Sri Sri Sri Raajavaru Review: నార్నె నితిన్ మొదటి సినిమా ఎలా ఉందంటే..
ABN, Publish Date - Jun 06 , 2025 | 08:36 PM
‘ఆయ్’, ‘మ్యాడ్’, మ్యాడ్ స్వ్కేర్ చిత్రాలతో వరుస విజయాలు అందుకున్నారు ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్. తాజాగా ఆయన నుంచి వచ్చిన చిత్రం ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’.
సినిమా రివ్యూ: శ్రీ శ్రీ శ్రీ రాజావారు
విడుదల తేది: 06-06-2025
‘ఆయ్’, ‘మ్యాడ్’, మ్యాడ్ స్వ్కేర్ చిత్రాలతో వరుస విజయాలు అందుకున్నారు ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్. తాజాగా ఆయన నుంచి వచ్చిన చిత్రం ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’. ‘శతమానం భవతి’తో నేషనల్ అవార్డ్ సొంతం చేసుకున్న సతీశ్ వేగేశ్న ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిందీ సినిమా. నార్నే నితిన్ నటించిన తొలి చిత్రం శ్రీశ్రీశ్రీ రాజావారి కథేంటి? కుటుంబ కథలు, విలవలకు ప్రాధాన్యమిచ్చే దర్శకుడు ఈ చిత్రాన్ని ఎలా మలిచారు? ప్రేక్షకుల్ని మెప్పించేలా ఉందా? అన్నది చూద్దాం.
కథ:
రాజా (నార్నే నితిన్) పుట్టుకతోనే సిగరెట్‌కు బానిస. ఆ అలవాటు వల్లే ఊర్లో వాళ్లంతా తనని వెటకారంగా ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’ అని పిలుస్తుంటారు. రాజాకి చిన్నప్పటి నుంచి కృష్ణమూర్తి (రావు రమేశ్) కూతురు నిత్య (సంపద) అంటే ఇష్టం. ఇద్దరూ ప్రేమలో ఉంటారు. పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోవాలనుకుంటారు. తనకు ఇష్టం లేకపోయినా కూతురు ప్రేమని కాదనలేక కృష్ణమూర్తి చివరకు పెళ్లికి సరేనంటాడు కృష్ణమూర్తి. నిశ్చితార్థం రోజు రాజా చేసిన ఓ తప్పు వల్ల పెద్ద గొడవ జరుగుతుంది. దాంతో పెళ్లి ఆగిపోతుంది. ఆ తర్వాత కొన్ని అనుకోని పరిణామాల వల్ల రాజా తండ్రి సుబ్బరాజు (నరేశ్), కృష్ణమూర్తికి ఓ ఛాలెంజ్ విసురుతాడు. ఊర్లో ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు తన కొడుకు మళ్లీ సిగరెట్ ముట్టడని, ఈ పందెంలో గెలిస్తే నిత్యను తన కొడుక్కి ఇచ్చి పెళ్లి చేయాలని, ఎంపీటీసీ బరి నుంచి తప్పుకోవాలని షరతు పెడతాడు. సవాల్‌కి సవాల్ అన్నట్లు కృష్ణమూర్తి కూడా ఓకే అంటాడు. తదుపరి ఏమైంది? తండ్రి చేసిన ఛాలెంజ్.. తన ప్రేమను గెలిపించుకోవడం కోసం రాజా సిగరెట్ అలవాటును దవులుకున్నాడా? ఈ క్రమంలో అతనికి ఎదురైన సవాళ్లేంటి? రాజాతో సిగరెట్ కాల్పించేందుకు కృష్ణమూర్తి చేసిన ప్రయత్నాలు వర్కవుట్ అయ్యాయా? అన్నది కథ.
