Tollywood Directors: వీరి సినిమాలు ఎప్పుడు...
ABN, Publish Date - Apr 17 , 2025 | 01:25 PM
వెండితెరపై తొలి చిత్రంతోనే తమ సత్తాను చాటుకుని విజయకేతనం ఎగరేసిన చాలామంది దర్శకులు ఇవాళ తెరమరుగైపోయారు. ఎందుకలా!?
యావద్భారతం టాలీవుడ్ (Tollywood) వైపే చూస్తోంది. తెలుగు సినిమా రంగంలోని ప్రతిభావంతులకు జనం జేజేలు పలుకుతున్నారు. ఈ బ్యాక్ డ్రాప్ లో ఒకప్పుడు తమ క్రియేటివిటీతో కిర్రెక్కించిన పలువురు దర్శకులను జనం గుర్తు చేసుకుంటున్నారు. ఎందుకని వారు సినిమాలు తీయడం లేదో అర్థం కావడం లేదనీ చర్చలు సాగుతున్నాయి. ఇంతకూ ఏ యే దర్శకులు అలా చర్చల్లో చోటు సంపాదిస్తున్నారో చూద్దాం.
ఏదీ ఆ నాటి వైభవం?
ఒకప్పుడు తమదైన బాణీ పలికిస్తూ ఎందరో దర్శకులు ఓ వెలుగు వెలిగారు. వారందరూ ఏమయ్యారు? వారి ప్రతిభ ఏమయింది అంటూ సినీఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. అలాంటి వారిలో ముందుగా క్రియేటివ్ డైరెక్టర్ అన్న మాటను పేరుకు ముందు నిలుపుకున్న దర్శకుడు కృష్ణవంశీ (Krishna Vamshi) నిలుస్తారు... ఒకప్పుడు కృష్ణవంశీ సినిమా వస్తోందంటే చాలు మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూసేవారు. ఇప్పుడు అంత సీన్ లేదు. కానీ, ఆయన ఫ్యాన్స్ మాత్రం కృష్ణవంశీ సినిమాల కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. రెండేళ్ళ క్రితం వచ్చిన 'రంగమార్తాండ' (Ranga Maarthanda) కృష్ణవంశీ చివరి చిత్రం. మళ్ళీ కృష్ణవంశీ ఎప్పుడు కొత్త ప్రాజెక్ట్ ఆరంభిస్తారో అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. కృష్ణవంశీ పేరు తలచుకోగానే ఈ నాటికీ అప్పట్లో ఆయన తెరకెక్కించిన పలు చిత్రాలు ప్రేక్షకుల మదిలో మెదలుతూనే ఉండడం విశేషం!
వాళ్ళిద్దరూ ఏమయ్యారు?
కృష్ణవంశీ లాగే తొలి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్న డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి (Chandra Sekhar Yeleti)... ఆయన మొదటి సినిమా 'ఐతే' చిన్నగా వచ్చి మంచి విజయం సాధించింది. ఆ తరువాత యేలేటి రూపొందించిన "అనుకోకుండా ఒకరోజు, ఒక్కడున్నాడు" వంటివీ అలరించాయి. నాలుగేళ్ళ క్రితం నితిన్ హీరోగా యేలేటి రూపొందించిన 'చెక్' జనాన్ని మెప్పించలేకపోయింది. తరువాత యేలేటి సినిమా లేదు... తొలి చిత్రం 'అతనొక్కడే'తోనే అందరి దృష్టిని ఆకర్షించిన సురేందర్ రెడ్డి (Surender Reddy) తరువాత "కిక్, రేసుగుర్రం" వంటి హిట్స్ తో పాటు 'సైరా...నరసింహారెడ్డి' లాంటి పీరియడ్ డ్రామానూ రూపొందించారు. రెండేళ్ళ క్రితం సురేందర్ రూపొందించిన 'ఏజెంట్' వచ్చింది. ఏ మాత్రం ఆకట్టుకోలేక పోయింది. పవన్ కళ్యాణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ తాళ్ళూరి ఓ సినిమా తీయబోతున్నట్టు ప్రకటించారు. కానీ పవన్ డిప్యూటీ సీ.ఎం. అయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ సెట్స్ కు వెళ్లడం కష్టమని తేలిపోయింది. దాంతో సురేందర్ రెడ్డితోనే రామ్ తాళ్ళూరి ఓ మూవీ నిర్మిస్తానని చెప్పారు. కానీ అది ఎప్పుడు పట్టాలెక్కేదీ తెలియడం లేదు.
మళ్ళీ వచ్చేది ఎప్పుడో!?
తొలి సినిమా 'కొత్తబంగారు లోకం'తోనే భలేగా అలరించిన శ్రీకాంత్ అడ్డాల (Srikanth Addala) తరువాత 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు'తో తనదైన బాణీ పలికించారు. ఆ తరువాతే శ్రీకాంత్ గ్రాఫ్ పడిపోయింది. రెండేళ్ళ క్రితం 'పెదకాపు 1'తో వచ్చిన శ్రీకాంత్ మళ్ళీ ఏ సినిమా ప్రకటించలేదు. మధ్య ఒకటి రెండు తమిళ చిత్రాల రీమేక్స్ కు శ్రీకాంత్ అడ్డాల పేరు వినిపించింది కానీ అవేవీ వర్కౌట్ కాలేదు. ఇక మొదటి చిత్రం 'యువత'తో ఆకట్టుకున్న పరశురామ్ (Parasuram) ఆ పై 'గీతగోవిందం'తో బంపర్ హిట్ పట్టేశారు. దాంతో మహేశ్ బాబుతో 'సర్కారువారి పాట' తీసే ఛాన్స్ కొట్టేశారు. కాకపోతే, ఆ సినిమా ఫలితం ఆశించిన తీరున అందలేదు. అయినా 'దిల్' రాజు... పరశురామ్, విజయ్ దేవరకొండ సక్సెస్ కాంబోను దృష్టిలో పెట్టుకుని 'ఫ్యామిలీ స్టార్' మూవీని నిర్మించారు. ఈ సినిమా పరాజయం పాలైంది. ఆపైన ఏ సినిమాతో పరశురామ్ పలకరిస్తారో అని ప్రేక్షకులు చూస్తున్నారు.
టాప్ హీరోస్ తోనే సాగిన వంశీ పైడిపల్లి 'మున్నా'తో పెద్దగా మురిపించలేకపోయినా, 'బృందావనం'తో ఆకట్టుకున్నారు. ఆ పై 'ఎవడు, ఊపిరి' వంటి వైవిధ్యమైన చిత్రాలతో పాటు 'మహర్షి' వంటి సూపర్ హిట్ అందుకున్నారు. తమిళంలో విజయ్ తో 'వారిసు' తీసి మురిపించిన వంశీ పైడిపల్లి తరువాతి సినిమా ఎప్పుడా అని జనం ఎదురు చూస్తున్నారు. వీరితో పాటు కిశోర్ తిరుమల, శివ నిర్వాణ వంటి దర్శకుల తరువాతి సినిమాలేంటో కూడా తెలియడం లేదు. ఇంతకూ ఈ దర్శకులకు ఏమయింది? ఎందుకింత గ్యాప్ తీసుకుంటున్నారని సినీజనం చర్చించుకుంటున్నారు. మరి ఈ దర్శకుల్లో ఎవరు ఏ సినిమాతో మళ్ళీ ప్రేక్షకులను పలకరిస్తారో చూడాలి.
Also Read: Rashmika : రిలేషన్ షిప్స్ చెడిపోరాదంటున్న రశ్మిక
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి