Sir madam Review: విజయ్‌ సేతుపతి, నిత్యా మీనన్‌ నటించిన ‘సార్‌ మేడమ్‌’.అలరించిందా..

ABN , Publish Date - Aug 01 , 2025 | 11:56 PM

విజయ్‌ సేతుపతి, నిత్యా మీనన్‌ వైవిధ్యమైన, నటనకు ఆస్కారం ఉన్న పాత్రలకు కేరాఫ్‌ అడ్రస్‌గా చెప్పొచ్చు. ఈ ఇద్దరూ ఓ సినిమా అంగీకరించారంటే అందులో ఏదో విషయం ఉన్నట్టేనని, గ్యారెంటీ సినిమా అని అభిమానులు భావిస్తారు.

Sir madam movie review

సినిమా రివ్యూ: సార్‌ మేడమ్‌.. (Sir Madam Review)
విడుదల తేది:
1–8–2025

విజయ్‌ సేతుపతి(vijay Sethupati), నిత్యా మీనన్‌ (nithya menon) వైవిధ్యమైన, నటనకు ఆస్కారం ఉన్న పాత్రలకు కేరాఫ్‌ అడ్రస్‌గా చెప్పొచ్చు. ఈ ఇద్దరూ ఓ సినిమా అంగీకరించారంటే అందులో ఏదో విషయం ఉన్నట్టేనని, గ్యారెంటీ సినిమా అని అభిమానులు భావిస్తారు. తాజాగా విజయ్‌ సేతుపతి, నిత్యామీనన్‌ జంటగా నటించిన చిత్రం ‘సార్‌ మేడమ్‌’. భార్య భర్తల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి పాండిరాజ్‌ దర్శకత్వం వహించారు. తమిళంలో జులై 25న విడుదలైన ఈ చిత్రం  తెలుగులో శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది.  ఈ కథ ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం. (Director Pandi raj)

కథ: (Thalaivan Thalaivii Story)
ఆకాశవీరయ్య (విజయ్‌ సేతుపతి), అతని కుటుంబం సొంత ఊళ్లోనే హోటల్‌ నడుపుతుంటారు. వీరయ్య పరాటా చేయడంలో ఎక్స్‌పర్ట్‌. అతని పెళ్లి కోసం పక్క ఊరిలో ఓ అమ్మాయిని చూస్తారు. ఆమె పేరు రాణి (నిత్యా మీనన్‌). పెళ్లి చూపుల్లోనే ఆమెపై మనసు  పారేసుకుంటాడు వీరయ్య. వీరిద్దరి పెళ్లికి మొదట ఇరు కుటుంబాలు అంగీకరించినా కుటుంబ నేపథ్యం తెలిసి పెళ్లి చేయడానికి నిరాకరిస్తారు. వీరయ్య, రాణి ప్రేమలో మునిగి తేలుతుంటారు. ఇంట్లో పెళ్లి కాదనడంతో పారిపోయి పెళ్లి చేసుకుంటారు. కొన్నాళ్లు ఈ జంట వైవాహిక జీవితం సాఫీగానే ఉన్నా.. తర్వాత రెండు కుటుంబాల్లోని ఆడవాళ్ల వల్ల గొడవలు మొదలై అవి పెరిగి పెద్దవై విడాకుల దాకా తీసుకొస్తాయి.   ఆ తర్వాత ఏమైంది? వీరయ్య, రాణి ఒకటయ్యారా లేదా అన్నది కథ.


