12 A Railway colony: '12 ఎ రైల్వే కాలనీ' అల్లరి నరేష్ కు హిట్ ఇచ్చిందా...

ABN , Publish Date - Nov 21 , 2025 | 06:53 PM

'అల్లరి' నరేశ్‌కు సక్సెస్‌ ఫెయిల్యూర్స్‌తో పని లేదు. అవకాశాలు వస్తూనే ఉంటాయి. సినిమాలు చేస్తూనే ఉంటాడు. ఒకప్పుడు వరుస విజయాలతో దూసుకుపోయిన నరేశ్‌ సరైన హిట్‌ చూసి చాలా కాలమైంది. శుక్రవారం అతని కొత్త సినిమా '12 ఎ రైల్వే కాలనీ' విడుదలైంది.

12A Railway colony Review

కెరీర్‌ బిగినింగ్‌ నుంచి కామెడీ జానర్‌తోనే ట్రావెల్‌ చేసిన నరేశ్‌ కొంతకాలంగా పంథా మార్చాడు. కాస్త డిఫరెంట్‌ కథలు ఎంపిక చేసుకుంటున్నాడు. తాజాగా అతను నటించిన చిత్రం ‘12 ఎ రైల్వే కాలనీ’. ఈ సినిమాకు ‘మా ఊరి పొలిమేర’, ‘పొలిమేర 2’ దర్శకుడు డాక్టర్ అనిల్‌ విశ్వనాథ్‌ కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందించగా నాని కాసరగడ్డ డైరెక్షన్ చేశాడు. కామాక్షి భాస్కర్ల ఇందులో హీరోయిన్ కానీ హీరోయిన్! మైండ్‌ గేమ్‌, సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన '12 ఎ రైల్వే కాలనీ' మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం!

కథేంటంటే...

కార్తీక్‌ (నరేష్‌) ఓ అనాథ. వరంగల్‌లో ఫ్రెండ్స్‌ హర్ష చెముడు, గెటప్‌ శ్రీను, సద్దాంతో కలిసి రాజకీయ నాయకుడు టిల్లు (జీవన్‌ కుమార్‌) దగ్గర తిరుగుతుంటాడు. తన పక్కింట్లో ఉండే ఆరాధన (కామాక్షి భాస్కర్ల) ను ఎంతో ఇష్టంగా ప్రేమిస్తాడు. మంచి బాడ్మింటన్‌ ప్లేయర్‌ అయిన ఆమె ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే! సింగపూర్‌ టోర్నమెంట్‌కు వెళ్లడానికి ఆమెకు మూడు లక్షల రూపాయలు అవసరం పడుతుంది. ఎన్నో ప్రయత్నాలు చేసి అవమానాల పాలవుతుంది. అది తెలుసుకున్న కార్తిక్‌ ఆమెకు సాయం చేయాలనుకుంటాడు. టిల్లు ఇచ్చిన ఓ కవర్ ను ఆరాధన ఇంట్లో పెడితే సేఫ్ గా ఉంటుందని భావించి గోడ దూకి మేడ ఎక్కి... లోపలికి అడుగుపెడతాడు. అక్కడ ఆరాధన, ఆమె తల్లి శవాలుగా చూసి షాక్ కు గురవుతాడు. ఈ కేసును ఇన్వెస్టిగేషన్‌ ఆఫీసర్‌ రాణా ప్రతాప్‌ (సాయి కుమార్‌) ఎలా పరిష్కరించాడు? వారి మరణానికి, ముంబైలో ఉన్న డాక్టర్‌ జయదేవ్‌ షిండే (అనీష్‌ కురువిల్లా)కు ఉన్న సంబంధం ఏంటి? ఆ తల్లీ కూతుళ్ళ చంపింది ఎవరు? అన్నది మిగతా కథ.


ఎలా ఉందంటే...

