సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Mahavatar Narsimha: ‘మహావతార్‌ నరసింహ’ ఎలా ఉందంటే

ABN, Publish Date - Jul 25 , 2025 | 05:24 PM

అశ్విన్‌ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మహావతార్‌ నరసింహ’. ఐదేళ్ల వయసున్న చిన్నారి భక్తుడు ప్రహ్లాదుని  విష్ణువు ఎలా కాపాడాడు. హిరణ్యకశిపుని నరసింహ అవతారంలో ఉన్న విష్ణువు (సగం మనిషి, సగం సింహం) ఎలా అంతం చేశాడు అన్నది దర్శకుడు ఎలా చెప్పాడంటే.. 

సినిమా రివ్యూ: ‘మహావతార్‌ నరసింహ’ (యానిమేషన్‌)

విడుదల తేది: 25-7-2025

అశ్విన్‌ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మహావతార్‌ నరసింహ’(Mahavatar Narsimha). క్లీమ్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై శిల్పా ధావన్‌, కుశాల్‌ దేశాయ్‌, చైతన్య దేశాయ్‌ యానిమేషన్‌లో ఈ మూవీ నిర్మించారు. ఇదే బ్యానర్‌లో దశావతారాలకు సంబంధించిన కథలన్నీ సినిమాలుగా తెరకెక్కుతున్నాయి. అందులో భాగంగా నరసింహావతారంతో 'మహావతార్ నరసింహ' రూపొందింది. ‘కేజీఎఫ్‌’, ‘సలార్‌’, ‘కాంతార’ వంటి భారీ చిత్రాలను నిర్మించిన హోంబలే ఫిల్మ్స్‌ సమర్పణలో ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. హిందీలో రూపొందిన ఈ సినిమా కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో 2డీ, త్రీడీ వెర్షన్‌లో విడుదల చేశారు. సుప్రసిద్ధమైన భక్త ప్రహ్లాదుడి కథతో ఈ చిత్రం రూపొందింది.

కథ: (Mahavatar Narsimha Review)

కశ్యప మహర్షి, దితి దంపతులకు హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు ఇద్దరు పుత్రులు. వీరద్దరూ రాక్షస గుణాలతో పుడతారు.  శ్రీమహా విష్ణువును శత్రువులుగా చూస్తారు. భూదేవిని సుముద్ర గర్భంలో బంధించిన హిరణ్యాక్షుడిని వరహారూపంలో ఉన్న విష్ణువు వధిస్తాడు. అది తట్టుకోలేని హిరణ్యకశిపుడు ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మ దేవుడి నుంచి వరాన్ని పొందుతాడు. ముల్లోకాల్లో తనను ఎవరూ ఎదిరించలేని బలం పొంది, తానే భగవంతుడినని ప్రకటించుకుంటాడు. శ్రీమహా విష్ణువును అంతం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంటాడు. అయితే హిరణ్యకశిపుడి కుమారుడు ప్రహ్లాదుడు పరమ విష్ణు భక్తుడు. అది తెలిసి తండ్రైన హిరణ్యకశిపుడు తన కొడుకును సైతం చంపడానికి వెనకాడడు. ప్రహ్లాదుని చంపడానికి అతనేం చేశాడు. ఐదేళ్ల వయసున్న చిన్నారి భక్తుడిని విష్ణువు ఎలా కాపాడాడు. హిరణ్యకశిపుని నరసింహ అవతారంలో ఉన్న (సగం మనిషి, సగం సింహం) ఎలా అంతం చేశాడు? అనేది కథ.


విశ్లేషణ: (Mahavatar Narsimha)

అందరికీ తెలిసిన భక్త ప్రహ్లాదుని కథకు యానిమేషన్‌ రూపమే ‘మహావతార్‌ నరసింహ’. ఈ తరానికి భక్త ప్రహ్లాదుడి గురించి తెలియజెప్పడానికి దర్శకుడు చేసిన ప్రయత్నం ఈ చిత్రం అనుకోవచ్చు. కానీ ఇందులో ఎమోషన్‌ మిస్‌ అయింది. కథ పరంగా దర్శకుడు బాగానే రాసుకున్నా.. కొన్ని చోట్ల ఎగ్జిక్యూట్‌ చేయడంలో కాస్త తడబడ్డారు. యానిమేషన్‌ వర్క్‌ విషయంలో కొన్ని చిన్న చిన్న లోపాలు ఉన్నా తదుపరి సీన్‌ ఎలివేషన్‌లో ఆ పొరపాట్లు కొట్టుకుపోతాయి. నరసింహస్వామి ఉగ్ర అవతారం ఎత్తిన క్షణం నుంచి ప్రేక్షకుడి చూపు తిప్పుకోనివ్వకుండా ఉండేలా యాక్షన్‌ సన్నివేశాలు చిత్రీకరించారు. చివరి అరగంట హిరణ్యకశిపుడితో నరసింహ అవతారంలో ఉన్న విష్ణువు చేసే పోరాటం, అతని వధ అబ్బురపరిచేలా ఉన్నాయి. అతని మరణానికి భూమి, ఆకాశం, నీరు, నిప్పు, దేవతలు, జంతువులు, పగలు, రాత్రి ఇవేమీ కారణం కాకూడదని వరం పొందుతాడు. ఇవేమీ కారణం కాదని నరసింహస్వామి చెప్పి వధించే సన్నివేశం చూస్తే గూస్‌ బంప్స్‌ రావడం పక్కా.  వీక్షకులతో విజిల్స్‌ వేయిస్తుంది. ఆ యాక్షన్‌ ఎపిసోడ్స్‌ సినిమాను మరో లెవల్‌కి తీసుకెళ్లాయి. పిల్లలు అయితే ఈ సన్నివేశాలను విపరీతంగా ఇష్టపడతారు. సామ్‌ సి.ఎస్‌ బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ పూనకాలు తెప్పిస్తుంది. పాటల విషయంలో కాస్త జాగ్రత్త తీసుకోవాల్సింది. ప్రహ్లాదుడు చెప్పిన శ్లోకాలు, పాడిన పాటలు బాల గాయకులచే పాడించి ఉంటే ఇంకొంచెం కనెక్టివిటీ పెరిగేది.  నిర్మాణ పరంగా సినిమా చాలా రిచ్‌గా ఉంది. తెలుగు అనువాదం కూడా బాగా కుదిరింది. అయితే ఈ తరం పిల్లలకు  ప్రహ్లాదుని కథ చెప్పాలనుకున్న దర్శకుడు అశ్విన్‌ కుమార్‌ ఆలోచనను అభినందించాలి.

ట్యాగ్‌లైన్‌: యానిమేటెడ్‌ నరసింహ

రేటింగ్‌: 2.75/5

ALSO READ: Mutyala Muggu: 50 వసంతాలైన సినీ వాకిలి ముంగిట చెరిగిపోని 'ముత్యాల ముగ్గు'


Updated Date - Jul 25 , 2025 | 06:18 PM