Telugu cinema: జాతీయ అవార్డులు..సత్తా చాటిన తెలుగు సినిమా
ABN, Publish Date - Aug 02 , 2025 | 06:38 AM
భారతీయ చిత్ర పరిశ్రమకు 2023 సంవత్సరానికి గాను 71వ జాతీయ పురస్కారాలను కేంద్రం శుక్రవారం ప్రకటించింది
భారతీయ చిత్ర పరిశ్రమకు 2023 సంవత్సరానికి గాను 71వ జాతీయ పురస్కారాలను కేంద్రం శుక్రవారం ప్రకటించింది. విధు వినోద్ చోప్రా తెరకెక్కించిన ‘ట్వల్త్ ఫెయిల్’ ఉత్తమ చిత్రంగా నిలిచింది. షారుక్ ఖాన్ (జవాన్), విక్రాంత్ మాస్సే(ట్వల్త్ ఫెయిల్) సంయుక్తంగా ఉత్తమ నటుడి అవార్డుకు ఎంపికయ్యారు. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఈ పురస్కారాల రేసులో టాలీవుడ్ సత్తాచాటింది. ఏకంగా ఏడు పురస్కారాలను దక్కించుకుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ కధానాయకుడిగా తెరకెక్కిన ‘భగవంత్ కేసరి’ ప్రాంతీయ చిత్రాల విభాగంలో ఉత్తమ తెలుగు సినిమాగా ఎంపికైంది. చిన్న చిత్రంగా విడుదలై సంచలన విజయం సాధించిన ‘హను-మాన్’ చిత్రానికి.. ‘ఉత్తమ యానిమేషన్- విజువల్ ఎఫెక్ట్స్’, ‘యాక్షన్ కొరియోగ్రఫీ’ విభాగాల్లో రెండు అవార్డులు దక్కాయి. యువతరాన్ని విశేషంగా ఆకట్టుకున్న ‘బేబీ’ చిత్రంతో.. ఉత్తమ స్ర్కీన్ ప్లే రచయితగా చిత్ర దర్శకుడు సాయి రాజేశ్, ఉత్తమ గాయకుడుగా పీవీఎన్‌ఎస్ రోహిత్ ఎంపికయ్యారు. ‘బలగం’ చిత్రంలోని ‘ఊరూ పల్లెటూరు’ అంటూ అందరి హృదయాలను హత్తుకునేలా పాట రాసిన కాసర్ల శ్యామ్‌కు ఉత్తమ గేయ రచయితగా జాతీయ అవార్డు దక్కింది.
తెలుగు చలన చిత్ర సీమ మరోసారి తెలుగు వారంతా గర్వపడేలా చేసింది. సినీ ప్రపంచంలో తెలుగోడి సత్తాను చాటి చెబుతూ 71వ జాతీయ సినిమా అవార్డుల్లో ఏడు పురస్కారాలతో అదరగొట్టింది. 2023 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం జాతీయ అవార్డులు ప్రకటించింది. ఇందులో ‘ఊరూ.. పల్లెటూరు..’’ అంటూ తెలంగాణ గ్రామీణ సంస్కృతిని వివరిస్తూ ‘బలగం’ సినిమా కోసం పాట రాసిన కాసర్ల శ్యామ్‌ను ఉత్తమ గేయ రచయిత అవార్డు వరించింది. అలాగే, ఉత్తమ తెలుగు చిత్రంగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ కథానాయకుడిగా తెరకెక్కిన ‘భగవంత్ కేసరి’ అవార్డు దక్కించుకోగా, హనుమాన్ సినిమా ఉత్తమ యానిమేషన్- విజువల్ ఎఫెక్ట్స్, ఫైట్స్ కొరియోగ్రఫీ విభాగాల్లో రెండు అవార్డులు సాధించింది. ‘బేబీ’ చిత్రం.. ఉత్తమ స్ర్కీన్ ప్లే (సాయి రాజేశ్), ఉత్తమ గాయకుడి (పీవీఎన్‌ఎ్‌స రోహిత్) విభాగాల్లో రెండు పురస్కారాలు సాధించగా, ‘గాంధీతాత చెట్టు’ చిత్రంతో నటించిన దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతి వేణి ఉత్తమ బాలనటి పురస్కారానికి ఎంపికయ్యారు. ఇక, 2023కి గాను ‘ట్వల్త్ ఫెయిల్’ జాతీయ ఉత్తమ చిత్రం అవార్డు దక్కించుకోగా.. షారుక్ ఖాన్(జవాన్), విక్రాంత్ మస్సె(ట్వల్త్ ఫెయిల్) సంయుక్తంగా ఉత్తమ కథానాయకుడి అవార్డుకు ఎంపికయ్యారు. అలాగే, మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే చిత్రానికి గాను రాణీ ముఖర్జీకి ఉత్తమ నటి అవార్డు దక్కింది.
ఈ గౌరవం చిత్ర బృందానిదే!
జాతీయ పురస్కారాల్లో ‘భగవత్ కేసరి’ ఎంపిక కావడం నాకు అపారమైన గౌరవం. ఈ గౌరవం మొత్తం మా చిత్ర బృందానికే దక్కుతుంది. చిత్ర నిర్మాతలు సాహు గారపాటి, హరీష్ పెద్ది, ఈ కథను అద్భుతంగా ఆవిష్కరించిన దర్శకుడు అనిల్ రావిపూడి, అలాగే ప్రతి కళాకారుడు, సాంకేతిక నిపుణుడు, సిబ్బంది అందరి కృషి వల్లే ఈ విజయం సాధ్యమైంది. ఈ గుర్తింపు మాకు మరింత స్ఫూర్తినిస్తూ..ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను తాకే శక్తిమంతమైన కథలను అందించాలన్న మా తపనను మరింత బలపరుస్తోంది.
- నందమూరి బాలకృష్ణ