హైదరాబాద్ కుందన్‌బాగ్‌లో జరిగిన ఓ యదార్థ సంఘటనల ఆధారంగా ఈ మర్డర్‌ మిస్టరీ కథను అనిల్ విశ్వనాథ్ రాశారు. దీనికి లైటర్‌ వేలో తాంత్రిక పూజలు, ఆత్మల అంశాలను జోడించారు. ఫస్ట్ హాఫ్‌ అంతా హీరో, అతని స్నేహితులు, వాళ్ళు ఉండే రైల్వే కాలనీ, ఆకతాయిగా తిరగడం, అమ్మాయి వెంట పడటం తో సో సోగా సాగింది. బై ఎలక్షన్స్ లో ఎలాగైనా గెలిచి ఎమ్మెల్లే కావడం కోసం టిల్లు చేయించే తాంత్రిక పూజల నేపథ్యంతో కథ కాస్తంత రూట్ మారింది. సెకెండాఫ్‌ అంతా ఆరాధన, ఆమె తల్లి హత్య, దాని వెనకున్న మిస్టరీతో సాగింది. ఈ మర్డర్ వెనకున్న మిస్టరీని చేధించడానికి హీరో చేసే ప్రయత్నాలు కాస్తంత ఆకట్టుకుంటాయి. అసలు ఈ మర్డర్‌ వెనకున్నది ఎవరో చెప్పడానికి క్లైమాక్స్‌ దాకా టైమ్‌ తీసుకున్నాడు డైరెక్టర్. మర్డర్‌ మిస్టరీని చేధించడం అంటే కొన్ని లాజిక్స్‌ మస్ట్‌గా ఫాలో కావాలి. అవన్నీ గాలికి వదిలేశారు. ఇందులో సస్పెక్ట్‌.... పోలీస్‌కు 5 వేలు కొడితే కాల్‌ రికార్డ్‌ ఇచ్చేస్తాడు. ఇలాంటి లూప్ హోల్స్ చాలానే ఉన్నాయి. అలాగే హీరో క్యారెక్టర్‌ ను సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేదు. ఇన్వెస్టిగేషన్ థ్రిలర్‌ అంటే థియేటర్లోని ప్రేక్షకులకు ఉత్సుకత కలగాలి. కానీ అది ఏ కోశానా ఇందులో లేదు.


నటీనటులు, సాంకేతిక నిపుణుల విషయానికొస్తే.. అల్లరి నరేశ్‌ కథ క్యారెక్టర్‌ మొదట మామూలుగా ఉన్నా.. తర్వాత సీరియస్‌ టోన్‌లోకి వెళ్లిపోయింది. అతనికి ఇది సాధారణ పాత్రే. కార్తిక్‌ క్యారెక్టర్ ను తనదైన శైలిలో చేసుకుంటూ వెళ్లిపోయాడు. సినిమాకు కీలకం ఆరాధన పాత్రధారి కామాక్షి భాస్కర్ల ది. ఆమె మంచి ఆర్టిస్ట్‌. పాత్రకు న్యాయం చేసింది కానీ నటనకు స్కోప్‌ ఉన్నా దర్శకుడు ఉపయోగించుకోలేదు. సాయికుమార్‌, జీవన్‌, అనీష్‌ కురువిల్లా, మధుమణి పాత్రల మేరకు నటించారు. గెటప్‌ శ్రీను, వైవా హర్షా ఉన్నా నవ్వులు పెద్దంతగా పండలేదు. ఆర్టిస్టులకు తెలంగాణ యాస అసలు సూట్ కాలేదు. క్లైమాక్స్‌ లో అభిరామి ఎంట్రీ అస్సలు ఊహించదనిది. ఆమె సీన్ లోకి అడుగుపెట్టిన తర్వాతే మూవీ పలు మలుపులు తిరిగి, ఆసక్తిని రేకెత్తించింది. రొటీన్ కు భిన్నంగా భీమ్స్ ఈ హారర్ కామెడీకి కొత్తగా ప్రయత్నం చేశాడు. కానీ అదేమంత గొప్పగా లేదు. కుశేందర్‌ రమేశ్‌ రెడ్డి సినిమాటోగ్రఫీ ఓకే. దర్శకుడే ఈ చిత్రానికి ఎడిటర్‌ కావడంతో లెంగ్త్ ను తగ్గించే విషయంలో రాజీ పడినట్టు అనిపించింది. సహజంగా నిర్మాత శ్రీనివాసా చిట్టూరి నిర్మాణం విషయంలో రాజీ పడరు. కానీ ఈ సినిమా అందుకు భిన్నంగా ఉంది. ఇక అనిల్ విశ్వనాథ్‌ విషయానికొస్తే క్లైమాక్స్‌ 15 నిమిషాలు కాస్త బలంగా రాసుకున్నారు. దాన్ని రేసీగా తెరకెక్కించారు. అయితే ఆ క్లయిమాక్స్ కోసం రెండున్నర గంటలు కూర్చోవడం కష్టమే! దీనికి తోడు '13 బి రైల్వే కాలనీ' అంటూ దీనికి సీక్వెల్ కూడా ఉంటుందని బెదరగొట్టారు.

ట్యాగ్‌లైన్‌: ఓల్డ్ రైల్వే కాలనీ!

రేటింగ్‌: 2.25/5

Updated Date - Nov 21 , 2025 | 07:32 PM