Mega War: రీ-రిలీజ్ లో ఆసక్తికర పోరు...
ABN , Publish Date - May 05 , 2025 | 03:44 PM
మెగాస్టార్ చిరంజీవి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలు ఈ వీకెండ్ లో రీ-రిలీజ్ కాబోతున్నాయి. అయితే వీటితో పాటు శ్రీవిష్ణు 'సింగిల్' మూవీ సైతం విడుదల కావడం ఆసక్తికరంగా మారింది.
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటించిన 'జగదేక వీరుడు - అతిలోక సుందరి' చిత్రం ఈ నెల 9న రీ-రిలీజ్ కాబోతోంది. మూడున్నర దశాబ్దాల తర్వాత ఆ సినిమాను అదే తేదీన నిర్మాత అశ్వినీదత్ (Ashwinidutt) విడుదల చేస్తున్నారు. విశేషం ఏమంటే త్రీడీలోనూ ఈ సినిమాను ఈసారి ప్రదర్శించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. చిరంజీవి సరసన నటించిన శ్రీదేవి (Sreedevi) ఇవాళ మన మధ్య లేకపోవడం బాధాకరమే అయినా... భారతీయ సినిమా ఉన్నంత కాలం శ్రీదేవి స్మృతులు చెరిగిపోవు. చిత్రం ఏమంటే... చిరంజీవి 'జగదేక వీరుడు అతిలోక సుందరి' మూవీ రీ-రిలీజ్ మర్నాడే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన 'దేశ ముదురు' (Desamuduru) సినిమా రీ-రిలీజ్ కాబోతోంది. మే 9న మామ సినిమా వస్తుంటే.. 10న మేనల్లుడు సినిమా రాబోతోంది. ఇలా మామ సినిమాకే చెక్ పెట్టే పని జరుగుతోంది. ఈ మధ్య కాలంలో ఇలా రీ-రిలీజ్ మూవీస్ ను ఒరిజినల్ ప్రొడ్యూసర్స్ కాకుండా దానిని కొన్న థర్డ్ పార్టీ ప్రొడ్యూసర్స్ రిలీజ్ చేస్తున్నారు. కానీ ఈ రెండు సినిమాలను ఒరిజినల్ ప్రొడ్యూసర్సే తిరిగి విడుదల చేస్తున్నారు. ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ బ్యానర్ వైజయంతి మూవీస్ లో సూపర్ డూపర్ హిట్ ను అందుకున్న సినిమా 'జగదేక వీరుడు - అతిలోక సుందరి'. దాంతో ఆయన ఈ రీ-రిలీజ్ ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. అలానే మరో ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య (DVV Danayya) కు అప్పట్లో 'దేశముదురు' సినిమా మంచి విజయాన్ని కట్టబెట్టింది. ఇవాళ అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ గా ఎదిగిన క్రమంలో అతని ఇమేజ్ కు మ్యాచ్ అయ్యేలా ఈ రీ-రిలీజ్ కు దానయ్య ప్లాన్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే... చిత్రంగా ఈ రెండు సినిమాలతో పాటే వీకెండ్ లో అల్లు అరవింద్ సమర్పణలో నిర్మితమైన '#సింగిల్' (Single) మూవీ వస్తోంది. గీతా ఆర్ట్స్ సమర్పణలో నిర్మితమైన ఈ సినిమాలో శ్రీవిష్ణు (Srivishnu) హీరోగా నటించాడు. మే 9న ఈ సినిమా రిలీజ్ అవుతోంది. అంటే అల్లు అరవింద్ మూవీకి పోటీగా అశ్వనీదత్ 'జగదేక వీరుడు - అతిలోక సుందరి'ని రంగంలోకి దింపుతున్నారు. నిజానికి అల్లు అరవింద్, అశ్వనీదత్ మంచి స్నేహితులు. ఇద్దరూ కలిసి సినిమాలు తీసిన సందర్భాలూ ఉన్నాయి. కానీ ఈ డేట్ తనకు అచ్చి వచ్చింది కావడంతో అశ్వనీదత్ తగ్గేదే లే అంటున్నారు. అల్లు అరవింద్ సైతం '#సింగిల్' మూవీ సక్సెస్ మీద ఉన్న నమ్మకంతో ఇదే డేట్ కు వస్తున్నారు. ఇక ఈ రెండు సినిమాలు విడుదలైన మర్నాడే అంటే మే 10న 'దేశముదురు'ను డీవీవీ దానయ్య రీ-రిలీజ్ చేయడం కూడా ఆసక్తికరంగా మారింది. అంటే అల్లు అరవింద్ నిర్మించిన సినిమా మీదకు పోటీగా ఆయన కొడుకు అల్లు అర్జున్ నటించిన 'దేశముదురు'ను దానయ్య బరిలో దించబోతున్నాడన్నమాట. డీవీవీ దానయ్యకు ఇటు మెగా ఫ్యామిలీకి, అటు అల్లు ఫ్యామిలీకి ఉన్న అనుబంధం అందరికీ తెలిసిందే! ఈ రెండు ఫ్యామిలీస్ హీరోలతో డీవీవీ దానయ్య సినిమాలు నిర్మించారు. అలా ఒకరికి ఒకరు ఎంతో దగ్గరైన ముగ్గురు ప్రముఖులు తమ చిత్రాలను ఒకదానితో ఒకటి పోటీగా విడుదల చేయడమే వింతగా ఉందని ఫిల్మ్ నగర్ లో అనుకుంటున్నారు.
Also Read: Jack OTT: ఓటీటీకి సిద్ధు జొన్నలగడ్డ ‘జాక్’.. ఎందులో. ఎప్పటి నుంచి చూడొచ్చంటే...
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి