Eesha Movie Review: ఈషా మూవీ రివ్యూ

ABN , Publish Date - Dec 25 , 2025 | 07:14 AM

హీరో త్రిగుణ్ తెలుగులో నటించిన తొలి చిత్రం 'కథ'. ఆ సినిమా వచ్చి 16 సంవత్సరాలైంది. ఆ సినిమాతోనే దర్శకుడిగా పరిచయం అయ్యాడు శ్రీనివాస్ మన్నే. మళ్ళీ ఇంతకాలానికి వీరిద్దరి కాంబోలో వచ్చిన చిత్రం 'ఈషా'.

హీరో త్రిగుణ్ తెలుగులో నటించిన తొలి చిత్రం 'కథ'. ఆ సినిమా వచ్చి 16 సంవత్సరాలైంది. ఆ సినిమాతోనే దర్శకుడిగా పరిచయం అయ్యాడు శ్రీనివాస్ మన్నే. మళ్ళీ ఇంతకాలానికి వీరిద్దరి కాంబోలో వచ్చిన చిత్రం 'ఈషా' (Eesha) . త్రిగుణ్ (trigun)తో పాటు ఈ సినిమాలో హెబ్బా పటేల్ (hebah patel), సిరి హన్మంతు, 'రాజు వెడ్స్ రాంబాయి' ఫేమ్ అఖిల్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. త్రిగుణ్‌, హెబ్బా గతంలో '24 కిసెస్' మూవీస్ లో జంటగా నటించారు. ఆ తర్వాత వీరిద్దరూ మళ్ళీ కలిసి నటించిన సినిమా ఇదే! కె.ఎల్. దామోదర ప్రసాద్ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాను నందిపాటి వంశీ, బన్నీ వాసు శుక్రవారం జనాల ముందుకు తీసుకొచ్చారు. (Eesha movie review)

'ఈషా' సినిమా ప్రమోషన్స్ ను మేకర్స్ ఓ రేంజ్ లో చేశారు. హార్ట్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు ఈ సినిమాకు దూరంగా ఉండాలని, బలహీన మనస్కులు దీన్ని దయచేసి చూడొద్దని హెచ్చరించారు. మేకర్సే తమ చిత్రాన్ని ఫలానా వాళ్ళు చూడొద్దన్నారంటే... ఇది ఆషామాషీ హారర్ ఫిల్మ్ కాదనే ఫీలింగ్ ఫిల్మ్ గోయర్ లో కలిగింది. మరి మేకర్స్ చెప్పినట్టే ఈ సినిమా ఉందా... లేదా అనేది తెలుసుకుందాం.

కళ్యాణ్‌ (త్రిగుణ్‌), నయన (హెబ్బా పటేల్), అపర్ణ (సిరి హన్మంతు), వినయ్ (అఖిల్ రాజ్) చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్. ఆత్మలు ఉన్నాయంటూ ప్రజలను భయపెట్టి, వారి బలహీనతలను ఆసరాగా చేసుకుని పబ్బం గడిపే దొంగ తాంత్రికుల గుట్టును రట్టు చేసే ప్రయత్నంలో వీరుంటారు. అందుకోసం ఎలాంటి సాహసం చేయడానికైనా వెనకాడరు. అలాంటి వీరి దృష్టి బ్రెయిన్ సర్జన్ డాక్టర్‌ ఆది దేవ్ (పృథ్వీరాజ్) మీద పడుతుంది. అమెరికాలో పేరున్న డాక్టర్ ఆది దేవ్ తన భార్య మరణానంతరం కొన్నేళ్ళ పాటు అజ్ఞాతంలోకి వెళ్ళి ఆ తర్వాత ఇండియాకు తిరిగి వస్తాడు. ఒరిసా సరిహద్దు గ్రామంలో ఆది దేవ్ ఓ ఆశ్రమాన్ని స్థాపించి, మనుషులకు పట్టిన దెయ్యాల్ని వదిల్చే పని మొదలు పెడతాడు. అతని గుట్టు బయట పెట్టాలని ఈ నలుగురు స్నేహితులు అక్కడకు బయలు దేరతారు. అయితే వారికి మార్గం మధ్యలో ఓ ఉపద్రవం ఎదురవుతుంది. దాన్ని అధిగమించి ఆది దేవ్ ఆశ్రమానికి చేరుకుంటారు. అక్కడ వారికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? అమాయక ప్రజలను మోసం చేస్తున్న ఆది దేవ్ నిజ స్వరూపాన్ని వీరు బయట పెట్టారా? ఆ క్రమంలో వారు కోల్పోయిందేమిటీ? గ్రహించిందేమిటీ? అనేదే మిగతా కథ.

హారర్ సినిమా అనగానే ఓ పాడుపడిన భవంతి... అందులోకి నలుగురైదుగురు స్నేహితులు వెళ్ళడం, కొన్ని రోజుల పాటు అక్కడ ఉండటం, ఆ టైమ్ లో ఊహకందని సంఘటనలు జరగడం... అక్కడి దెయ్యాల బారి నుండి తప్పించుకుని బ్రతుకు జీవుడా అంటూ బయట పడటం... ఇదే తంతు కొన్ని దశాబ్దాలుగా సాగుతోంది. ఇది కూడా అందుకు భిన్నమైన సినిమా ఏమీ కాదు. ఇందులోనూ ఆది దేవ్ ఛాలెంజ్ ను అంగీకరించి నలుగురు స్నేహితులు మూడు రాత్రులు ఓ పాడు పడిన భవంతిలో ఎలా గడిపారనే దాని చుట్టూనే కథ సాగింది. ఆ మధ్య వచ్చిన తాప్సీ మూవీ 'ఆనందో బ్రహ్మ' తరహాలో ఈ కథ సాగుతుంది.

