Kottapallilo Okappudu: కొత్తపల్లిలో ఒకప్పుడు సినిమా రివ్యూ
ABN, Publish Date - Jul 18 , 2025 | 09:58 AM
నిర్మాత, నటి ప్రవీణ పరుచూరి అమెరికాలో కార్డియాలజిస్ట్. సినిమా మీద పేషన్ తో ఆమె 'కొత్తపల్లిలో ఒకప్పుడు'మూవీని స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. జూలై 18న ఈ సినిమా విడుదలైంది.
గతంలో ప్రవీణ పరుచూరి (Praveena Paruchuri) 'కేరాఫ్ కంచరపాలెం, 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' చిత్రాలను నిర్మించారు. ఈ రెండు సినిమాలకూ వెంకటేశ్ మహా (Venkatesh Maha) దర్శకత్వం వహించారు. అయితే ముచ్చటగా మూడోసారి సినిమాను నిర్మిస్తూ ఈసారి దర్శకత్వం బాధ్యతలను సైతం తన భుజానికే ఎత్తుకున్నారు ప్రవీణ. 'కొత్తపల్లిలో ఒకప్పుడు' (Kothapallilo Okappudu) అనే ఈ సినిమా శుక్రవారం జనం ముందుకొచ్చింది. ఇందులో ఓ ప్రధాన పాత్రను కూడా ప్రవీణ పరుచూరి పోషించడం విశేషం.
కథేంటంటే...
మూడు దశాబ్దాల క్రితం కొత్తపల్లి అనే గ్రామంలో జరిగే కథ ఇది. కొత్తపల్లిలో వడ్డీ వ్యాపారం చేసే అప్పన్న (రవీంద్ర విజయ్ Ravindra Vijay) ప్రజలను పీడిస్తూ, వారి భూముల్ని లాక్కుంటూ ఉంటాడు. ఆ భూముల్లో నిధి నిక్షేపాలు ఉంటాయని అతని నమ్మకం. తన కళ్లముందే అప్పన్న ఎదిగిపోవడం ఊరిలోని భూస్వామి రైస్ మిల్లు ఓనర్ రెడ్డి (బెనర్జీ Benarji) తట్టుకోలేకుండా ఉంటాడు. అతని మనవరాలు సావిత్రి (మోనిక)ని అప్పన్న దగ్గర పనిచేసే రామకృష్ణ (మనోజ్ చంద్ర Manoj Chandra) ప్రేమిస్తాడు. రికార్డింగ్ డాన్స్ కంపెనీని నిర్వహించే రామకృష్ణ... సావిత్రితో పొరుగూరిలో ఓ ప్రోగ్రామ్ కు డాన్స్ చేయించాలనుకుంటాడు. అందుకోసం ఆమె దగ్గర పనిచేసే ఆదిలక్ష్మీ (ఉషా బోనెల) సాయం కోరతాడు. ఆ క్రమంలో ఆదిలక్ష్మీతో రామకృష్ణ సన్నిహితంగా మెలగడాన్ని చూసిన ఊరి జనం, వీరిద్దరి మధ్య ఏదో ఉందని అనుకుంటారు. ఆ అనుమానం... చివరకు అనుకోని పరిస్థితుల్లో రామకృష్ణ... సావిత్రిని కాకుండా ఆదిలక్ష్మీని పెళ్లాడాల్సిన స్థితికి తీసుకొస్తుంది. ఈ ఊహించని పరిస్థుతుల నుండి రామకృష్ణ ఎలా బయటపడ్డాడు? తనకు - సావిత్రికి పెళ్ళి చేస్తానని మాట ఇచ్చిన అప్పన్న ఏమయ్యాడు? ఊరి పెద్దైన రెడ్డిగారు తన మనవరాలిని రామకృష్ణకు ఇచ్చి పెళ్ళి చేయడానికి అంగీకరించాడా? అనేది మిగతా కథ.
అయితే... ఈ సినిమా ద్వారా దర్శక నిర్మాత ప్రవీణ పరుచూరి జనాలకు చెప్పాలనుకున్న అసలు కథ వేరు. చదువుకోని వారే కాదు, చదువుకున్న వారు సైతం తమ కొందరు స్వలాభం కోసం చేసే కుట్రలలో భాగస్వాములు అవుతున్నారు? దేవుడు పేరు చెప్పి చేసే మోసంలో ఎలా బలి అయిపోతున్నారు? అనేది చెప్పాలనుకున్నారు. సినిమా ప్రథమార్ధం అంతా రామకృష్ణ, సావిత్ర ప్రేమ గోలతో సాగితే, ద్వితీయార్థం చనిపోయిన అప్పన్న ను దైవంగా మార్చే కొందరి ప్రయత్నానికి ఊరి జనం ఎలా మోసపోయారు? ప్రజా ప్రతినిధి సైతం అందుకు ఎలా వంతపాడాడు? వారి మూఢ భక్తిని వ్యతిరేకించిన ఊరిపెద్ద రెడ్డి ఏమైపోయాడు? అనే దానిపై నడుస్తుంది.
