Patang Review: 'పతంగ్' మూవీ ఎలా ఉందంటే..
ABN, Publish Date - Dec 26 , 2025 | 06:39 PM
పెద్ద సినిమాల విడుదల లేకపోవడం, క్రిస్మస్ పండుగ చిన్ని చిత్రాల పాలిట వరంగా మారింది. ఈవారం అరడజనుకు పైగా సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో ‘పతంగ్’ ఒకటి. మరీ చిత్రం ప్రేక్షకులను ఏ మేర మెప్పించిందో చూద్దాం.
సినిమా రివ్యూ: పతంగ్
పెద్ద సినిమాల విడుదల లేకపోవడం, క్రిస్మస్ పండుగ చిన్ని చిత్రాల పాలిట వరంగా మారింది. ఈవారం అరడజనుకు పైగా సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో ‘పతంగ్’ ఒకటి. ‘జీ సరిగమప’ రన్నరప్ ప్రణవ్ కౌశిక్, వంశీ పూజిత్ హీరోలు. ఇన్‌స్టాగ్రామ్ సెన్సేషన్ ప్రీతి పగడాల కథానాయిక. హీరోయిన్‌గా ఆమెకిది తొలి సినిమా. ప్రణీత్ ప్రత్తిపాటి దర్శకుడు. గౌతమ్ మీనన్ ప్రత్యేక పాత్ర పోషించారు. ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకొచ్చింది ఈ సినిమా. యువ తారలతో తెరకెక్కిన ఈ సినిమాను త్రివిక్రమ్ సైతం ప్రశంసించారు. మరీ చిత్రం ప్రేక్షకులను ఏ మేర మెప్పించిందో చూద్దాం.
కథ:
ఐశ్వర్య (ప్రీతి పగడాల)ది కన్‌ఫ్యూజింగ్ మైండ్ సెట్ ఉన్న అమ్మాయి. ఏ విషయాన్ని అంత తొందరగా తేల్చదు. రెండు అవకాశాలిచ్చి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోమంటే ఏదీ డిసైడ్ చేసుకోలేదు. అలాంటి అమ్మాయి బస్తీ కుర్రాడు విస్కీ అలియాస్ వంశీ కృష్ణ (వంశీ పూజిత్)తో లవ్‌లో పడుతుంది. విస్కీ, రిచ్ కిడ్ అయిన అరుణ్ (ప్రణవ్ కౌశిక్)కు మంచి స్నేమితుడు. ఇద్దరిదీ పన్నెండేళ్ల స్నేహం. విస్కీ ద్వారా ఐశ్వర్య, వంశీ కృష్ణ ఒకరికొకరు పరిచయం అవుతారు. ప్రేమలో పడతారు. ఐశ్వర్య, అరుణ్ ప్రేమలో పడ్డారని విస్కీకి ఎప్పుడు తెలిసింది? ఆ విషయాన్ని గ్రహించాక అతనేం చేశాడు. ఈ ఇద్దరిలో ఐశ్వర్య తన వాడిగా ఎవర్నీ సెలెక్ట్ చేసుకుంది? ఈ ట్రయాంగిల్ లవ్‌స్టోరీ ఎక్కడి ముగిసింది అన్నది కథ.
