Sriramana: భరణి ప్రధాన పాత్రధారిగా బంగారు మురుగు
ABN, Publish Date - May 01 , 2025 | 06:14 PM
స్వర్గీయ శ్రీరమణ రాసిన 'బంగారు మురుగు' కథ తెలుగు సాహిత్యంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఇప్పుడా కథ వెండితెరపై ఆవిష్కృతం కాబోతోంది.
ప్రముఖ పత్రికా సంపాదకులు, రచయిత, స్వర్గీయ శ్రీరమణ (Sreeramana) కు తెలుగు సాహిత్యంలో ప్రత్యేక స్థానం ఉంది. ఆయన రాసిన 'మిథునం' (Midhunam) కథను తొలుత మలయాళంలో సినిమాగా తీశారు. ఆ తర్వాత అదే కథ తెలుగులో 'మిథునం' పేరుతోనే రూపుదిద్దుకుంది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మీ జంటగా ఈ సినిమాను తనికెళ్ళ భరణి (Tanikella Bharani) తెరకెక్కించారు. శ్రీరమణ మరణానంతరం ఆయన మరో కథ 'బంగారు మురుగు' వెండితెరపై ఆవిష్కృతం అవుతోంది. ఈ సినిమాలో తనికెళ్ళ భరణి ముఖ్య పాత్రను పోషిస్తుండటం విశేషం.
'బంగారు మురుగు' కథ సైతం శ్రీరమణకు ఎనలేని ఖ్యాతిని తెచ్చిపెట్టింది. ఈ సినిమాకు డొక్కా ఫణి దర్శకత్వం వహిస్తున్నారు. ఫణీంద్ర గొల్లపల్లి (Phanindra Gollapalli) కార్యనిర్వాహక నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తెలుగు సాహిత్యంలో అద్భుతమైన కథలు ఉన్నాయి. అయితే వాటిని ప్రేక్షకామోదకరంగా తెరకెక్కించే దర్శకులే కరువయ్యారు. మన దర్శకులు తెలుగు కథల మీద ఒకసారి దృష్టి సారిస్తే... కథలు కరువు అనే మాటే వినిపించదు. కోనసీమలో చిత్రీకరణ జరుపుకున్న 'బంగారు మురుగు' చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెలువడనున్నాయి.
Also Read: Retro Review: సూర్య యాక్షన్ ఎంటర్టైనర్ ఎలా ఉందంటే..
Also Read: Bhogi: భీమ్స్ ను తప్పించారా... తప్పుకున్నాడా...
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి