సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Happy Journey Review: బండి సంజయ్ స‌పోర్ట్ చేసిన‌.. 'హ్యాపీ జర్నీ' మూవీ రివ్యూ

ABN, Publish Date - Nov 21 , 2025 | 10:10 PM

కేంద్రమంత్రి బండి సంజయ్ మూవీ పోస్టర్‌ను ఆవిష్కరించిన‌ 'హ్యాపీజర్నీ' మూవీ శుక్ర‌వారం థియేటర్లలోకి వచ్చింది. మరి ప్రేక్షకులకు ఇది హ్యాపీ జర్నీ అవునో కాదో తెలుసుకుందాం.

Happy Journey Review:

లో-బడ్జెట్ చిత్రాల దర్శక నిర్మాతలు ప్రమోషన్స్ పేరుతో చేసే గిమ్మిక్స్ చూస్తుంటే చిత్రంగా అనిపిస్తుంటుంది. సినిమాల నిర్మాణం కోట్లతో కూడుకున్న వ్యాపారం అయిపోవడంతో తమకున్న పరిచయాలన్నింటినీ ఉపయోగించేసి పబ్లిసిటీ చేసుకుంటున్నారు. సినిమా, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు సైతం కంటెంట్ ఏమిటో తెలియకుండానే ఈ ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. తాజాగా విడుదలైన హ్యాపీ జర్నీ (Happy Journey) మూవీ పోస్టర్ ను కేంద్రమంత్రి బండి సంజయ్ ఆవిష్కరించడంతో ఇదేదో విషయం ఉన్న సినిమానే అయి ఉంటుందనే భావన కలగడం సహజం. రిలీజ్ టైమ్ కు మేకర్స్ చేతులెత్తేయడంతో సైలెంట్ గా ఈ శుక్రవారం 'హ్యాపీజర్నీ' మూవీ థియేటర్లలోకి వచ్చింది. మరి ప్రేక్షకులకు ఇది హ్యాపీ జర్నీ అవునో కాదో తెలుసుకుందాం.

ఇవాళ చదువుకున్న అమ్మాయిలు సైతం ప్రేమ పేరుతో మోసపోతున్నారు. అలాంటి వారి బలహీనతలను ఆసరా చేసుకుని కొందరు మగవాళ్ళు తమ పబ్బం గడుపుకుంటున్నారు. ఇలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలిపే మూవీస్ ఈ మధ్య కాలంలో బాగా వస్తున్నాయి. 'హ్యాపీ జర్నీ' కూడా ఆ కోవకు చెందిన సినిమానే! ఇంతకూ కథ ఏమిటంటే... సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్‌ ఇందు (ఇషానీ ఘోష్) ప్రేమ పేరుతోనూ, పెళ్ళి పేరుతోనూ రెండు సార్లు ఇద్దరు వ్యక్తుల దగ్గర మోసపోతుంది. దాంతో మద్యానికి బానిస అవుతుంది. జీవితం మీద విరక్తి పుట్టి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది. తన అపార్ట్ మెంట్ వాచ్ మెన్ (సత్తన్న) కు చెప్పి ఓ డ్రైవర్ ను ఏర్పాటు చేసుకుని లాంగ్ డ్రైవ్ కు బయలుదేరుతుంది. గోవాలో సూసైడ్ చేసుకోవాలన్నది ఆమె ఆలోచన. అయితే... ఈ క్రమంలో డ్రైవర్ కు తన జీవితంలో జరిగిన సంఘటనలను చెబుతుంది.