Nithya-menen.jpg

విశ్లేషణ: (Sir madam review)
ప్రతి ఇంట్లోనూ కనిపించే కథే ఇది. సామాన్య కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ కనెక్ట్‌ అయ్యే ఈ కథను దర్శకుడు పాండిరాజ్‌ చాలా నేచురల్‌గా తెరకెక్కించారు. ఇష్టపడి పెళ్లి చేసుకున్న జంట జీవితంలో ఎదురైన సమస్యలు, వాటికి పరిష్కారాలు, ఇద్దరి మధ్య అల్లరి ఆటలు నవ్విస్తాయి. అసలు కథలోకి వెళ్లడానికి కాస్త సమయం తీసుకున్నా.. వీరయ్య, మహారాణి పాత్రలు, ఇతర కుటుంబ సభ్యుల పాత్రలు చక్కని వినోదాన్ని పంచుతాయి. పెళ్లి, గొడవలు, విడిపోవడం, మూడు నెలలపాటు అత్తారింటిలో లేని అమ్మాయి, తదుపరి పాప పుట్టు వెంట్రుకలు తీయడానికి మహారాణి తరుఫు కుటుంబం ప్లాన్‌ చేయడంతో కథ మొదలై అక్కడి నుంచి ప్లాష్‌ బ్యాక్‌, లైవ్‌ స్టోరీని నడిపించిన తీరును దర్శకుడు చక్కగా చెప్పాడు. అయితే అక్కడక్కడా కాస్త బోర్‌ కలిగించేలా ఉన్నా.. కోడలు ఆదిపత్య ధోరణి నచ్చని అత్త, ఆడపడుచు క్రియేట్‌ చేసిన గొడవలతో అటు భార్యకు, ఇటు తల్లి, చెల్లికి ఏం చెప్పాలో తెలియని స్థితిలో వీరయ్య నలిగిపోయే సన్నివేశాలు నవ్విస్తాయి. వీరయ్య వైవాహిక జీవితంలో తన అత్త వేలు పెట్టినప్పటి నుంచి కథలో అసలు సంఘర్షణ మొదలవుతుంది. విరామం సన్నివేశం సెకెండాఫ్‌పై మరింత ఇంట్రెస్ట్‌ కలుగుతుంది. సెకెండాఫ్‌ ప్రారంభం నుంచి వీరభద్ర స్వామి దేవాలయం దగ్గర పుట్టు వెంట్రుకలు తీయడం, విడాకులు గొడవ అక్కడక్కడే తిరిగినట్లు ఉంటుంది. క్లైమాక్స్‌కు ముందొచ్చే సీన్స్‌లో హీరోహీరోయిన్ల మధ్య విడాకులకు సంబంధించిన సీన్స్‌ అలరిస్తాయి. వైవాహిక బంధాన్ని నిలబెట్టుకోవడానికి వీరయ్య చేసే ప్రయత్నాలు, వైవాహిక బంధంపై నేపథ్యంలో క్లైమాక్స్‌లో సాగే సన్నివేశాలు మనసుకు హత్తుకుంటాయి, భావోద్వేగాన్ని కలిగిస్తాయి. సమస్యను పరిష్కరించడానికి వచ్చిన పెద్దల సీన్‌ కాస్త విసుగు తెప్పించినా, అందులోని కొందరు పెళ్లి బంధాన్ని విడదీయడానికి ఇష్టపడని సీన్‌ మాత్రం వివాహ బంధానికి ఉన్న విలువను తెలియజేస్తున్నది. అన్ని గొడవలు జరిగినా చివరికి భార్యాభర్తలైన వీరయ్య, రాణి ఒకరికి ఒకరం అనుకునేలా మళ్లీ కలవడం వంటి సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. అయితే రన్నింగ్‌ స్టోరీలో ఫ్లాష్‌బ్యాక్‌ సీన్స్‌ చెప్పే సన్నివేశాల్లో స్ర్కీన్‌ప్లే వీక్‌గా, కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది.

(Thalaivan Thalaivii Review) నటీనటుల పనితీరు..  వీరూగా విజయ్‌ సేతుపతి సహజంగా నటించాడు. నిత్యా మీనన్‌ ఎప్పటిలాగే తన పాత్రలో చక్కగా సూట్‌ అయింది. చాలా నేచురల్‌గా నటించింది. ఇద్దరి పాత్రలకు ఎక్కడా పేరు పెట్టేలా లేదు. భార్యభర్తలుగా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ, గిల్లికజ్జాలు చక్కగా కుదిరాయి. తల్లి, చెల్లి ఓ వైపు, భార్యకు ఓ వైపు సమాధానం చెప్పలేక నలిగిపోయే వ్యక్తిగా సేతుకి వంద మార్కులు వేయవచ్చు. అతని నటన నవ్విస్తూనే మరోవైపు మనసుల్ని హత్తుకుంటుంది. అయితే అతని వాయిస్‌ మరీ సౌండ్‌ పొల్యూషన్‌లో చిత్రీకరించడం కాస్త విసుగుగా అనిపిస్తుంది. అయితే అతని ప్రాబ్లమ్‌ కాదు.. దర్శకుడు తీర్చిదిద్దిన విధానం అది. యోగిబాబు, కాళివెంకట్‌ పాత్రలు కొంతవరకూ బాగానే నవ్వించాయి. వీరయ్య చెల్లిగా రోషిని ప్రియదర్శిని, తల్లిగా దీపా శంకర్‌ పాత్రలకు న్యాయం చేశారు. ఇతరుల పాత్రధారులు పరిధి మేరకు బాగానే చేశారు. దర్శకుడు చెప్పాలనుకున్నది సింపుల్‌గా చాలా నేచురల్‌గా చెప్పాడు. కానీ స్ర్కీన్‌ప్లే షార్ప్‌గా లేదు. కథ నిడివి కూడా కాస్త ఎక్కువే. సెకెండాఫ్‌లో ట్రిమ్‌ చేసే సన్నివేశాలు చాలానే ఉన్నాయి. సినిమా లొకేషన్స్‌ కూడా సింపుల్‌గా సహజంగా ఉన్నాయి. సంతోష్‌ నారాయణన్‌ సంగీతం సినిమాకు బిగ్గెస్ట్‌ ఎసెట్‌. రెండు పాటలు మాత్రం వినడానికి చాలా బావున్నాయి. కెమెరా వర్క్‌. ఆర్ట్‌ వర్క్‌ కూడా బావుంది. నిర్మాణ విలువలు ఫర్వాలేదు. విహహ బంధం, భార్యభర్తల మధ్య గొడవలు, సర్దుకోవడం, మధ్యలో ఇంటిలో ఆడవాళ్లు కలగజేసుకుంటే జీవితాలు ఎలా కూలిపోతాయో అన్నివర్గాల వారికి కనెక్ట్‌లా దర్శకుడు చెప్పారు. వినోదంతోపాటు భావోద్వేగాలు ఆకట్టుకుంటాయి.

ట్యాగ్‌లైన్‌: ఎంటర్ టైనింగ్ ‘సార్‌ మేడమ్‌’

రేటింగ్: 2.75/5

Updated Date - Aug 02 , 2025 | 08:30 AM