Final Destination: స్పెషల్ ప్రీమియర్స్ సాధ్యమయ్యేనా...
ABN , Publish Date - May 13 , 2025 | 01:04 PM
'ఫైనల్ డెస్టినేషన్: బ్లడ్ లైన్స్' చిత్రం ఈ నెల 15న వివిధ భారతీయ భాషల్లో విడుదల కాబోతోంది. ఈ ఫ్రాంచైజ్ లోని చివరి చిత్రానికి ప్రీమియర్స్ షోస్ వేసే ఆలోచన చేస్తున్నారు పంపిణీదారులు.
'ఫైనల్ డెస్టినేషన్' (Final Destination) ఫస్ట్ ఫ్రాంచేజ్ మూవీ 2000 సంవత్సరంలో వచ్చింది. హఠాత్తుగా జరిగే ఊహకందని హత్యల నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఆ హారర్ మూవీ ప్రేక్షకులను విభ్రమకు గురిచేసింది. దాంతో దానికి కొనసాగింపుగా ఆ ఫ్రాంచైజ్ లోనే మరో నాలుగు సినిమాలు వరుగా 2003, 2006, 2009, 2011లో వచ్చాయి. ఇవి కూడా ఒకదానిని మించి ఒకటి విజయం సాధించాయి. 'ఫైనల్ డెస్టినేషన్' తరహాలో హారర్, థ్రిల్లర్ మూవీస్ చాలానే గడిచిన కొన్నేళ్ళుగా వస్తున్నా, వరల్డ్ వైడ్ ఈ ఫ్రాంచైజ్ కు అభిమానులు బాగానే ఉన్నారు. అందుకే మళ్ళీ పద్నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు మరోసారి దీని ఫ్రాంచైజ్ గా 'ఫైనల్ డెస్టినేషన్: బ్లడ్ లైన్స్' (Final Destination: Bloodlines) మూవీ రాబోతోంది. మే 15వ తేదీన ఈ సినిమా ఆంగ్లంతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ కు సిద్థమైంది. తాజాగా విడుదలైన ఈ మూవీ ట్రైలర్ ను చూస్తే... ముందు వచ్చిన ఐదు చిత్రాలకంటే ఇందులో వయొలెన్స్, హారర్, థ్రిలింగ్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటాయనేది అర్థమౌతోంది.
తాజాగా విడుదల కాబోతున్న 'ఫైనల్ డెస్టినేషన్ : బ్లడ్ లైన్స్' అనేది ఈ ఫ్రాంచైజ్ లో చివరి చిత్రం. సో... ఈ ఆరవ చిత్రంతో దీనికి మేకర్స్ ముగింపు పలుకబోతున్నారు. అయితే... ఈ హారర్ మూవీకి ప్రీమియర్ షోస్ వేయడానికి ఇండియాలోని పంపిణీదారులు సిద్ధమౌతున్నారు. థియేటర్ కు వచ్చే ప్రేక్షకులను విపరీతంగా భయపెట్టబోతున్న ఈ సినిమా ప్రీమియర్స్ ను ముందు రోజు రాత్రి 11:59కి మొదలు పెట్టబోతున్నారట. రెండు తెలుగు రాష్ట్రాలలోని ఎంపిక చేసిన థియేటర్లలో ఈ ప్రీమియర్స్ ఉంటాయని అంటున్నారు. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ లో ఖచ్చితంగా ప్రీమియర్ షోస్ పడతాయని చెబుతున్నారు. అయితే... 'పుష్ప -2' (Pushpa -2) మూవీ విడుదలైన సమయంలో జరిగిన చేదు ఘటనల నుండి తెలంగాణ ప్రజలు ఇంకా కోలుకోలేదు. ఆ సమయంలో చిన్నారి శ్రీతేజ్ తీవ్రంగా గాయపడగా, అతని తల్లు కన్నుమూసింది. ఇప్పుడిప్పుడే మామూలు మనిషి అవుతున్నాడు శ్రీతేజ. ఈ నేపథ్యంలో కోర్టులు అర్థరాత్రి ప్రీమియర్ షోస్ మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేశాయి. అలానే అర్థరాత్రి ప్రదర్శించే సినిమాలకు చిన్న పిల్లలను అనుమతించకూడదని కూడా ఉత్తర్వులు జారీచేసింది. ఆ తర్వాత పలువురు పంపిణీదారులు, మల్టీప్లెక్స్ యాజమాన్యం చేసిన వినతి మేరకు ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకోమని, ప్రజలకు అసౌకర్యం లేకుండా చర్యలు తీసుకోమని సినిమా రంగాన్ని కోర్టు ఆదేశించింది. మరి ఇలాంటి సమయంలో 'ఫైనల్ డెస్టినేషన్ : బ్లడ్ లైన్స్' మూవీ ప్రీమియర్స్ షోస్ ను ముందు రోజు అర్థరాత్రి హైదరాబాద్ లో ప్రదర్శిస్తారా? అనే సందేహాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ కాకపోయినా... విజయవాడ, వైజాగ్ లో అవి పడే ఆస్కారం లేకపోలేదు. ఏదేమైనా నిద్రలోనూ జనాలు ఉలిక్కిపడేలా చేసే ఈ హారర్ సినిమాను అర్థరాత్రి వేయడం, జనాలు వాటిని చూడటానికి వెళ్ళడం అనేది చెప్పుకోదగ్గ అంశమే. ఇటీవల కాలంలో తెలుగు స్టార్ హీరోల సినిమాలకు మాత్రమే ఇలా ముందుగా ప్రీమియర్ షోస్ వేస్తున్నారు. ఆ జాబితాలోకి 'ఫైనల్ డెస్టినేషన్ : బ్లడ్ లైన్స్' చేరిందంటే గ్రేటే!
ఇదిలా ఉంటే 'ఫైనల్ డెస్టినేషన్' నిజానికి పది భాగాల పుస్తకం ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఫ్రాంచైజ్. అలానే ఇందులోని పాత్రలతోనే రెండు కామిక్ బుక్స్ కూడా వచ్చాయి. పుస్తకంగా పది భాగాలు వచ్చినా... సినిమాను మాత్రం ఆరు భాగాలకే పరిమితం చేశారు. పాతికేళ్ళుగా తాము అభిమానిస్తున్న ఈ ఫ్రాంచైజ్ మూవీకి 'ఫైనల్ డెస్టినేషన్: బ్లడ్ లైన్స్'తో ఫుల్ స్టాప్ పడుతోందంటే కాస్తంత బాధగానే ఉందని వీక్షకులు చెబుతున్నారు. మరి వీరంత ఈ చివరి చిత్రాన్ని ఏ స్థాయిలో ఆదరిస్తారో చూడాలి.