Rani Mukerji: విజయదశమి కానుకగా 'మర్దానీ -3' పోస్టర్
ABN , Publish Date - Sep 22 , 2025 | 02:28 PM
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాణీ ముఖర్జీ నటించిన 'మర్దానీ, మర్దానీ -2' చిత్రాలు మంచి విజయాన్ని అందుకోవడంతో ఇప్పుడు 'మర్దానీ -3' తెరకెక్కుతోంది. దసరా కానుకగా ఈ సినిమా పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
నవరాత్రి శుభారంభం సందర్భంగా యశ్ రాజ్ ఫిల్మ్స్ (Yash Raj Films) నిర్మిస్తున్న ‘మర్దానీ 3’ (Mardaani 3) పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. మంచికి, చెడుకి మధ్య జరిగే పోరాటాల్ని ‘మర్దానీ 3’లో చూపించబోతున్నారు. రాణి ముఖర్జీ (Rani Mukerji) తనకు ఎంతో ఇష్టమైన, ప్రేమించిన డేర్ డెవిల్ పోలీస్ శివానీ శివాజీ రాయ్ (Shivani Shivaji Roy) పాత్రలో మరోసారి కనిపించబోతోన్నారు. మహిషాసురుడిని చంపినప్పుడు దుర్గా మాత శక్తిని తెలిపే ‘అయిగిరి నందిని’ శ్లోకంతో రిలీజ్ చేసిన పోస్టర్ అదిరింది. ఓ కేసుని పరిష్కరించడానికి, దాని కోసం తన ప్రాణాలను పణంగా పెట్టే శివానీ సంకల్పం ఎలాంటిదో ఈ పోస్టర్ చెప్పకనే చెబుతోంది.
ఇండియాలో ఉమెన్ సెంట్రిక్‌గా వచ్చిన చిత్రాలు, సిరీస్‌లలో ‘మర్దానీ’కి ఉండే ప్రత్యేక స్థానం గురించి అందరికీ తెలిసిందే. సమాజానికి కనువిప్పు కలిగించేలా, కళ్ళు తెరిపించేలా మంచి కథలతో ‘మర్దానీ’ ప్రతీ సారి ఆకట్టుకుంటూనే ఉంటుంది. మన దేశంలో ప్రతిరోజూ జరిగే దారుణమైన నేరాలను అందరూ గుర్తించేలా ‘మర్దానీ’ ఫ్రాంచైజీలు వస్తుంటాయి. 'మర్దానీ' సీరిస్ లో మొదటి చిత్రం 2014లో విడుదల కాగా రెండో సినిమా 'మర్దానీ -2' 2019లో రిలీజ్ అయ్యింది. ఈ రెండు సినిమాలు మంచి విజయాన్ని అందుకోవడంతో ఇప్పుడీ మూడో సినిమాను రూపొందిస్తున్నారు. అభిరాజ్ మినావాలా (Abhiraj Minawala) దర్శకత్వంలో ఆదిత్య చోప్రా (Aditya Chopra) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యశ్ రాజ్ ఫిలిమ్స్ నుండి ఐకానిక్ ఉమెన్-కాప్ ఫ్రాంచైజీలో భాగంగా రానున్న ఈ మూడో పార్ట్‌ని ఫిబ్రవరి 27, 2026న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు.
Also Read: Bollywood: కాంట్రవర్సీగా మారిన వరుణ్ ధావన్ వ్యాఖ్యలు
Also Read: Chiranjeevi: 'ప్రాణం ఖరీదు' రోజునే వందో చిత్రం 'త్రినేత్రుడు'