విశ్లేషణ: (Sri Sri Sri Raajavaru Review)
నార్నే నితిన్ నటించిన మొదటి సినిమా ఇది. పలు కారణాల చేత విడుదలకు నోచుకోలేదు. ఇప్పుడు అతనికి ఓ మూడు చిత్రాలు హిట్స్ ఉండటంతో ఆ క్రేజ్‌ను బట్టి ప్రేక్షకుల్లోకి తీసుకొచ్చారు. ఓ మలయాళ సినిమా ఆధారంగా సతీశ్ వేగేశ్న ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు నేపథ్యం మార్చి తెరకెక్కించారు. ఆత్రేయపురం బ్యాక్‌డ్రాప్‌లో సాగే చిత్రమిది. అయితే పల్లె వాతావరణంలో ఆహ్లాదభరితంగా తెరకెక్కించినప్పటికీ ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో ఎక్కడో దర్శకుడు మిస్టేక్ చేశారు. ఇందులో హీరో పుట్టగానే సిగరెట్ పొగతో ప్రాణం పోసుకున్నట్లుగా చూపించారు. ఆ తర్వాత వచ్చే సన్నివేశాలు హీరో పాత్ర, తెరకెక్కించిన విధానం కాస్త ఆసక్తి కలిగించే ప్రయత్నం చేసినా ఆ తర్వాత అంతా కథ సాదాగా, స్లోగా సాగుతుంది. హీరోహీరోయిన్ల మధ్య ప్రేమకథను రొటీన్‌గా మలిచారు. నిశ్చితార్థం క్యాన్సిల్ తో కథలో సంఘర్షణ స్టార్ట్ అవుతుంది. కొడుకుతో సిగరెట్ మాన్పించేస్తానంటూ కృష్ణమూర్తికి సుబ్బరాజు సవాల్ విసిరే ఎపిసోడ్‌తో ఇంటర్వెల్ పడుతుంది. అది కాస్త ఫర్వాలేదనిపిస్తుంది. సెకెండాఫ్‌లో హీరో సిగరెట్ మానేసి ఉండగలడా? లేదా? తన, ప్రేమను, తండ్రి మాటను గెలిపించుకుంటాడా? లేదా? అనే కోణంలోనే సాగుతుంది. అయితే ఇదంతా ఊహాజనితంగా సాగుతుంది. నితిన్‌తో సిగరెట్ తాగేలా చేయడానికి కృష్ణమూర్తి టీమ్ ప్రయత్నాలు, ఓ చిన్న యాక్షన్ సీక్వెన్స్ కాస్త టైమ్ పాస్ చేస్తాయి. ఆ తర్వాత కథలో ఎమోషన్స్ మొదలవుతాయి. పందెంలో గెలవడం కోసం రాజా పట్టుదలగా నిలబడటం.. మరోవైపు కృష్ణమూర్తి అతనితో సిగరెట్ తాగించేలా చేయడం కోసం ఊరి ప్రజలకు ఓ పోటీ పెట్టడం.. కూతురి నిశ్చితార్థం పేరుతో డ్రామా ఆడటం వంటి సన్నివేశాలు ఫర్వాలేదనిపిస్తాయి. కథ ముగింపు మాత్రం బాగానే ఉంది.
నటీనటుల పనితీరు.. రాజా క్యారెక్టర్లో నార్నే నితిన్ బాగానే చేశాడు. హీరోగా తొలి చిత్రం అయినప్పటికీ పోరాటాలు, భావోద్వేగ సన్నివేశాల్లో ఆకట్టుకున్నాడు. చిత్రీకరణ కొన్నేళ్ల పాటు సాగడంతో తను భిన్నమైన లుక్స్‌లో కనిపిస్తాడు. పల్లెటూరి పడతిగా సంపద మెప్పించింది. తన క్యూట్ లుక్స్‌తో అలరించింది. రావు రమేశ్, నరేశ్‌లు ఎప్పటిలాగే నటించి మెప్పించారు. సుదర్శన్, ప్రవీణ్ వంటి నటులు ఉన్నా పెద్దగా ఉపయోగం లేనట్లు అనిపించింది. విజువల్‌గా సినిమా గ్రాండ్‌గా ఉంది. పల్లె అందాలను సినిమాటోగ్రాఫర్ దాము నర్రావుల అద్భుతంగా చూపించారు. రెండు పాటలు మినహా కైలాష్ మీనన్ సంగీతం కూడా అంతగా ఆకట్టుకోలేదు. ఎడిటర్ మధు ఫస్టాఫ్‌ను క్రిస్ప్ చేయాల్సింది. నిర్మాత చింతపల్లి రామారావు కథకు తగ్గట్టు ఖర్చు పెట్టారు. కుటుంబ కథలకు పెద్ద పీట వేస్తూ, భావోద్వేగాలు, విలువలకు కేరాఫ్ అయిన దర్శకుడు రొటీన్ కథను తెరపైకి తెచ్చారు.
ట్యాగ్ లైన్: రొటీన్ రాజావారు!!
రేటింగ్: 2/5