టాలీవుడ్‌కు ట్రయాంగిల్ లవ్‌స్టోరీలు కొత్తేమీ కాదు. ఓ అమ్మాయి, ఇద్దరు అబ్బాయిలుతో ప్రేమలో ఉన్నప్పుడు ఒకరికి అన్యాయం జరగడం లేదా ఒకరు త్యాగం చేయడం ఇలాంటి కథల్లో సాధారణమే! ఇక్కడ విశేషం ఏంటంటే ఇద్దరు అబ్బాయిలు ఓ అమ్మాయిని ప్రేమించడం కాదు... ఇద్దర్నీ ఓ అమ్మాయి, అదీ ఒకేసారి ప్రేమించడం. అయితే ఆ అమ్మాయిది మోసం చేయాలనే ఉద్దేశం కాదు. కన్‌ఫ్యూజ్డ్ మైండ్‌సెట్ కావడం. ప్రథమార్ధం అంతా ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగుతుంది. ఐశ్వర్య-విస్కీల లవ్‌స్టోరీతో పాటు అరుణ్‌తో ఐశ్వర్య క్లోజ్ అయ్యే సన్నివేశాలన్నీ థియేటర్స్‌లో నవ్వులు పూయిస్తాయి. సినిమా మొదలైన కాసేపటికే ఆ క్యారెక్టర్లతో ట్రావెల్ అవ్వడం మొదలు పెడతాం. చూస్తుండగానే ఇంటర్వెల్ అవుతుంది. ఇంటర్వెల్ తర్వాత కాస్త సాగదీతగా ఉంటుంది. పతంగ్‌ల పోటీతో స్పీడ్ పెరుగుతుంది. డైలీ లైఫ్‌లో మనం చూసే మనుషులు, విషయాలు తెరపై కనిపిస్తాయి. ఆ సన్నివేశాలతో చక్కని వినోదాన్ని పండించారు. డైలాగుల్లో చిన్న పంచ్ ఇవ్వడం, సిట్యువేషనల్ ఫన్ వంటివి వర్కవుట్ అయ్యాయి. జెన్‌జి యువతీ యువకుల్లో ప్రేమ, ఆకర్షణ పట్ల భావాలను వినోదాత్మకంగా చూపించారు.
నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు.. ఇందులో అంతా కొత్తవారే. బాగా తెలిసిన ఫేస్ దర్శకుడు, నటుడు గౌతమ్ మీనన్‌దే. హీరోహీరోయిన్ల క్యారెక్టర్లు బాగా కుదిరాయి. ఆయనపై వేసిన పంచ్ డైలాగ్స్ అందరూ ఎంజాయ్ చేస్తారు. సినిమాకు మెయిన్ పిల్లర్ ప్రీతి పగడాల. కన్‌ఫ్యూజ్ అయ్యే సందర్భంలో ఆమె ఫేస్ క్యూట్‌గా ఉంటుంది. వంశీ బస్తీ కుర్రాడిగా యాప్ట్ అయ్యాడు. ప్రణవ్ కౌశిక్ క్లాసీగా కనిపించాడు. అతని తల్లిదండ్రులుగా ఎస్పీ చరణ్, అను హాసన్ కనిపించారు. మిగతావారంతా పాత్రలకు న్యాయం చేశారు. జోస్ జిమ్మీ సంగీతం సినిమాకు ఎసెట్. మ్యూజిక్ ఫ్రెష్‌గా ఉంది. సినిమాటోగ్రఫీ ఆహ్లాదకరమైన మూడ్ క్రియేట్ చేస్తుంది. ఓ 15 నిమిషాల నిడివిని ట్రిమ్ చేస్తే కామెడీ కంటెంట్‌ను ఇంకొంచెం ఎక్కువ ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది. ఖైరతాబాద్ గణపతి మండపం నుంచి హైదరాబాద్‌లో చాలా రియలిస్టిక్ లొకేషన్స్‌లో షూట్ చేశారు. కథకు ఏం కావాలో అవి సమకూర్చారు నిర్మాతలు. చిన్న సినిమానే అయినా వీఎఫ్‌ఎక్స్ క్వాలిటీ ఎక్కడా తగ్గలేదు. మేకర్స్ లవ్‌స్టోరీ అని ప్రమోట్ చేశారు కాబట్టి బలమైన లవ్‌స్టోరీని, కొత్త కథను ఎక్స్‌పెక్ట్ చేస్తే నిరాశ తప్పదు. కానీ రెండున్నర గంటలపాటు హాయిగా నవ్వించే కంటెంట్ అయితే ఉంది. క్లైమాక్స్‌లో దర్శకుడు ఇచ్చిన సందేశం యువతను ఆలోచింపజేస్తుంది. యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుంది.
ట్యాగ్‌లైన్: నవ్వుల్లో ముంచే పతంగ్
రేటింగ్: 2.5/5