ‘ప్రేమంటే’ చిత్రం ఒకటి. నవనీత్ రామ్ దర్శకుడిగా పరిచయమయ్యారు. సుమ కనకాల, వెన్నెల కిశోర్, కిరీటీ దామరాజు కీలక పాత్రధారులు. థ్రిల్ - యు- ప్రాప్తిరస్తు అనే ఉపశీర్షికతో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను థ్రిల్ ఫీల్ చేసిందా? చూద్దాం.
కథ:
మది అలియాస్ మధుసూదన్ (ప్రియదర్శి) సెక్యూరిటీ సిస్టం మేనేజ్‌మెంట్ చేస్తుంటాడు. ఇది ఒక పక్క.. రెండో పక్క అతనొక దొంగ. అయితే తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి.. కుటుంబం పట్ల బాధ్యతగా వ్యవహరించాలనుకుంటాడు. ఓ పెళ్లిలో తారసపడిన అమ్మాయి రమ్య (ఆనంది)పై మనసు పారేసుకుంటాడు. ఆమె చేసే ప్రతి పనిలో థ్రిల్ కోరుకుంటుంది. ఇద్దరి అభిరుచులు కలవడం, ఇరు కుటుంబాలు అంగీకరించడంతో పెళ్లి చేసుకుంటారు. కొన్ని రోజుల తర్వాత భర్త ఏం చేస్తాడో రమ్యకు తెలిసిపోతుంది. దొంగతనాలకు స్వస్తి చెప్పి ఉద్యోగం చేయమనడంతో అటువైపు అడుగేస్తాడు మది. దొంగతనాలు వద్దు అన్న భార్యే మళ్లీ దొంగతనాల వైపు ఎందుకు మొగ్గు చూపింది. పెళ్లి తర్వాత వీరిద్దరి జీవితం సాఫీగా సాగిందా? థ్రిల్ కోరుకునే రమ్యకు జీవితం థ్రిల్లింగ్‌గా అనిపించిందా? ఇందులో పోలీస్ హెడ్ కానిేస్టబుల్ ఆశా మేరీ (సుమ కనకాల) పాత్ర ఏంటి? ఆమె వీరిద్దరి జీవితంలోకి ఎందుకు వచ్చింది? అన్నది కథ.
విశ్లేషణ:
పెళ్లికి ముందు ఒకలా, పెళ్లైన కొన్నాళ్లకు మరోలా మారిన జంట కథే ఇది. పెళ్లికి ముందు నువ్వు అలా.. పెళ్లి తర్వాత ఇలా అంటూ ఒకరి తప్పును ఒకరు ఎంచుకుంటూ, నిందించుకున్న ఈ జంట జీవితం ముందుకు సాగిందా? ఆగిపోయిందా అన్నదే ఈ కథలో కీలకమైన అంశం. దానిని వినోదం, భావోద్వేగాలు జోడించి ప్రేక్షకులకు థ్రిల్ ఫీలింగ్ కలిగించాలనుకున్నాడు దర్శకుడు. ఓ స్నేహితుడి పెళ్లిలో ఇద్దరూ కలుసుకుని, పెళ్లిదాకా వెళ్లడం, ఓ నెల హనీమూన్ సరదాగా గడపడంతో సినిమా మొదలవుతుంది. తదుపరి చుట్టు పక్కల వారి లేనిపోని మాటల వల్ల ఆ అమ్మాయిలో అనుమానాలు రేకెత్తడంతో కథలో మలుపులు మొదలవుతాయి. హీరో తానేం చేస్తాడో చెప్పడం వరకూ కథ థ్రిల్‌గానే సాగుతుంది. అక్కడితో ఫస్టాఫ్‌కు ఫుల్‌స్టాప్. ఇక ద్వితీయార్ధానికి వస్తే.. దొంగతనం వద్దు ఏదొకటి చేసుకుని బతకొచ్చు అని ఆలోచించే భర్తను మళ్లీ దొంగతనాలు చేయమని భార్య ఎందుకు చెప్పిందనేవి ఓ మలుపు. చదువుకున్న ఇద్దరు.. కుటుంబ బాధ్యతలు నిర్వహించడానికి సరిపడ సంపాదన కోసం దొంగతనాన్నే ఎందుకు ఎంచుకున్నారన్నది అర్థం కాదు. సెకెండాఫ్‌లో దొంగతనం కేసును ఆశామేరీ పాత్రలో సుమ కనకాల ఇన్వెస్టిగేట్ చేసే క్రమంలో సాగే సన్నివేశాలు కాస్త ఫర్వాలేదనిపించాయి. మది, రమ్య విడిపోయే క్రమంలో పూర్తిగా భావోద్వేగాలు నింపేశాడు దర్శకుడు. ప్రియదర్శి మంచి నటుడే కాదు అతనిలో హాస్యనటుడు కూడా ఉన్నాడు. అతనిని పూర్తి స్థాయిలో దర్శకుడు ఉపయోగించుకోలేదనిపిస్తుంది. ఎక్కడా సరైన జోక్ పేలలేదు. సెకెండాఫ్‌లో ప్రతి సీన్ ఊహకు అందేలా ఉంది. ఆకట్టుకునే మాటల్లేవు. మంచి క్యాస్టింగ్ ఉన్నా వారి టాలెంట్‌కు తగ్గ సీన్స్ రాసుకోలేకపోయారు. దర్శకుడు రాసుకున్న కథ బాగానే ఉన్నా ఎగ్జిక్యుషన్‌లో ఫెయిల్ అయ్యాడనిపించింది.
నటీనటులు, సాంకేతిక నిపుణులు పనితీరు..
ప్రియదర్శి మది పాత్రకు న్యాయం చేశాడు. అయితే తనదైన శైలి హాస్యం మాత్రం పంచలేకపోయాడు. అది అతని తప్పుకాదు. దర్శకుడి రాతలో తేడా. ఆనంది మాత్రం తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. రమ్య పాత్రకు తగ్గటు నటించింది. ఎమోషన్స్, ఎక్స్‌ప్రెషన్‌ను బాగా పండించింది. హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బావుంది. వెన్నెల కిశోర్, హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్ లాంటి ఆర్టిస్ట్‌లు ఉండి కూడా పూర్తి స్థాయిలో నవ్వులు పండించలేకపోయారు. ఇక సాంకేతికంగా చూస్తే సినిమా బావుంది. కథకు తగ్గట్టు నిర్మాతలు పూస్కుర్ రామోహన్‌రావు, జాన్వీ నారంగ్ బాగానే ఖర్చు చేశారు. విశ్వనాథ్‌రెడ్డి కెమెరా పనితనం, లియోన్ జేమ్స్ సంగీతం సినిమాకు ప్లస్ అనుకోవచ్చు. రెండు పాటలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఎడిటర్ రాఘవేంద్ర తిరున్ సెకెండాఫ్‌కు కాస్త కత్తెర వేసుంటే బావుండేది. ప్రేమంటే టైటిల్‌ను బట్టి కొత్తదనమైన ప్రేమకథను చూడొచ్చు అనుకుంటే నిరాశపడతారు.
ట్యాగ్‌లైన్: నో థ్రిల్.. ఓన్లీ గ్రిల్..
రేటింగ్: 2.25/5