Venkatesh, Srivishnu: క్రేజీ కాంబోలో సినిమా...
ABN, Publish Date - May 13 , 2025 | 01:47 PM
విక్టరీ వెంకటేశ్ తన అభిమాన హీరో అని శ్రీవిష్ణు అనేకసార్లు తెలిపారు. ఇప్పుడు వీరిద్దరి కాంబోలో ఓ సినిమా తెరకెక్కబోతోందట.
యువ కథానాయకుడు శ్రీవిష్ణు (Sree Vishnu) కు విక్టరీ వెంకటేశ్ (Venkatesh) అభిమాన హీరో. ఈ విషయాన్ని అతను అనేకసార్లు మీడియాలో చెప్పారు. ఇటీవల విడుదలైన శ్రీవిష్ణు '#సింగిల్' (#Single) మూవీలో పలువురు అగ్ర కథానాయకులను అతను ఇమిటేట్ చేశాడు. అందులో నూటికి నూరు శాతం దింపేసింది వెంకటేశ్ నే! '#సింగిల్' మూవీ క్లయిమాక్స్ లో శ్రీవిష్ణు వెంకటేశ్ తరహాలో నటించి, థియేటర్లలో నవ్వులు పూయించాడు. ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ లో దాదాపు ఇరవై కోట్ల గ్రాస్ ను వసూలు చేసి, సక్సెస్ ట్రాక్ ఎక్కేసింది. ఈ మధ్య కాలంలో శ్రీవిష్ణు సినిమాలు ఈ మాత్రం గ్రాస్ వసూలు చేసిందే లేదు. అయితే '#సింగిల్' సినిమా విజయం వెనుక శ్రీవిష్ణుకు మరో సెంటిమెంట్ కలిసొచ్చింది. ఈ సినిమా మే 9న విడుదలైంది. విశేషం ఏమంటే... ఇదే రోజున వెంకటేశ్ నటించిన 'ప్రేమించుకుందాం రా' మూవీ వచ్చింది. 1997లో విడుదలైన 'ప్రేమించుకుందాం... రా' సూపర్ డూపర్ హిట్ అయ్యింది. వెంకటేశ్ కెరీర్ లో ఓ ల్యాండ్ మార్క్ మూవీగా నిలిచింది. ఆ రకంగా తన అభిమాన హీరో వెంకటేశ్ కు కలిసొచ్చిన మే 9వ తేదీనే శ్రీవిష్ణు సైతం '#సింగిల్' తో చక్కని విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇదిలా ఉంటే... ఇప్పుడు వెంకటేశ్, శ్రీవిష్ణు కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ దక్కబోతోంది. గతంలో దర్శకుడు రామ్ అబ్బరాజు (Ram Abbaraju) దర్శకత్వంలో శ్రీవిష్ణు 'సామ జవర గమన' (Sama javara gamana) సినిమాలో నటించాడు. ఇది మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఇదే దర్శకుడు వెంకటేశ్, శ్రీవిష్ణును దృష్టిలో పెట్టుకుని స్క్రిప్ట్ రాస్తున్నాడట. ఇటీవల ఈ విషయాన్ని శ్రీవిష్ణునే చెబుతూ, తన అభిమాన నటుడితో కలిసి నటించబోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపాడు. సో... ఇటు శ్రీవిష్ణు అభిమానులే కాకుండా, వెంకటేశ్ ఫ్యాన్స్ సైతం ఈ ఇద్దరి కాంబోలో మూవీ ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అని ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ యేడాది సంక్రాంతి కానుకగా వచ్చిన 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ రూ. 300 కోట్ల గ్రాస్ ను వసూలు చేయడం, శ్రీవిష్ణు సైతం ఇప్పుడు '#సింగిల్' తో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చేయడంతో వీరి కాంబో మూవీకి ఇప్పటి నుండే క్రేజ్ ఏర్పడింది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ దీనిని నిర్మిస్తుందని అంటున్నారు.
Also Read: Final Destination: స్పెషల్ ప్రీమియర్స్ సాధ్యమయ్యేనా...
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి