Bun Butter Jam Review: 'బన్ బటర్ జామ్' ఎలా ఉందంటే..
ABN, Publish Date - Aug 22 , 2025 | 02:20 PM
తమిళంలో తెరకెక్కిన యూత్ ఫుల్ లవ్ స్టోరీ 'బన్ బటర్ జామ్’. రాఘవ్ మిర్ధాత్ దర్శకత్వంలో రాజు జయమోహన్, అధియా ప్రసాద్, భవ్యా త్రిఖ నటీనటులుగా విక్రాంత్, శరణ్య, దేవదర్శిని, ఛార్లీ కీలక పాత్రల్లో ఇటీవల తమిళంలో విడుదలైన ఈ చిత్రం యువతను విపరీతంగా ఆకట్టుకుంది.
సినిమా రివ్యూ: 'బన్ బటర్ జామ్' (Bun butter jamReview)
విడుదల తేది: 22–8–2025
తమిళంలో తెరకెక్కిన యూత్ ఫుల్ లవ్ స్టోరీ 'బన్ బటర్ జామ్’ (Bun butter jam movie). రాఘవ్ మిర్ధాత్ (Raghav mirdath) దర్శకత్వంలో రాజు జయమోహన్(Raju Jeyamohan), అధియా ప్రసాద్, భవ్యా త్రిఖ (Bhavya Trikha) నటీనటులుగా విక్రాంత్, శరణ్య, దేవదర్శిని, ఛార్లీ కీలక పాత్రల్లో ఇటీవల తమిళంలో విడుదలైన ఈ చిత్రం యువతను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు అదే టైటిల్తో శ్రీవిఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సతీశ్ కుమార్ తెలుగులో డబ్ చేసి విడుదల చేశారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ రొమాంటిక్ కామెడీ మూవీ ప్రేక్షకుల్ని ఏ మేరకు మెప్పిస్తుందో చూద్దాం.
కథ: (Bun butter jam movie)
లలిత (శరణ్య), ఉమ (దేవ దర్శిని) ప్రస్తుతం ప్రేమ పెళ్లిళ్లు, పెద్దలు కుదర్చిన వివాహాలు ఏవీ కూడా సక్సెస్ కావడం లేదని, ఏదైనా మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోతున్నాయని గమనించి ఇంటర్ చదువుతున్న తమ బిడ్డల్ని దగ్గర చేసి ఒకటి చేయాలనుకుని ప్లాన్ వేస్తారు. లలిత కొడుకు చంద్రు (రాజు జయమోహన్), ఉమ తన కూతురు మధుమిత (ఆద్య ప్రసాద్) మధ్య స్నేహం పెంచాలని చూస్తారు. దాని కోసం ఉమ కుటుంబం కూడా లలిత ఇంటిపైన దిగుతారు. అమ్మాయిలకు ఆమడ దూరం ఉండే చంద్రు తన క్లాస్మేట్ నందిని (భవ్య త్రిఖా)తో ప్రేమలో పడతాడు. తను కూడా అతన్ని పేమిస్తుంది. మరో పక్క చంద్రు చిన్ననాటి స్నేహితుడు శ్రీనివాస్ (మైఖేల్) కూడా నందినిని ప్రేమిస్తాడు. మధుమిత ఆకాశ్ (వీజే పప్పు)తో ప్రేమలో ఉంటుంది. చివరికి వీరి ప్రేమకథలు ఎలా ముగిశాయి. చదువులో వీక్ అయిన చంద్రూ తన గమ్యాన్ని చేరుకున్నాడా? హీరోహీరోయిన్ల తల్లులు వేసిన ప్లాన్ ఏమయింది? అన్నది ఈ సినిమా కథ.
