Razakar: డైరెక్టర్, కెమెరామ్యాన్ కు అవార్డులు...

ABN , Publish Date - May 02 , 2025 | 04:23 PM

గత యేడాది విడుదలై ప్రేక్షకాదరణకు నోచుకున్న 'రజాకార్' మూవీకి ఇటు అవార్డులూ దక్కుతున్నాయి. ప్రతిష్ఠాత్మక దాదాఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ లో రెండు అవార్డులను ఈ సినిమా అందుకుంది.

నిరంకుశ నిజాం నవాబు తొత్తుల్లా వ్యవహరించిన రజాకార్ల అకృత్యాలను యాటా సత్యనారాయణ (Yaata Satyanarayana) వెండితెరపై 'రజాకార్' (Razakar) పేరుతో ఆవిష్కరించారు. తెలంగాణ పల్లెల్లో రజాకార్లు చేసిన దారుణ మారణకాండకు ఈ సినిమా నిలువుటద్దంలా నిలిచింది. విడుదలకు ముందు పలు అడ్డంకులను ఎదుర్కొన్న ఈ సినిమా థియేటర్లలోకి వచ్చిన తర్వాత ప్రేక్షకుల ఆదరణకు నోచుకుంది. అలానే ఈ యేడాది ఓటీటీలో విడుదలైనప్పుడు కూడా వీక్షకుల నుండి చక్కని స్పందన లభించింది.


razakar.jpegఇదిలా ఉంటే... ప్రతిష్ఠాత్మక 15వ దాదాఫాల్కే ఫిలిమ్ ఫెస్టివల్ లో 'రజాకార్' మూవీని ప్రదర్శించారు. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన యాటా సత్యనారాయణ నూతన దర్శకుడి కేటగిరిలో అవార్డుకు ఎంపిక కాగా, కుషేందర్ రమేశ్‌ రెడ్డి బెస్ట్ సినిమాటోగ్రఫర్ గా ఎంపికయ్యాడు. యావత్ భారతదేశంలో స్వాతంత్ర సంబరాలు అంబరాన్ని తాకేలా జరిగితే... నిజాం నియంతృత్వ పాలనలోని ప్రజలు మాత్రం స్వేచ్ఛా వాయువులను పీల్చలేకపోయారు. దానికి తోడు రజాకార్ల చేసిన దారుణ మారణకాండకు బలయ్యారు. ఆనాటి సంఘటనలను కళ్ళకు కట్టినట్టుగా సినిమాటోగ్రాఫర్ రమేశ్‌ రెడ్డి తెరకెక్కించారు. బాబీ సింహా, వేదిక, ప్రేమ, ఇంద్రజ, అనసూయ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాను గూడూరు నారాయణరెడ్డి నిర్మించారు. ఈ సినిమాకు రెండు అవార్డులు రావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. తాను కీలక పాత్ర పోషించిన 'రజాకార్' కు అవార్డులు రావడం ఆనందంగా ఉందని బాబీ సింహా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Also Read: VVan: మైథలాజికల్‌ కథలో తమన్నా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - May 02 , 2025 | 04:28 PM