Vikram Bhatt: బయోపిక్ నిర్మాణం... చిక్కుల్లో విక్రమ్ భట్
ABN , Publish Date - Dec 09 , 2025 | 01:17 PM
డా. అజయ్ ముర్దియా జీవితం ఆధారంగా విక్రమ్ భట్ 'తుమ్ కో మేరీ కసమ్' మూవీని తెరకెక్కించారు. అయితే ఈ సినిమా నిర్మాణానికి గానూ తన దగ్గర రూ. 30 కోట్లు తీసుకుని మోసం చేశారని డాక్టర్ అజయ్ కేసు పెట్టడంతో విక్రమ్ భట్ ను ఉదయ్ పూర్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు విక్రమ్ భట్ (Vikram Bhatt) కు కొంతకాలంగా టైమ్ బాలేదు. ఆయన దర్శకత్వం వహించిన సినిమాలు ఆడకపోవడమే కాదు... అవే ఆయన అరెస్ట్ కూ కారణం కావడం వైచిత్రి! ఆదివారం రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ కు చెందిన పోలీసులు ముంబై వచ్చి విక్రమ్ భట్ ను, ఆయన భార్య శ్వేతాంబరిని అరెస్ట్ చేశారు. రూ. 30 కోట్లకు సంబంధించి ఇందిరా ఐవిఎఫ్ హాస్పిటల్ వ్యవస్థాపకుడు డాక్టర్ అజయ్ ముర్దియాను మోసం చేసిన కేసులో ఈ అరెస్ట్ జరిగింది. చిత్రం ఏమంటే... ఐవీఎఫ్ హాస్పిటల్ డాక్టర్ అజయ్ (Dr. Ajai) బయోపిక్ ను ఈ యేడాది విక్రమ్ భట్ సినిమాగా తెరకెక్కించాడు. 'తుమ్ కో మేరీ కసమ్' (Tumko Meri Kasam) అనే ఈ సినిమాలో అనుపమ్ ఖేర్ (Anupam Kher), ఇషా డియోల్ (Esha Deol), అదా శర్మ (Adah Sharma) తదితరులు కీలక పాత్రలు పోషించారు. మార్చి 21న విడుదలైన ఈ సినిమా పరాజయం పాలు కావడంతో విక్రమ్ భట్ న్యాయపరమైన చిక్కుల్లో ఇరుక్కున్నాడు.

'తుమ్ కో మేరీ కసమ్' మూవీ కోసం తన నుండి రూ. 30 కోట్లను వసూలు చేశారని, వాటికి లెక్కలు చూపించలేదని డాక్టర్ అజయ్ ఆరోపిస్తుండగా, ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ కు, నటీనటులకు రెమ్యూనరేషన్స్ ను డాక్టర్ ఇవ్వలేదని, పైగా సినిమా మధ్యలోనే ఆయన తప్పుకుని, తమని మోసం చేశాడని విక్రమ్ భట్ అంటున్నారు. తమకు రావాల్సిన బాకీలను ఎగ్గొట్టడానికి, పరువుకు నష్టం కలిగించడానికి డాక్టర్ అజయ్ ఈ తప్పుడు కేసు పెట్టారని విక్రమ్ భట్ చెబుతున్నారు. ఏదేమైనా విక్రమ్ భట్, ఆయన భార్య శ్వేతాంబరితో పాటు మరో ఆరుగురిపై ఉదయ్ పూర్ లో కేసు నమోదు అయ్యింది. మరి ఈ వివాదం నుండి హారర్ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న విక్రమ్ భట్, అతని భార్య ఎలా బయటపడతారో చూడాలి.
Also Read: Tamannaah Bhatia: శాంతారామ్.. భార్యగా తమన్నా! మిల్కీ బ్యూటీకి.. అదిరిపోయేఛాన్స్