సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Dies Irae Review: ప్రణవ్‌ మోహన్‌ లాల్‌ ‘డీయస్‌ ఈరే’ ఎలా ఉందంటే

ABN, Publish Date - Nov 08 , 2025 | 01:49 PM

ఎన్నో విజయవంతమైన చిత్రాలకు కేరాఫ్‌ స్రవంతి సంస్థ. ఆ బ్యానర్‌ ఓ సినిమాను టేకప్‌ చేసిందీ అంటే విషయం ఉన్న సినిమానే అని ప్రేక్షకులకు నమ్మకం.  ప్రణవ్‌ మోహన్‌ లాల్‌ (Pranav Mohan lal) నటించిన చిత్రం ‘డీయస్‌ ఈరే’ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది ఈ సంస్థ. 

Dies Irae Review

సినిమా రివ్యూ: ‘డీయస్‌ ఈరే’ (Dies Irae Review)

విడుదల తేది: 7-11‘-2025

మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ తనయుడు ప్రణవ్‌ మోహన్‌ లాల్‌ (Pranav Mohan lal) నటించిన చిత్రం ‘డీయస్‌ ఈరే’. రాహుల్‌ సదాశివన్‌ దర్శకత్వంలో హారర్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. చక్రవర్తి రామచంద్ర, శశికాంత్‌ నిర్మించగా అక్టోబర్‌ 31న మలయాళంలో విడుదల కాగా, తెలుగులో స్రవంతి మూవీస్‌ ద్వారా స్రవంతి రవికిశోర్‌ ఈ నెల 7న విడుదల చేశారు. ఎన్నో విజయవంతమైన చిత్రాలకు కేరాఫ్‌ స్రవంతి సంస్థ. ఆ బ్యానర్‌ ఓ సినిమాను టేకప్‌ చేసిందీ అంటే విషయం ఉన్న సినిమానే అని ప్రేక్షకులకు నమ్మకం. మరి హారర్‌ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏ మేరకు మెప్పించింది.. స్రవంతి సంస్థ నమ్మకాన్ని నిజం చేసిందా? రివ్యూలో చూద్దాం..

కథ:
(Dies Irae Review)

రోహన్ (ప్రణవ్ మోహన్ లాల్) అర్కిటెక్ట్, బాగా డబ్బున్నవాడు. పెద్ద ఇంట్లో ఉంటూ స్నేహితులతో ఎంజాయ్ చేస్తుంటాడు. ఆ సందర్భంలో తన స్కూల్‌మేట్ కని (సుస్మితభట్) చనిపోయిందని తెలుసుకుని రోహన్, ఆమె ఇంటికి వెళ్లి పరామర్శిస్తాడు. రోహన్‌కు, కనికి గతంలో చిన్న రిలేషన్ ఉంటుంది. కని ఇంటికి వెళ్లిన సమయంలో అది గుర్తొచ్చి రూమ్‌లో ఉన్న హెయిర్ క్లిప్ ఒకటి తన ఇంటికి తీసుకొస్తాడు. అప్పటి నుంచి ఓ ఆత్మ రోహన్‌ని వెంటాడుతుంది. భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఈ విషయాన్ని కని పొరుగింటి వ్యక్తి మధుసూధన్ (గిబిన్ గోపినాథ్)కి చెప్తాడు రోహన్. ఓ రోజు సరదగా కని తమ్ముడు కిరణ్‌ను ఇంటికి పిలుస్తాడు రోహన్. అయితే అతడిని ఆ ఆత్మ మేడ మీద నుంచి కిందకు పడేస్తుంది. ఆ సంఘటన ద్వార అది కని ఆత్మ కాదు.. ఓ మగాడి ఆత్మ అని తెలుస్తుంది. అసలు ఆ ఆత్మ ఎవరిది? రోహన్‌ని ఎందుకు ఇబ్బంది పెడుతుంది? కనికి, ఆ ఆత్మకు మధ్య సంబంధం ఏంటి? అన్నదే కథ.


విశ్లేషణ.. (Dies Irae Review)