విశ్లేషణ:
వివాహా బంధం నిలబడాలంటే ఏం చేయాలి? అసలు ప్రేమ ఎలా ఉండాలి? అన్న పాయింట్ కు స్నేహాన్ని జోడించి అల్లిన కథ ఇది. ప్రథమార్ధం అంతా కాలేజ్, లవ్ స్టోరీ, ఇద్దరి మధ్య ప్రేమ పుట్టుకొచ్చే సన్నివేశాలతో సాగిపోతుంది. ఈ మధ్యలో హీరో హీరోయిన్ల తల్లులు చేసే ఫన్ అలరిస్తుంది. ఇక సెకండాఫ్ ముందు చంద్రు, శ్రీనివాస్ మధ్య గ్యాప్ రావడం, దాని వెనకున్న కారణం, చిన్న ట్విస్ట్ను రివీల్ చేసిన తీరు బావుంది. అక్కడి నుంచి కథ ఎమోషనల్ గా సాగుతుంది. ప్రేమలో ఓడిపోతే అక్కడే ఆగిపోవాలా? నిజమైన ప్రేమకు అర్థం ఏంటి? అనేది చూపించాడు దర్శకుడు. ఎక్కడో పుట్టిన బన్, జామ్ను మనం ఇండియాలో తింటున్నాం. అలాగే ప్రేమ కూడా అంతే. ఒకరి కోసం ఎవరో ఎక్కడో పుడతారు. అన్ని కలిసొస్తే వాళ్లు కలవచ్చు… కలవకపోవచ్చు. అయితే ట్విస్ట్ రివీల్ అయిన తర్వాతి కథ - పతాక సన్నివేశాలు ఊహకు అందేలా సాగిపోతాయి. గతం గురించి ఆలోచించకుండా, భవిష్యత్తుపై ఎక్కువ ఆశలు పెట్టుకోకుండా ప్రస్తుతం మన చేతిలో ఏది ఉంటే అదే మనది. అలా ముందుకెళ్లడమే జీవితం అని చెప్పిన సన్నివేశంలో సందేశం ఉంది కానీ అది సాగదీసినట్లు అనిపిస్తుంది. ఈ సినిమాలో లవ్ జర్నీ ఈ జనరేషన్కి బాగా కనెక్ట్ అవుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు.
నటీనటుల పనితీరు...
చంద్రు పాత్రలో రాజు జయమోహన్ చక్కగా నటించాడు. తొలుత అమ్మాయిలంటే భయపడుతూ తల్లి చాటు బిడ్డలా కనిపించిన అతను తర్వాత ప్రేమలో పడి.. ఆ రెండు వేరియేషన్స్ బాగా చూపించాడు. నటన కూడా సహజంగా ఉంది. రీల్స్, ఇన్స్టాగ్రామ్ ఇన్ ఫ్లూయెన్సర్ నందినిగా భవ్య త్రిఖా నేటి తరం అమ్మాయికు బాగా కనెక్ట్ అవుతుంది. శరణ్య, దేవ దర్శిని పాత్రలు ట్రెండీ పేరెంట్స్గా మంచి నటన కనబర్చారు. మధుమిత, శివ, శ్రీనివాస్, ఆకాశ్ పాత్రలు అన్ని బాగానే కుదిరాయి. నివాస్ కె ప్రసన్న అందించిన నేపథ్య సంగీతం సన్నివేశాలకు తగ్గట్టు కుదిరాయి. పాటలు అంతగా ఆకట్టుకునేలా లేకపోవడం మైనస్ అనే చెప్పాలి. అయితే మాటలు బాగా కుదిరాయి. కొన్ని మనసుకు హత్తుకుంటాయి. బాబుకుమార్ సినిమాటోగ్రఫీ బావుంది. విజువల్గా రిచ్నెస్ కనిపిస్తుంది. ఎడిటర్ జాన్ అబ్రహాం కాలేజ్ సన్నివేశాలకు కత్తెర వేసుంటే బావుండేది. నిర్మాణ విలువలు బావున్నాయి. దర్శకుడు రాఘవ్ మిర్ధాత్ చెప్పిన పాయింట్ ఇప్పటి జనరేషన్కి అతికినట్టుగా ఉంది. అనువాదంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకోవలసింది. సాగతీత పక్కన పెడితే వినోదం, కథకు తగ్గ ఎమోషన్స్ చక్కగా పండాయి. మరి తెలుగు ప్రేక్షకులు 'బన్ బటర్ జామ్'తో ఏ మేరకు సంతృప్తి పడతారో చూడాలి.
ట్యాగ్ లైన్ : బన్ బ(బె)టర్ జామ్
రేటింగ్: 2.75/5