Mass Jathara Review: రవితేజ.. మాస్ జాతర మూవీ రివ్యూ! సినిమా ఎలా ఉందంటే?

ABN , Publish Date - Nov 01 , 2025 | 09:08 AM

టాలీవుడ్ లో ఒక్కో టైమ్ లో ఒక్కో తరహా స్టోరీస్ ఎక్కువ వచ్చేస్తుంటాయి. అలా ప్రస్తుతం గంజాయి కథలు సినిమా ఇండస్ట్రీని డామినేట్ చేస్తున్నాయి.

Mass Jathara Movie

టాలీవుడ్ లో ఒక్కో టైమ్ లో ఒక్కో తరహా స్టోరీస్ ఎక్కువ వచ్చేస్తుంటాయి. అలా ప్రస్తుతం గంజాయి కథలు సినిమా ఇండస్ట్రీని డామినేట్ చేస్తున్నాయి. విలన్స్ గంజాయి దందా చేస్తుంటారు లేదా గంజాయిని వరి పండించినట్టు రైతులతో ఎవరికీ తెలియకుండా పండించేస్తుంటాడు. ఆ పండించే రైతుల శ్రమను దోచుకుంటాడు. వారి రక్షించడానికి హీరో వస్తాడు. విలన్ కు బుద్ధి చెబుతాడు. లేదంటే హీరోనే... ఓ గొప్ప సమాజ కార్యం కోసం తప్పు అని తెలిసినా హీరోయిన్ తో కలిసి గంజాయి వ్యాపారం చేసేస్తుంటాడు. ఆ తర్వాత గంజాయి దందా వల్ల సమాజానికి జరుగుతున్న అన్యాయం తెలుసుకుని తన పైన ఉన్న బిగ్ బాస్ ను అంతం చేసేసి, మంచోడిగా మారిపోతాడు. ఇదీ కాదంటే గంజాయి వాడి యువత తప్పుదారి పట్టడం, అక్రమాలకు, అన్యాయాలకు పాల్పడటం... అందులో కొందరు అమాయకులు జీవితాలను కోల్పోవడం... ఈ టైమ్ లో హీరో ఎంటర్ అయ్యి... గంజాయి వల్ల సమాజానికి జరుగుతున్న చేటు గురించి చెప్పి... విలన్స్ కు చట్టానికి అప్పగిస్తాడు. దాదాపుగా ఇలాంటి కథలే ఇప్పుడు టాలీవుడ్ లో రాజ్యమేలుతున్నాయి.

ఆ కోవకు చెందిందే 'మాస్ జాతర' (Mass Jathara). ఇది రవితేజ (Raviteja) 75వ చిత్రం. అంటే ఓ లాండ్ మార్క్ మూవీ! అలాంటి సినిమా ఎంత కొత్తగా ఉండాలి? దాని కోసం ఎంత ఎఫర్ట్ పెట్టాలి? అదేమీ లేకుండా రొటీన్ మీటర్ లో మూవీని చుట్టేస్తే లాభం ఏమిటీ? విలన్ క్రూరత్వం, హీరో ఎలివేషన్, నాలుగు కామెడీ సీన్స్, వాటిని మ్యాచ్ చేస్తూ ఐటమ్ సాంగ్స్ ను తలపించే మూడు నాలుగు పాటలు! క్లయిమాక్స్ ఫైట్ లో పునకాలు వచ్చేలా దండకాలు నేపథ్యంలో తలలు నరికేయడాలు!? ఇదే ఇవాళ్టి సినిమా ఫార్ములా. దానికి కాస్తంత కూడా అటూ ఇటూ వెళ్ళకుండా జాగ్రత్త పడుతూ దర్శకుడిగా మారిన రచయిత భాను భోగవరపు (Bhanu Bhogavarapu) 'మాస్ జాతర' మూవీని తీశాడు.


