Mercy for None: అదిరిపోయే.. కొరియ‌న్ జాన్ విక్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్! మెర్సీ ఫ‌ర్ న‌న్ రివ్యూ

ABN , Publish Date - Jun 11 , 2025 | 10:10 AM

గ‌త వారం డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చిన కొరియ‌న్ నియో నాయిర్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ వెబ్ సిరీస్ మెర్సీ ఫ‌ర్ న‌న్ ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంటుంది.

mercy

గ‌త వారం డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చిన కొరియ‌న్ నియో నాయిర్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ వెబ్ సిరీస్ మెర్సీ ఫ‌ర్ న‌న్ (Mercy for None) ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంటుంది. జూన్‌6 న అందుబాటులోకి వ‌చ్చిన ఈ సిరీస్‌లో సో జి-సబ్, హుహ్ జూన్-హో, అహ్న్ గిల్-కాంగ్, లీ బీమ్-సూ, గాంగ్ మ్యుంగ్, చూ యంగ్-వూ, జో హాన్-చు కీల‌క పాత్ర‌ల్లో న‌టించ‌గా చోయ్ సుంగ్-యూన్ (Choi Sung-eun) ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఐఎమ్‌డీలో 7.6 రేటింగ్ లో టాప్ టెన్‌లో ఉండ‌డం విశేషం. అయితే మ‌న ద‌గ్గ‌ర వ‌చ్చిన కేజీఎఫ్‌, స‌లార్ చిత్రాల‌తో పాటు హాలీవుడ్ జాన్ విక్ సినిమాల‌ను రంగ‌రించి మిక్సీలో వేసి ఈ సిరీస్‌ను రూపొందించిన‌ట్లు ఉండ‌డం గ‌మ‌నార్హం.

క‌థ విష‌యానికి వ‌స్తే..నామ్ గి-జున్ అనే గ్యాంగ్‌స్ట‌ర్ ఓ ప్ర‌మాదం అనంత‌రం క్రిమిన‌ల్ ప‌నుల‌ను వ‌దిలేసి ఆ మాఫియాకు దూరంగా ఓ ర‌హ‌స్య ప్ర‌దేశానికి వెళ్లి వ్య‌వ‌సాయం చేసుకుంటూ కాలం వెళ్ల‌దీస్తుంటాడు. అయితే 11 యేండ్ల త‌ర్వాత త‌ను ఎంత‌గానో ప్రేమించే త‌మ్ముడు నామ్ గి-సియోక్‌ను ఎవ‌రో చంపేస్తారు. దీంతో త‌న త‌మ్ముడిని చంపిన‌ వారిని క‌నిపెట్టి చంపేయాల‌ని నిర్ణ‌యించుకుని తిరిగి సిటీకి వ‌చ్చి వేట మొద‌లు పెడ‌తాడు. ఈ క్ర‌మంలో ఒక‌టి త‌ర్వాత మ‌రోటి గ్యాంగులు ఈ హ‌త్య వెన‌క ఉన్నాయ‌ని తెలుసుకుని ఎదురు వ‌చ్చిన వారు ఎంత‌టి వారైనా ఒక్కొక్క‌రినే అంత‌మొందిస్తూ పోతుంటాడు. ఈ నేప‌థ్యంలో అస‌లు హంత‌కుడిని క‌నిపెట్టాడా, ఎలా చిక్కాడనే ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌క‌థ‌నాల‌తో సిరీస్ సాగుతుంది. అస‌లు విల‌న్ ఎవ‌ర‌నేది చివ‌రి ఎపిసోడ్‌కు గానీ బ‌య‌ట‌ప‌డ‌దు.