సహజంగా హారర్ సినిమాలు భూత్ బంగ్లా లోకి వెళ్ళిన తర్వాత నత్తనడక నడుస్తాయి. కానీ ఈ సినిమా ప్రారంభం నుండి అదే బాటలో సాగింది. అక్కడక్కడే కథ తిరుగుతూ ఎంతకూ ముందుకు సాగదు. పోనీ పురాతన భవంతిలోకి వెళ్ళిన తర్వాత అయినా అక్కడేమైనా వింతలు విడ్డూరాలు జరుగుతాయా అంటే అదీ లేదు. రొట్టకొట్టుడు సన్నివేశాలతో ప్రేక్షకులు సహనాన్ని పరీక్షించాడు డైరెక్టర్. ఇంతోటి సినిమా గతంలో ఎప్పుడూ రాలేదన్నట్టుగా మేకర్స్ ఇచ్చిన బిల్డప్ చూస్తే నవ్వు వస్తుంది. సీన్స్ తో కంటే... బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో కాస్తంత భయాన్ని కలిగించే ప్రయత్నం అయితే జరిగింది. సెకండ్ హాఫ్ మొదలైన కొద్ది సేపటికే ఈ నలుగురు స్నేహితులకు ఏం జరిగిందనే విషయం ఆడియెన్స్ కు అర్థమైపోతుంది. సినిమా మొత్తంలోకి క్లయిమాక్స్ సీన్ ను కాస్తంత బలంగా రాసుకున్నారు. నిజానికి ఆ చిన్న పాయింట్ ను బేస్ చేసుకుని ఈ కథనంతా నడిపారు. అయితే అదేమంత గొప్ప పాయింట్ కూడా కాదు. ఇది చాలా దన్నట్టుగా చివరిలో 'నో ఎండ్' అనే కార్డ్ వేసి, దీనికి సీక్వెల్ కూడా ఉంటుందని తెలిపాడు. నిజానికి అదే ఆడియెన్స్ ను కాస్తంత భయపెట్టిన అంశం!

నటీనటుల విషయానికి వస్తే... సెకండ్ టేక్‌ కు ఆస్కారం ఇవ్వకుండా నటీనటులందరి నుండి వారు ఇచ్చింది దర్శకుడు తీసుకున్నాడనిపిస్తుంది. అయినా ఓ మేరకు త్రిగుణ్, హెబ్బా పటేల్, సిరి హన్మంతు, అఖిల్ రాజ్ బాగానే చేశారు. కొన్ని చోట్ల ఎందుకో నీరసంగా కనిపించారు! ఈ సినిమాలో తమ నటనతో ఆకట్టుకుంది ఇద్దరే ఇద్దరు. ఒకరు పృథ్వీరాజ్, మరొకరు మైమ్ మధు. 'పెళ్ళి' ఫేమ్ పృథ్వీ డాక్టర్ కమ్ తాంత్రిక్ గా కాస్తంత భిన్నమైన గెటప్ లో కనిపించాడు. అతనికి చెప్పిన డబ్బింగ్ వాయిస్ కూడా బాగా సెట్ అయ్యింది. అలానే దెయ్యం పట్టిన వ్యక్తిగా మైమ్ మధు బాగా చేశాడు. యాక్షన్ కాస్త ఓవర్ గా ఉన్నా హారర్ మూవీ కాబట్టి ఫర్వాలేదు. ఇక ఇతర పాత్రలను జోగి కృష్ణంరాజు, మిర్చి మాధవి, దయానందరెడ్డి తదితరులు పోషించారు. ఈ సినిమా టెక్నీషియన్స్ లో బాగా కష్టపడింది సంగీతం దర్శకుడు ఆర్. ఆర్. ధృవన్. ఒక్క సెకన్ కూడా వదలకుండా... ప్రతి సీన్ నూ మరో లెవల్ కు తీసుకెళ్ళడానికి చాలా కష్టపడ్డాడు. ఆ కష్టం తెర మీద కనిపిస్తోంది. కాకపోతే సన్నివేశాలు బలహీనంగా ఉండటంతో... అనేక చోట్ల మ్యూజిక్ డామినేట్ చేసిన భావన కలిగే ప్రమాదం ఏర్పడింది. దర్శకుడు శ్రీనివాస్... ఇంతకాలం తర్వాత రీ-ఎంట్రీ ఇచ్చి ఇంత పేలవమైన కథను ఎంచుకున్నాడేమిటా అనిపిస్తుంది.

ఎంత హారర్ సినిమా అయినా... ఆ యా సన్నివేశాలతో ప్రేక్షకులు కనెక్ట్ కావాలి. తెర మీద కనిపించే పాత్రలు చేస్తోంది సబబు అనిపించాలి. అలా కాకుండా ఆడియెన్స్ ను భయపెట్టడమే లక్ష్యం అనుకుంటే... ఎవరూ డబ్బులిచ్చి భయపడటానికి థియేటర్ల కు రారు. 'ఈషా' విషయంలో అదే జరిగింది. ఈ సినిమా గురించి ఏవేవో అంచనాలు పెట్టుకుని థియేటర్ కు వెళ్ళిన వారు నిరాశకు గురికాక తప్పదు. హారర్ సినిమాలను ఇష్టపడేవారు... ఓటీటీలో స్ట్రీమింగ్ అయినప్పుడు చూస్తే డబ్బులు ఆదా చేసినట్టు అవుతుంది.

ట్యాగ్ లైన్: అదే కథ!

రేటింగ్ : 2.25/5

Updated Date - Dec 25 , 2025 | 07:14 AM