ఇంతకూ 'మాస్ జాతర' కథేంటంటే... పోలీస్ అవ్వాలన్నది లక్ష్మణ్‌ భేరీ (రవితేజ) చిన్నప్పటి కోరిక. అయితే నిజాయితీ పరుడైన కొడుకును, కోడలిని పోగొట్టుకున్న అతని తాత (రాజేంద్ర ప్రసాద్ Rajendra Prasad) మనవడికి నచ్చచెప్పి రైల్వే పోలీస్ ను చేస్తాడు. అక్కడైతే రిస్క్ తక్కువ అని చెబుతాడు. కానీ లక్ష్మణ్‌ భేరీ ఎవరి మాట వినేరకం కాదు. అతను ఎక్కడికి ట్రాన్స్ ఫర్ కోసం వెళ్ళినా... రైల్వే స్టేషన్ మాత్రమే కాదు... ఊరు మొత్తాన్ని తన కంట్రోల్ లోకి తీసుకుని శుద్ధి చేసే రకం. అతని ట్రాక్ రికార్డ్ గమనించిన పై అధికారి అజిత్ నారాయణ (సముతిరకని) ఉత్తరాంధ్రలోని 'అడవివరం'కు పంపుతాడు. అక్కడ గంజాయి వ్యాపారాన్ని చేసే శివుడు (నవీన్ చంద్ర Naveen Chandra)కు లక్ష్మణ్‌ భేరీ ఎలా బుద్ధి చెప్పాడన్నదే మిగతా సినిమా. వయసు దాటిపోతున్నా తాత కారణంగా పెళ్ళి పెటాకులు లేకుండా ఉండిపోయిన లక్ష్మణ్‌ భేరీకి అడివి వరంలో గంజాయి వనంలో తులసి మొక్కలా తులసీ (శ్రీలీల Sreeleela) అనే అమ్మాయితో పరిచయం అయ్యి అది ప్రేమగా మారుతుంది. ఊహించని ట్విస్ట్ లతో సాగే ఆ లవ్ ట్రాక్ ఎలా సుఖాంతం అయ్యిందన్నది మరో కథ! ఇందులో హీరో రైల్వే పోలీస్ కావడంతో 'ట్రాక్' అనే పదాన్ని బాగానే యూజ్ చేశారు. మాస్ మహరాజ రవితేజ ట్రాక్ రికార్డ్ ను చూసి, ఆయనకు ఇలాంటి కథలే సూట్ అవుతాయని ఈ కథను రాసుకుని, ఆయనతో చేసినట్టుగా ఉంది తప్పితే ఎలాంటి కొత్తదానికీ మేకర్స్ ప్రయత్నించలేదు. చిత్రం ఏమంటే... సినిమా ప్రారంభంలోనే కథ ట్రాక్ తప్పేసింది. అక్కడ నుండి ముగింపు వరకూ ఎక్కడా మళ్ళీ ట్రాక్ అనేది ఎక్కలేదు.

హీరోలంటే భారీ పారితోషికం తీసుకుని సినిమాలు చేస్తుంటారు. సక్సెస్ ఫెయిల్యూర్ అనేది సెకండరీ! కానీ కోట్లు ఖర్చు పెట్టే నిర్మాతలు ఈ కథ జనాలకు ఎక్కుతుందా లేదా? కొత్తవాడైన దర్శకుడు దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తాడో? అనే అనుమానం లేకుండా కోట్ల రూపాయలను నీళ్ళులా ఖర్చు పెట్టడమే ఆశ్చర్యానికి గురిచేస్తుంది. నిజానికి కథ కొత్తగా లేకపోయినా ఫర్వాలేదు. కనీసం సన్నివేశాలనైనా కొత్తగా తీయాలి కదా! అదీ ఇందులో లేదు. గత యేడాదిగా వస్తున్న గంజాయి బ్యాక్ డ్రాప్ కధలను జనాలు చూసి చూసి విసిగిపోయారు. పూర్తి స్థాయిలో దాని మీదే తీసిన 'ఘాటీ' (Ghaati) లాంటి సినిమా కూడా అడ్రస్ లేకుండా పోయింది. ఇంకా మన వాళ్ళు మాత్రం 'శీలావతి'ని మర్చిపోలేక... అలాంటి కథలనే రాసుకుంటూ ఉన్నారు.