అయితే.. విన‌డానికి ఇది మాములు రివేంజ్ స్టోరీ అని అనుకున్నా ఈ సిరీస్ చూస్తున్నంత సేపు ఆ ఫీల్ రాక‌పోగా వాట్ నెక్స్ట్ అనిపించేలా ర‌స‌వ‌త్త‌రంగా తెర‌కెక్కించారు. మొత్తంగా 7 ఎపిసోడ్‌లుగా వ‌చ్చిన ఈ సిరీస్ అన్నీ వేటిక‌వే ప్ర‌త్యేకంగా ఉంటూ, ఎందులోనూ బిగి స‌డ‌ల‌నీయ‌ని స్క్రీన్ ప్లే, యాక్ష‌న్ సీన్ల‌తో అద‌ర‌హో అనిపించేలా తీర్చిదిద్దారు. అస‌లు విల‌న్ దొరికాడు అనుకునే లోపు అత‌ను కాదు అత‌ని వెన‌కాల మ‌రొక‌డు ఉన్నాడ‌ని తెలిసే స‌న్నివేశాలు ప్ర‌తి ఎపిసోడ్‌లోనూ వ‌చ్చి చూసే ప్రేక్ష‌కుల‌కు స‌రికొత్త థ్రిల్‌ను ఇస్తాయి. అలాగే యాక్ష‌న్ సీన్లు కూడా జాన్ విక్ రేంజ్‌లో డిజైన్ చేసి యాక్ష‌న్ ప్రియుల‌కు ఫుల్ మీల్స్ వ‌డ్డించిన‌ట్లుగా ఉంటాయి.

Gs1hIyTbEAAR6Mr.jpg

ఓ వైపు హీరో ఒక్కొక్క‌రి అంతు చూస్తూ వ‌స్తుంటే మ‌రో వైపు గ్యాంగులు, కొట్లాట‌లు, రాజ‌కీయాలు, ఎత్తులు పై ఎత్తుల నేప‌థ్యంలో అద్యంతం ఈ సిరీస్ సస్పెన్స్ తో ఆక‌ట్టుకుంటుంది. ఇప్పుడీ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఓటీటీలో కొరియ‌న్‌తో పాటు, తెలుగు ఇత‌ర భార‌తీయ భాష‌ల్లోనూ అందుబాటులో ఉంది. అదిరిపోయే యాక్ష‌న్ సినిమాలు, డ్రామా, గ్యాంగ్ స్ట‌ర్ చిత్రాలు ఇష్ట ప‌డే వారికి ఈ సినిమా పంచ‌భ‌క్ష ప‌ర‌మాన్నం వంటిది. అంత‌లా పోరాట దృశ్యాలు, స్టోరీ నెరేష‌న్ ఉండి మొత్తం ఏడు ఎపిసోడ్‌లు ఒకే సారి చూసేలా ఇంట్రెస్ట్ క‌లుగ‌జేస్తుంది. పైగా ఎక్క‌డా ఎలాంటి అభ్యంత‌ర‌క‌ర‌, అశ్లీల స‌న్నివేశాలు లేవు. ఇంకా చెప్పాలంటే సినిమాలో ఒకటి, రెండు చోట్ల త‌ప్పితే లేడీ యాక్ట‌ర్స్ అనే వారు సిరీస్‌లో క‌నిపించ‌రు. ఫ్యామిలీతో క‌లిసి చూడొచ్చు.

కాక‌పోతే ఈ కొరియ‌న్ న‌టులంతా ఒకేలా క‌నిపించ‌డం, వారి పేర్లు అంతే క‌న్ఫ్యూజన్‌గా ఉండ‌డం ఎవ‌రి పేరేంటో, ఎవ‌రు ఎవ‌రిని చంపారో అర్ధం చేసుకోడంలో తిక‌మ‌క ప‌డ‌డం గ్యారంటీ. కాక‌పోతే అ హీరో మాత్ర‌మే కాస్త ఐడెంటీ చేసేలా ఉండ‌డం ఫ్ల‌స్ పాయింట్‌. పైగా కుంటుతూ ఉండే మ్యాన‌రిజం దృష్టిలో పెట్టుకుని చూస్తే మాత్రం సిరీస్ ఎక్కే అవ‌కాశం ఉంది. అయితే ఈ సిరీస్‌లో ఇంత ర‌క్త‌పాతం జ‌రిగినా క్లైమాక్స్‌లో ఓ స‌న్నివేశంలో మిన‌హా ఎక్క‌డా, ఎవ‌రు గ‌న్ అనేది వాడ‌క‌పోవ‌డం చాలా విడ్డూరం అనిపిస్తుంది.హీరో కేవ‌లం చేయి, ఓ చిన్న‌ క‌త్తి వాడుతాడంతే.

Updated Date - Jun 11 , 2025 | 01:55 PM