సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Show Time: షో టైమ్ మూవీ రివ్యూ

ABN, Publish Date - Jul 04 , 2025 | 06:31 PM

నవీన్ చంద్ర, కామాక్షి భాస్కర్ల జంటగా నటించిన సినిమా 'షో టైమ్'. శుక్రవారం జనం ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం.

ప్రామిసింగ్ యాక్టర్ నవీన్ చంద్ర (Naveen Chandra) ఈ మధ్య కాలంలో సినిమాల వేగం పెంచాడు. జనవరిలో వచ్చిన 'గేమ్ ఛేంజర్' (Game Changer) లో కీలక పాత్ర పోషించిన నవీన్ చంద్ర... హీరోగా నటించిన సినిమాలు మొదటి ఆరు నెలల్లో మూడు విడుదలయ్యాయి. ఏప్రిల్ లో '28 డిగ్రీస్ సెల్సియస్' రాగా, మే నెలలో 'బ్లైండ్ స్పాట్', 'లెవన్' చిత్రాలు బ్యాక్ టు బ్యాక్.. వన్ వీక్ గ్యాప్ తో జనం ముందుకొచ్చాయి. ఇప్పుడు తాజాగా అతని మరో చిత్రం 'షో టైమ్' (Show Time) విడుదలైంది. 'బ్లైండ్ స్పాట్', 'లెవన్' చిత్రాల మాదిరిగానే ఇది కూడా థ్రిల్లర్ జానర్ కు చెందింది కావడం విశేషం.


కథేంటంటే...

సూర్య (నవీన చంద్ర), శ్రుతి (కామాక్షి భాస్కర్) (Kamakshi Bhaskarla) ది చక్కని కుటుంబం. హాయిగా జీవితాన్ని సాగిస్తుంటాడు. ఓ రోజు రాత్రి బిల్డింగ్ లోని ఫ్యామిలీస్ అంతా కలిసి పార్టీ ఏర్పాటు చేసుకుంటారు. అదే సమయంలో అటు పెట్రోలింగ్ కు వచ్చిన సీఐ లక్ష్మీకాంత్ (రాజా రవీంద్ర), అతని అసిస్టెంట్ కు... సూర్యకు మధ్య వాగ్వివాదం జరుగుతుంది. సివిక్ సెన్స్ లేకుండా మిడ్ నైట్ పార్టీలు జరుపుకోవడంపై సీఐ ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. ఆ మర్నాడే సూర్య కూతురు మెడలో గొలుసు ను ఒకడు లాక్కుపోతుంటే వీరు ప్రతిఘటిస్తారు. దాంతో అతను ప్రమాదవశాత్తు ప్రాణాలు విడుస్తాడు. అతని శవాన్ని ఎవరికీ కనిపించకుండా ఇంట్లో దాస్తారు. ఈలోగా రాత్రి జరిగి రాద్ధాంతంతో పోలీసులు మరోసారి సూర్య ఇంటి తలుపు తడతారు. అదే సమయంలో సూర్య అత్తమామలు అక్కడికి బయలు దేరతారు. ఈ వ్యవహారాన్ని ఎలా టాకిల్ చేయాలో తెలియక లాయర్ వరదరాజులు (నరేష్‌) సాయం కోరతాడు సూర్య. అనుకోకుండా చేసిన హత్య నుండి సూర్య బయట పడ్డాడా? సూర్య పై కక్ష కట్టిన పోలీసులు అతన్ని ఎలాంటి వేదింపులకు గురిచేశారు? సరదాగా స్నేహితులతో జరుపుకునే మిడ్ నైట్ పార్టీతో సూర్య ఎదుర్కొన్న ఇబ్బందులేమిటీ? వీటి నుండి అతను ఎలా బయట పడ్డాడు? అనేది మిగతా కథ.


ఎలాఉందంటే...

శుక్రవారమే జనం ముందుకు వచ్చిన నితిన్ 'తమ్ముడు' సినిమా మాదిరిగానే ఇది కూడా ఒకటి రెండు రోజుల్లో జరిగే కథే. అయితే నూతన దర్శకుడు మదన్ దక్షిణామూర్తి ఈ థ్రిల్లర్ స్టోరీని వీలైంత వినోద ప్రధానంగా చెప్పే ప్రయత్నం చేశాడు. ప్రథమార్థం నిదానంగా సాగడంతో బోర్ కొడుతుంది. అయితే క్లయిమాక్స్ దగ్గరకు వచ్చేసరికీ ఆ లోటు తీరుతుంది. థియేటర్ నుండి బయటకు వచ్చే ప్రేక్షకులకు ఓ రకమైన సంతృప్తి కలుగుతుంది. మేకింగ్ విషయంలో ఇది టీవీ సీరియల్ ను తలపించింది. ఒక చిన్న పొరపాటు జరిగినా... మధ్య తరగతి మనుషులు ఎలా తడబడిపోతారు, భయపడిపోతారు అనే దాన్ని బాగా చూపించారు. శేఖర్ చంద్ర నేపథ్య సంగీతం బాగుంది. నటుడు కూడా అయిన శ్రీనివాస్ గవిరెడ్డి రాసిన మాటలు ఆకట్టుకుంటాయి.

నవీన్ చంద్ర, కామాక్షి భాస్కర్ల సహజమైన నటన ప్రదర్శించారు. ఇక సీనియర్ నటుడు నరేశ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీ ఉండదు. అలానే రాజా రవీంద్ర సైతం సైకో పోలీస్ ఆఫీసర్ పాత్రలో మెప్పించాడు. ఇతర ప్రధాన పాత్రలను జెమినీ సురేశ్‌, రోహిణి, లక్ష్మీ సుజాత తదితరులు పోషించారు. కిశోర్ గరికిపాటి ఈ కథకు ఎంత కావాలో అంతే ఖర్చు పెట్టారు. రన్ టైమ్ తక్కువ కావడం, క్లయిమాక్స్ బాగుండటం 'షో టైమ్'కు కలిసొచ్చే అంశాలు.

రేటింగ్: 2.5/5

ట్యాగ్ లైన్: ఆకట్టుకునే క్లైమాక్స్ తో షో టైమ్!

Updated Date - Jul 04 , 2025 | 06:31 PM