చిత్రం ఏమంటే... ఇందులో క్యారెక్టరైజేషన్ మీద కూడా డైరెక్షన్ టీమ్ దృష్టి పెట్టలేదు. హీరో గుర్తొచ్చినప్పుడల్లా తెలంగాణ యాస మాట్లాడుతుంటాడు. ఆయన తాత మాత్రం మామూలుగా మాట్లాడేస్తుంటాడు. ఇక కథ ఉత్తరాంధ్ర వెళ్ళిన తర్వాత అక్కడి పాత్రలన్నీ కలగాపులగంగా నోటికి ఏ యాస వస్తే అది మాట్లాడేస్తుంటాయి. శివుడి వెనక ఉన్న కలకత్తాలోని పాత్రో వచ్చి ఏదో ఊడబొడిచేస్తాడనే బిల్డప్ ఇచ్చి... తుస్ మనిపించారు. రైల్వే పోలీస్ ముందు ఏ పోలీస్ అయినా దిగదుడుపే అన్నట్టుగా చూపించారు. మురళీశర్మ పాత్రను కామెడీ పీస్ చేసేశారు. ఒకప్పుడు మిలటరీలో పనిచేసిన రాజేంద్ర ప్రసాద్... మనవడి కోసం వాలెంటరీ రిటర్మెంట్ తీసుకుని ఆంటీలను గోకడం ఏమిటో అర్థం కాదు! హీరోయిన్ ఫ్యామిలీకీ ఓ చిత్రమైన ట్విస్ట్ ఇచ్చారు కానీ అది ఏమంత బలంగా లేదు. సీతను చెరబట్టిన రావణుడి లాంటి పాత్రకు శివుడు అనే పేరు పెట్టారు. బహుశా 'గంగను నెత్తిన పెట్టుకున్న శివుడి పేరు పెట్టుకుని, గంగను చెరబట్టడం కరెక్ట్ కాదు' అనే డైలాగ్స్ కోసం ఆ పేరు పెట్టారేమో ఆ పాత్రకు అనిపిస్తుంది. హీరో తాతయ్య, హీరోయిన్... వీళ్ళ పిచ్చి చేష్టల వెనుక గుడ్ ఇంటెన్షన్ ఉందని దర్శకుడు చెప్పాలనుకున్నాడు కానీ అవేవీ ఆడియెన్స్ బుర్రలోకి వెళ్ళవు. ఈ సినిమాలో కాస్తంత కొత్తగా ఏదైనా ఉందంటే శివుడి మావ బృందంపై చిత్రీకరించిన యాక్షన్ ఎపిసోడ్ మాత్రమే.

Super Duper Song Still-2.jpg


ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎవరికి వారు కంఫర్ట్ జోన్ లో హాయిగా చేసుకుంటూ వెళ్ళిపోయారు. రవితేజను స్క్రీన్ మీద అందంగా చూపించడానికి సినిమాటోగ్రాఫర్ విధూ అయ్యన్న బాగానే కష్టపడినట్టు అనిపిస్తుంది. శ్రీలీల కొన్ని కీలక సన్నివేశాల్లో తేలిపోయింది. డైరెక్టర్ భాను 'గ్యాంగ్ లీడర్'లో చిరంజీవి - విజయశాంతి టైపులో... అంటూ ఏదేదో చెప్పారు కానీ ఇక్కడ అంత సీన్ లేదు. రాజేంద్ర ప్రసాద్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పినవి ప్రగల్భాలే! నరేశ్‌ పాత్రనూ సరిగా ఉపయోగించుకోలేదు. అజయ్ ఘోష్, హైపర్‌ ఆది, ప్రవీణ్‌, సముతిర కని, తారక్ పొన్నప్ప, వీటీవీ గణేశ్‌, నవ్య సామి ఆ పాత్రల పరిధి మేరకు నటించారు. విధూ అయ్యన్న సినిమాటోగ్రఫీ బాగుంది. భీమ్స్ (Bheems) కూడా ఇప్పుడు తమన్ బాటలోకి వెళ్ళిపోయాడు. ఒకే దరువును సినిమా అంతే వేసేస్తున్నాడు. 'థమాకా' కాంబోలో సినిమా అనే ఒకే ఒక్క దానిని నమ్మి సూర్యదేవర నాగవంశీ (Suryadevara Nagavamsi), సాయి సౌజన్య దీన్ని నిర్మించారేమో అనిపిస్తుంది.

ఈ సినిమా ప్రీ క్లయిమాక్స్ లో సూపర్ డూపర్ హిట్ సాంగ్ అని ఓ పాట ఉంది... 'ఈ పాటకు రిథమ్ లేదు.. కదం లేదు... పదం లేదు... అర్థం లేదు... పర్థం లేదు... దీనికి సెన్స్ లేదు... కామన్ సెన్స్ లేదు' అంటూ అది సాగుతుంది. ఈ సినిమా కూడా అలాంటి కామన్ సెన్స్ లేనిదే. ఆ పాటలో చెప్పినట్టు అది సోషల్ మీడియాలో సూపర్ డూపర్ హిట్ అయ్యిందేమో కానీ థియేటర్లలో ఈ సినిమా ఆడటం కష్టమే!

రేటింగ్ : 2.25/5

ట్యాగ్ లైన్: మాస్ కోత!

Updated Date - Nov 01 , 2025 | 09:33 AM