మూఢ నమ్మకాలు మనుషుల్ని ఎలా గుడ్డివాళ్ళను చేస్తాయో చూపించాలనుకున్న దర్శకురాలు ప్రవీణ ప్రయత్నం అంతగా సఫలం కాలేదు. ఇలాంటి ఓ సీరియస్ సబ్జెక్ట్ ను చూడాల్సి వస్తుందని మానసికంగా సిద్థంగా లేని ప్రేక్షకులకు ఇదో చిందరవందర గందరగోళ వ్యవహారంగా అనిపిస్తుంది. నిజానికి ఈ సినిమాలో చాలానే లేయర్స్ ఉన్నాయి. 'కేరాఫ్ కంచర పాలెం'లో మాదిరి డౌన్ టు ఎర్త్ ఉండే పలు పాత్రలు ఇక్కడా కనిపిస్తాయి. అలానే 'ఉమామహేశ్వర ఉగ్రరూస్య'లోని ఇగో క్లాషెస్ ఇందులోనూ ఉన్నాయి. అయితే ఆ పాత్రలను తెరకెక్కించిన విధం బాగానే ఉన్నా... మొత్తంగా కథ చెప్పిన పద్థతి, ప్రేక్షకులను ఎడ్యుకేట్ చేయడానికి దర్శకురాలు పడిన తాపత్రయం సక్సెస్ కాలేదు. సినిమా నిడివి తక్కువే అయినా... అందులోనూ అనవసరమైన సన్నివేశాలు చాలా ఉన్నాయి. రికార్డింగ్ డాన్స్ కోసం చేసే ప్రిపరేషన్ కు అంత నిడివి అనవసరం అనిపిస్తుంది.
నటీనటులు, సాంకేతిక నిపుణులు...
నటీనటుల విషయానికి వస్తే కొత్త నటుడే అయినా మనోజ్ చంద్ర బాగా చేశాడు. వాయిస్ మాడ్యులేషన్ కూడా బాగుంది. గత చిత్రాలతో పోల్చితే రవీంద్ర విజయ్ డబ్బింగ్ లో చాలా మెరుగుదల కనిపించింది. వడ్డీ వ్యాపారి పాత్రను అతను తన హావభావాలతో రక్తి కట్టించాడు. చాలా కాలం తర్వాత బెనర్జీకి పెర్ఫార్మెన్స్ కు స్కోప్ ఉన్న పాత్ర దక్కింది. ఆదిలక్ష్మీ పాత్ర చేసిన ఉషా బోనెల సహజ నటనను కనబరిచింది. హీరోయిన్ మోనికా ఫర్వాలేదు. ఇతర ప్రధాన పాత్రలను ప్రవీణ్ పరుచూరి, ప్రేమ సాగర్, బాబూమోహన్ (Babu Mohan), 'సత్యం' రాజేశ్ (Satyam Rajesh), బొంగు సత్తి, ఫణి తదితరులు పోషించారు.
సాంకేతిక నిపుణుల్లో మణిశర్మ (Manisarma) బాణీలు ఎనభైల నాటి చిత్రాల్లోని పాటలను గుర్తు చేస్తాయి. నేపథ్య సంగీతం బాగుంది. గీత రచయితలు చక్కని సాహిత్యాన్ని అందించారు. వాటి పిక్చరైజేషన్ కూడా భిన్నంగానే ఉంది. కెమెరాపనితనం బాగుంది. ఈ చిత్రానికి రానా దగ్గుబాటి సమర్పకుడిగా వ్యవహరించారు. అమెరికాలో కార్డియాలజిస్ట్ గా సేవలు అందిస్తున్న ప్రవీణ పరుచూరి... భారత గ్రామీణ ప్రజల మూఢత్వాన్ని విశ్వాసాలను ప్రశ్నిస్తూ 'కొత్తపల్లిలో ఒకప్పుడు' సినిమాను తెరకెక్కించారు. ఇందులోనే ఒక పాత్ర చేత 'దేవుడంటే నిజమో అబద్ధమో కాదు నమ్మకం' అని చెప్పించారు దర్శకురాలు ప్రవీణ. అయితే... ఆ నమ్మకానికి, మూఢ నమ్మకానికి మధ్య ఉన్న తేడాను మరింత బలంగా చెప్పి ఉంటే బాగుండేది. అప్పుడు సినిమా ప్రజామోదం పొందే ఆస్కారం ఉండేది.
రేటింగ్: 2.25/5
ట్యాగ్ లైన్: కొత్తపల్లిలో... గందరగోళం!