హారర్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్ కథలు ఎప్పుడూ మేకర్స్‌కు సక్సెస్‌ఫుల్ ఫార్ములానే. అయితే హారర్ కథాంశాన్ని ఎంచుకున్నప్పుడు తెరపై ఆవిష్కరణ కూడా అంతే గ్రిప్పింగ్‌గా ఉండాలి. థ్రిల్లింగ్‌గా అనిపించాలి. ఇవన్నీ ఉన్న చిత్రమే ‘డీయస్ ఈరే’. ఒక పెద్ద బంగ్లా, రెండు సాధారణ ఇళ్లల్లో ఐదారుగురు వ్యక్తుల మధ్య సాగే కథ ఇది. ఫ్రెండ్స్, పార్టీ తో మామూలుగా మొదలు పెట్టి... కథలోకి వెళ్లడానికి దర్శకుడు కాస్త సమయం తీసుకున్నాడు. కని మరణం, ఆ తర్వాత పరిణామాలతో కథపై ఆసక్తి, ఇంటెన్స్ పెరుగుతుంది. అక్కడి నుంచి ప్రతి సీన్ భయభ్రాంతలకు గురి చేసేలా, అనుక్షణం ఉత్కంఠత ఉండేలా రూపొందించాడు దర్శకుడు. సెకెండాఫ్‌కి వచ్చేసరికి ఆత్మ కనిది కాదని తేలిన తర్వాత చేసే ఇన్వెస్టిగేషన్ నుంచి ఇంటెన్సిటీ మరింత పెరుగుతంది. ఆ ఆత్మ కనిని ఎంతో ఇష్టపడిన మను (షైన్ టామ్ చాకో)దని, అతని మరణం తర్వాత అతని తల్లి ఏం చేసిందనే విషయం ఎంతో ఆసక్తికరంగానే కాదు.. భయంకరంగా ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటుంది. అయితే కని బావిలో దూకి చనిపోవడానికి కారణం చెప్పలేదు. సినిమా క్లైమాక్స్‌లో మాత్రం కని ఆత్మ తెరపైకి వస్తుంది. ఆమె ఎందుకు మరణించింది? రోహన్ ఇంటికి ఎందుకు వస్తుంది? మను ఎందుకు చనిపోయాడు? అన్నది సెకెండ్ పార్ట్‌లో అంటూ పార్ట్ -2కు హింట్ ఇచ్చారు.

నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు…

లవ్‌స్టోరీస్, యూత్‌ఫుల్ సినిమాలు చేయాల్సిన టైమ్‌లో ప్రణవ్ మోహన్‌లాల్ ఈ తరహా హారర్ కథ ఎందుకు ఎంచుకున్నాడా? అనుకున్న వారంతా సినిమా చూశాక అతని సెలక్షన్ కరెక్టే అనిపిస్తుంది. ఇందులో రోహన్ పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ప్రతి సీన్‌లోనూ అతనిలోని మెచూర్డ్ ఆర్టిస్ట్ కనిపించాడు. లుక్, స్టైలింగ్, యాక్టింగ్ ఇలా అన్ని విషయాల్లోనూ బెస్ట్ అనిపించాడు. ఇక హీరో తర్వాత మాట్లాడుకోవలసింది ఎల్సమ్మ పాత్రధారి జయకురూప్‌దే. అయితే ఆమె పాత్ర గురించి రివీల్ చేస్తే సస్పెన్స్ మిస్ అవుతాం. అది తెరపైనే చూడాలి. షైన్ టామ్ పాత్ర సినిమాకు కీలకం.. కానీ తను ఫొటోకే పరిమితమయ్యాడు. మిగతా ఆర్టిస్ట్‌లు అరుణ్ అజయ్ కుమార్, జిబిన్ గోపీనాథ్ వంటి వారు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. ఈ చిత్రానికి ప్రధాన బలం సంగీతం. సౌండ్ డిజైన్ అద్భుతంగా కుదిరింది. హారర్ సినిమాలకు ఎలాంటి నేపథ్య సంగీతం కావాలో.. అంతకు మించి ఇచ్చాడు సంగీత దర్శకుడు క్రిస్టో జేవియర్. తెరపై వినిపించిన మువ్వ చప్పుడు కూడా భయాన్ని కలిగించేలా సౌండ్ డిజైన్ చేశాడు. షెహనాద్ జలాల్ సినిమాటోగ్రఫీ కూడా ఎసెట్ అయింది. సీన్ జంప్స్, కట్స్ లేకుండా షార్ప్‌గా షఫీ మొహమ్మద్ అలీ ఎడిటింగ్ ఉంది. టెక్నికల్‌గా సినిమా హై స్టాండర్డ్స్‌లో ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

కథ ప్రారంభంలో హారర్ సీన్స్ చూస్తే ఇది రొటీన్ దెయ్యాల కథే అనిపిస్తుంది. ఫస్టాఫ్‌లో అక్కడక్కడా కాస్త బోర్ కొట్టినా.. ఆ తర్వాత సీన్స్ మలచిన తీరు, సౌండ్ డిజైన్‌తో ఆ ఫీలింగ్ మరచిపోయేలా చేశాడు దర్శకుడు. సెకెండాఫ్ చివరి 20 నిమిషాలు తల తిప్పనివ్వకుండా చేశాడు. ‘డీయస్ ఈరే’ అంటే... ‘కోపం చూపించే ఒక రోజు’ అని అర్థం. ఈ సింపుల్ లైన్‌తో ప్రతి క్షణం ఉత్కంఠత కలిగేలా సినిమాను నడిపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యారు. హారర్ సినిమాలు ఇష్టపడేవారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది.

ట్యాగ్‌లైన్: భయపెట్టే ‘డీయస్ ఈరే’

రేటింగ్ : 3/5

Updated Date - Nov 08 , 2025 | 09:22 PM