Vidya balan: విద్యాబాలన్ తొలి సినిమా.. 20 ఏళ్ల తర్వాత మళ్లీ..
ABN, Publish Date - Aug 23 , 2025 | 05:42 PM
బాలీవుడ్ నటి విద్యాబాలన్ (Vidya Balan) గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గ్లామర్ పాత్రలతోపాటు నటనకు ఆస్కారం ఉన్న పాత్రలతో మెప్పించి తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు
Parineeta movie: బాలీవుడ్ నటి విద్యాబాలన్ (Vidya Balan) గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గ్లామర్ పాత్రలతోపాటు నటనకు ఆస్కారం ఉన్న పాత్రలతో మెప్పించి తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు! ‘పరిణీత’ (Parineeta) చిత్రంతో కెరీర్ ప్రారంభించింది విద్యాబాలన్. జూన్ 10, 2005న ఈ సినిమా విడుదలైంది. శరత్ చంద్ర చటోపాధ్యాయ రాసిన పరిణీత (1914) అనే బెంగాలీ నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. సంజయ్ దత్, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రలు పోషించారు. ప్రదీప్ సర్కార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 20 ఏళ్ల తర్వాత రీ-రిలీజ్ అవుతోంది. ఆగస్టు 29న పరిణీత చిత్రం ప్రేక్షకులను అలరించడానికి సిద్దమవుతోంది. (Parineeta movie re release)
ఈ సందర్భంగా విద్యాబాలన్ ఆనాటి సంగతులను నెమర వేసుకున్నారు. ‘నాకు బాగా గుర్తుంది. సైఫ్ అలీ ఖాన్ తల్లి, షర్మిలా ఠాగూర్ ఓ రోజు షూటింగ్‌కు వచ్చారు. తనను చూసేందుకు నేను చాలా ఆతురతగా ఎదురు చూశా. ఆవిడంటే నాకెంతో ఇష్టం. మా మధ్య ఎంతో అనుబంధం ఉందన్నట్లుగా ఒకరినొకరం పలకరించుకున్నాం. అది చూసిన సైఫ్.. ఓహ్, మీ ఇద్దరికీ ఇంత పరిచయముందని నాకు ఇప్పటి వరకూ తెలీదు’ అని జోక్ చేశాడు.
ఆ వెంటనే నేను ‘నాకు ఆమె తెలుసు.. కానీ తనకు నేను తెలియదని జవాబిచ్చాను. సైప్ చాలా సరదా మనిషి. ఎప్పుడూ నవ్విస్తుంటాడు. ఆ సంఘటన ఇప్పుడు గుర్తు చేసుకున్నా నవ్వొస్తుంటుంది. (ప్రదీప్ సర్కార్ వల్లే నటనలో మెళకువలు నేర్చుకున్నాను. ప్రతి చిన్న విషయాన్ని కూడా గుర్తించి సీన్ మళ్లీ చేయిస్తాడు. సీన్ సరిగ్గా రాకపోతే వంద టేక్‌లు తీసుకోవడానికి కూడా వెనకాడరు. ఆర్టిస్ట్‌ల నటనే కాదు. బ్యాగ్రౌండ్‌లో ఎగిరే పక్షులు కూడా టైమింగ్ కూడా కరెక్ట్‌గా ఉండాలంటారు. ఒక పాటలో నేను నేను ఏడవాల్సిన సన్నివేశం ఉంది. ఆ పాటలో ఓ లైన్ దగ్గర నా కన్నీటిచుక్క కిందపడాలి. దీని కోసం 28 టేకులు తీసుకున్నాడు’ అని చెప్పారు. దర్శకుడు ప్రదీప్ సర్కార్ 2023లో కన్నుమూశారు.