Vijay Devarakonda: అందరి వేలు అతనివైపే...

ABN, Publish Date - May 03 , 2025 | 12:07 PM

విజయ్ దేవరకొండ సినిమా విడుదల కాబోతున్న ప్రతిసారి అతన్ని అపఖ్యాతి పాలు చేసేందుకు ఓ వర్గం ప్రయత్నిస్తోందని అతని అభిమానులు వాపోతున్నారు. తాజాగా విజయ్ పై వస్తున్న విమర్శలూ అలాంటివేనని వారు అంటున్నారు.

అభిమానులు రౌడీ హీరో అని ముద్దుగా పిలుచుకునే విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) అందరికీ కొంతకాలంగా సాఫ్ట్ టార్గెట్ గా మారిపోయాడు. అతను ఏం మాట్లాడినా... ఏం చేసినా అది చర్చనీయాంశంగా మారిపోతోంది. లేదంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'అర్జున్ రెడ్డి' (Arjun Reddy) సినిమాతో మొదలైన ఈ విమర్శల దాడి... ఇప్పుడు 'కింగ్ డమ్' (Kingdom) వరకూ సాగుతూనే ఉంది. విజయ్ దేవరకొండకు సక్సెస్ వస్తే కొందరు తట్టుకోలేకపోతున్నారు... అలానే అతనికి ఫ్లాప్ వస్తే మరి కొందరు సంబరాలు చేసుకుంటున్నారు అని సినిమా రంగంలోని వారే చాలామంది అనుకుంటూ ఉంటారు. 'అర్జున్ రెడ్డి' సినిమా విడుదల సమయంలో విజయ్ దేవరకొండ చేసిన కొన్ని వ్యాఖ్యలు... అతన్ని బ్యాడ్ చేశాయి. అప్పటి నుండి అతన్ని టార్గెట్ చేయడమే ధ్యేయంగా ఓ వర్గం పనికట్టుకుని కూర్చుందనే విమర్శలూ లేకపోలేదు. 'లైగర్' పరాజయంతో విజయ్ దేవరకొండ వ్యతిరేక వర్గం చాలా ఆనందపడిందని అంటారు. అయినా... విజయ్ దేవరకొండకు మాత్రం అవకాశాలు తగ్గలేదు. పెద్ద బ్యానర్స్, పాపులర్ డైరెక్టర్స్ అతనితో సినిమాలు తీయడానికి సిద్థంగానే ఉన్నారు. ఈ నెల 30న 'కింగ్ డమ్' విడుదల కాబోతున్న నేపథ్యంలో ఏదో రకంగా విజయ్ దేవరకొండ వ్యాఖ్యలను తప్పుపడుతూ, అతన్ని ట్రోల్ చేయడం మళ్ళీ మొదలైంది.

మొన్నటికి మొన్న పహల్గామ్ లో జరిగిన టెర్రిస్టుల అటాక్ ను విమర్శిస్తూ విజయ్ దేవరకొండ 'రెట్రో' (Retro) ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో చేసిన వ్యాఖ్యలు అతన్ని ఇరకాటంలో పడేశాయి. టెర్రరిస్టులను తిట్టే క్రమంలో ఆవేశంగా విజయ్ దేవరకొండ మాట తూలడంతో అతనిపై ఇప్పుడు పోలీసు కేసులు నమోదు అయ్యాయి. దాంతో రెండు రోజులుగా విజయ్ చేసిన వ్యాఖ్యలు, అతని దుందుడుకుతనంపై విపరీతమైన చర్చజరుగుతోంది.

తాజాగా విజయ్ దేవరకొండ దీనిపై వివరణ ఇచ్చాడు. 'ట్రైబ్' అనే పదాన్ని తాను ఏ అర్థంలో వాడాడో వివరించాడు. షెడ్యూల్ ట్రైబ్స్ ను ఉద్దేశించి... తాను ఆ మాట వాడలేదని, ఒకవేళ వారిని ఆ మాటలు హర్ట్ చేసి ఉంటే క్షమించమని కోరాడు.


ఈ కథ ఇలా ఉంటే... ఇప్పుడు మరో వర్గం గతంలో 'ఛావా' (Chhaava) సినిమా గురించి విజయ్ చేసిన వ్యాఖ్యలను తాజాగా విడుదలై 'ఫూలే' చిత్రానికి ముడిపెట్టి విమర్శలు మొదలు పెట్టింది.

'ఛావా' సినిమా చూసిన తర్వాత ఔరంగజేబు చెంపలు వాయించాలన్నంత కోపం వచ్చిందని ఒకానొక సందర్భంలో విజయ్ దేవరకొండ వ్యాఖ్యానించాడు. దాన్ని కోట్ చేస్తూ... 'మరి ఇప్పుడు 'ఫూలే' సినిమా చూస్తే నీకు ఎవరి చెంపలు వాయించాలనిపిస్తుంది విజయ్?' అంటూ వితండ వాదాన్ని ఓ వర్గం మొదలెట్టింది. శంభాజీ మహరాజ్ ను చిత్రహింసలకు గురిచేసిన ఔరంగజేబు మీదకు నీకు అంత కసి ఉంటే... మరి పూలేను అవమానించిన బ్రాహ్మణుల మీద నీకు ఎంత కసి ఉండాలి? అని పరోక్షంగా వారు విజయ్ దేవరకొండను ప్రశ్నిస్తున్నారన్న మాట! అంటే... శంభాజీని మతం మారనందుకు ఖండఖండాలుగా చంపేసి ఔరంగజేబును... పూలేని అవమానించిన బ్రాహ్మణ వర్గాన్ని ఒకే గాట కట్టే ప్రయత్నం వారు చేస్తున్నారు. ఇలాంటి వారందరికీ తమ హీరో విజయ్ సాఫ్ట్ టార్గెట్ గా దొరికాడని అతని ఫ్యాన్స్ వాపోతున్నారు. విజయ్ దేవరకొండను పనికట్టుకుని విమర్శిస్తున్న వారి ఎజెండా వేరే ఉందని, వారు ఎవరినో విమర్శించడానికి విజయ్ వ్యాఖ్యలను ఆసరాగా తీసుకుంటున్నారని అంటున్నారు. నిజం చెప్పాలంటే... స్టార్ స్టేటస్ ను అందుకున్న విజయ్ దేవరకొండ లాంటి వారు భావావేశాలను కాస్తంత అదుపులో పెట్టుకుని ఆలోంచించి మాట్లాడితే... ఇలాంటి కువిమర్శకులకు తావు ఉండదు. మరి ఆ దిశగా రౌడీ హీరో ప్రయత్నిస్తాడేమో చూడాలి.

Also Read: Deepika Padukone: అప్పుడు వద్దని..  ఇప్పుడు ఓకే అందట..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - May 03 , 2025 | 12:27 PM