Bhadra: బోయపాటి శ్రీను కు ఇరవై ఏళ్ళు

ABN , Publish Date - May 12 , 2025 | 03:45 PM

మాస్ మసాలా మూవీస్ ను తెరకెక్కించడంలో తనకంటూ ఓ ప్రత్యేక బాణీ ఏర్పరచుకున్నారు డైరెక్టర్ బోయపాటి శ్రీను. మే 12తో దర్శకునిగా బోయపాటి ఇరవై ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. ఆయన తొలిసారి దర్శకత్వం వహించిన 'భద్ర' సినిమా మే 12తో ఇరవై ఏళ్ళు పూర్తి చేసుకుంది. అలా డైరెక్టర్ గా బోయపాటి వయసు 20 ఏళ్ళు.

బోయపాటి శ్రీను (Boyapati Srinu) పేరు వినగానే ఆయన రూపొందించిన మాస్ ఎంటర్ టైన్ మెంట్స్ మన స్మృతిపథంలో మెదలుతాయి... నటసింహ నందమూరి బాలకృష్ణతో 'సింహా (Simha), లెజెండ్ (Legend), అఖండ (Akhanda)' చిత్రాల ఘనవిజయంతో హ్యాట్రిక్ చూసిన బోయపాటి ప్రస్తుతం 'అఖండ-2' మేకింగ్ తో బిజీగా ఉన్నారు. ఆయన తొలి చిత్రం 'భద్ర' (Bhadra) 2005 మే 12న విడుదలై విజయఢంకా మోగించింది. రవితేజ హీరోగా దిల్ రాజు నిర్మించిన 'భద్ర' అప్పట్లో యువతను విశేషంగా మురిపించింది. ఇరవై ఏళ్ళ క్రితం మొట్టమొదటి సినిమాతోనే బోయపాటి శ్రీను తనదైన మార్కు చూపించడం అప్పట్లో సినీఫ్యాన్స్ ను ఆకట్టుకుంది.

బోయపాటి సినిమాలను చూస్తే, ఆయనపై బి.గోపాల్ ప్రభావం ఉన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన తెరకెక్కించిన అన్ని సినిమాల్లోనూ యాక్షన్ ఎపిసోడ్స్ ను రూపొందించడంలో ప్రత్యేక శ్రద్ధ వహించిన తీరు కనిపిస్తుంది. అదే బోయపాటి బాణీగా మారిపోయింది. అంతకు ముందు తన సీరియర్ డైరెక్టర్స్ ను చూసి స్ఫూర్తి పొందినా, తనకు నిర్మాత ఇచ్చిన బడ్జెట్ లోపు మూవీని జనం ముందు నిలపడానికి బోయపాటి అహరహం కృషి చేస్తూ ఉంటారు.


తొలి సినిమా 'భద్ర'తోనే బంపర్ హిట్ ను అందుకున్న బోయపాటి శ్రీను రెండో మూవీ 'తులసి' (Tulasi)తోనూ గ్రాండ్ సక్సెస్ చూశారు. మూడో చిత్రం 'సింహా' (Simhaa)తో బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్నారు. ఇలా ఆరంభంలోనే హ్యాట్రిక్ చూసిన బోయపాటి శ్రీను డైరెక్టర్ గా తనకంటూ ఓ ప్రత్యేకతను సొంతం చేసుకున్నారు. బోయపాటి డైరెక్షన్ లో రూపొంది అంతగా అలరించలేకపోయిన 'దమ్ము, జయ జానకీ నాయక, వినయ విధేయ రామ, స్కంద' చిత్రాల్లోనూ యాక్షన్ పార్ట్ తీసిన తీరును ఎవరూ మరచిపోలేరు. ఇక ఆయన సూపర్ డూపర్ హిట్స్ లో పాటల చిత్రీకరణలోనూ పరవశింప చేశారు బోయపాటి. "భద్ర, తులసి, సింహా, లెజెండ్, అఖండ, సరైనోడు" సినిమాలను చూస్తే అన్ని వర్గాల వారిని ఆకట్టుకొనే ప్రయత్నంలో బోయపాటి చేసిన మ్యాజిక్ కనిపిస్తుంది. ప్రతీసారి ఆ మ్యాజిక్ పనిచేయక పోవచ్చు. కానీ, బోయపాటి శ్రీను నుండి ఓ సినిమా వస్తోందంటే చాలు సినీ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూసే క్రేజ్ ను సొంతం చేసుకున్నారాయన.

ఆరంభంలో వరుసగా మూడు సినిమాలతో హ్యాట్రిక్ చూసిన బోయపాటి , బాలకృష్ణతోనూ మూడు వరుస విజయాలతో హ్యాట్రిక్ ను సొంతం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో బాలయ్యతోనే 'అఖండ'కు సీక్వెల్ గా 'అఖండ-2: శివతాండవం'ను రూపొందిస్తున్నారు బోయపాటి. ఈ సినిమాపై అప్పుడే ట్రేడ్ సర్కిల్స్ లో బజ్ నెలకొంది. సెప్టెంబర్ 25న 'అఖండ-2' విడుదల కానుంది. ఇప్పటికే బాలయ్యకు వరుసగా మూడు బంపర్ హిట్స్ అందించిన బోయపాటి నాలుగో సినిమాతో ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తారో అని సినీఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పైగా బాలకృష్ణకు ఇది మొట్టమొదటి పాన్ ఇండియా మూవీ కావడం మరో విశేషం! మరి డైరెక్టర్ గా ఇరవై ఏళ్ళు పూర్తి చేసుకున్న బోయపాటి ఈ సందర్భంగా 'అఖండ-2'తో జనాన్ని ఏ తీరున మురిపిస్తారో చూడాలి.

Also Read: Nagasourya: టెక్నికల్లీ హై గా బ్యాడ్ బాయ్ కార్తీక్...

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - May 12 , 2025 | 03:46 PM