ఆమెను ప్రేమించానంటూ వెంటపడిన కొలిగ్ ఆకాశ్ (హరి ప్రసాద్ కోనే) ను నమ్మి ఇందు శారీరకంగా దగ్గరౌతుంది. వారి కలయికను అతను వీడియో తీస్తాడు. ఇందు తన ప్రేమను తిరస్కరించిందనే కోపంతో మరో కొలిగ్ ఆ వీడియోను లీక్ చేస్తాడు. దాంతో తన జీవితం చిక్కుల్లో పడుతుందని భయపడి ఆకాశ్ ఉద్యోగాన్ని, ఇందు నీ వదిలేసి ఊరెళ్ళిపోతాడు. ప్రేమ పేరుతో మోసపోయిన ఇందు ను ఆమె అన్నయ్య ఓదార్చుతాడు. ఆమె గతం తెలిసి కూడా, ఇషానీ ని వివాహం చేసుకోవడానికి డాక్టర్ సాగర్ (హరి ప్రసాద్ కోనే) ముందుకొస్తాడు. కొద్ది రోజుల్లోనే ఆమెపై మోజు తీరడంతో పాత వీడియోను సాకుగా చూపించి, విడాకులు ఇవ్వమని ఒత్తిడి చేస్తాడు. అప్పటి వరకూ ఆమెకు అండగా ఉన్న అన్నయ్య సైతం హఠాన్మరణం చెందడంతో ఇందు మద్యానికి బానిస అవుతుంది. జీవితం మీద విరక్తి కలిగి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటుంది. ఇందు గతాన్ని తెలుసుకున్న డ్రైవర్ శ్రీను (హరిప్రసాద్ కోనే) ఆమెలో ఎలాంటి మార్పు తీసుకొచ్చాడు? ఆమెకు బతుకు మీద ఎలాంటి ఆశలు కల్పించాడు? సాధారణమైన డ్రైవర్ గా ఉన్న అతని నేపథ్యం ఏమిటీ? అనేది మిగతా కథ.


విశేషం ఏమంటే... ఇందు జీవితంలో తారసపడిన ముగ్గురు వ్యక్తులు ఆకాశ్, సాగర్, శ్రీను గా హీరో హరిప్రసాద్ కోనే కనిపిస్తాడు. ఆ రకంగా దర్శకుడు కథను రాసుకోవడం బాగుంది. సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకూ మద్యానికి బానిస అయిన ఓ అమ్మాయి వ్యథను చూపించినా... చివరి ఇరవై నిమిషాల ట్విస్ట్ ఆసక్తికరంగా ఉంది. డ్రైవర్ ఫ్లాష్ బ్యాక్ లో కొంత కొత్తదనం ఉంది. జీవితంలో మోసపోయినా లేదా ఓడిపోయినా మనిషి పోరాడాలి తప్పితే... ఆత్మహత్యకు పాల్పడటం సబబు కాదనే సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం దర్శకుడు చైతన్య కొండ చేశాడు.

హీరోయిన్ గా బెంగాలీ నటి ఇషానీ ఘోష్ బాగా చేసింది. ఇదే ఆమె తొలి తెలుగు సినిమా. ఇందులో నాలుగు డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ తో హరి ప్రసాద్ కోనే ఆకట్టుకున్నాడు. ఇతర ప్రధాన పాత్రలను సత్తన్న, సంజయ్ రాయచూర్‌, ఆనంద్ భారతి, దువ్వాసి మోహన్ తదితరులు పోషించారు. చైతన్య కొండ దర్శకత్వం వహించిన ఈ సినిమాను గంగాధర్ పెద్దకొండ నిర్మించారు. కమర్షియల్ ఎలిమెంట్స్ కు ప్రాధాన్యం ఇచ్చినా... చివరలో పేట్రియాటిజమ్ ను మిక్స్ చేశారు. చైతన్య రాజ్ సంగీతం బాగుంది. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ సాంగ్ ఆకట్టుకునేలా ఉంది. అరుణ్ కుమార్ జ్ఞానవేల్ సినిమాటోగ్రఫీ ఓకే. బడ్జెట్ పరిమితి కారణంగా సినిమాను చుట్టేశారనిపిస్తుంది. ఎలాంటి పబ్లిసిటీ లేకుండా రిలీజ్ చేయడం వల్ల కూడా పబ్లిక్ కు ఈ మూవీ రీచ్ కావడం కష్టమే! ఎంచుకున్న పాయింట్ మంచిదే అయినా... అంతర్లీనంగా సందేశం ఉన్నా... దాన్ని తెరకెక్కించిన విధానం ఆసక్తికరంగా లేకపోవడం, కొన్ని సన్నివేశాలు అతిగా ఉండటంతో ఈ జర్నీ రక్తి కట్టించలేకపోయింది.

ట్యాగ్ లైన్: బోరింగ్ జర్నీ

రేటింగ్: 2/5

Updated Date - Nov 21 , 2025 | 10:47 PM