Vidya Balan@20: నన్ను నేను ప్రేమించుకోవడం మొదలెట్టాను
ABN, Publish Date - Sep 14 , 2025 | 10:10 AM
రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్స్ ఏ భాషలోనైనా చాలామంది ఉంటారు. అయితే నటీమణులుగా ప్రజాదరణ పొందుతూ కొందరే సుదీర్ఘకాలం కెరీర్‌ను కొనసాగిస్తారు. అలాంటివారిలో కచ్చితంగా విద్యాబాలన్ ముందు వరుసలో ఉంటారు.
రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్స్ ఏ భాషలోనైనా చాలామంది ఉంటారు. అయితే నటీమణులుగా ప్రజాదరణ పొందుతూ కొందరే సుదీర్ఘకాలం కెరీర్‌ను కొనసాగిస్తారు. అలాంటివారిలో కచ్చితంగా విద్యాబాలన్ (Vidya balan) ముందు వరుసలో ఉంటారు. ‘పరిణీత’ నుంచి ‘పా’, ‘డర్టీ పిక్చర్’(Dirty picture) , ‘ఇష్కియా’, ‘కహానీ’, ‘శకుంతల’, ‘తుమ్హారీ సులూ’, ‘షేర్నీ’... ఇలా ఏ సినిమాలో అయినా తన మార్క్ నటనతో అందర్నీ ఇట్టే ఆకట్టుకుందామె. వెండితెరపై నటిగా విద్యాబాలన్ ప్రయాణం మొదలయ్యి 20 ఏళ్లు అవుతోంది. రాబోయే రజనీకాంత్ ‘జైలర్ 2’లో కూడా ఆమె ప్రధాన భూమికకు ఎంపికైందని అంటున్నారు. ఈ సందర్భంగా ఇటీవల వెలిబుచ్చిన విద్య మనోభావాలివి...
నన్ను నేను ప్రేమించుకుంటా...
‘పరిణీత విడుదలైన తర్వాత ఓవర్‌నైట్‌లో నాకు స్టార్‌డమ్ వచ్చేసింది. చాలా సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి. అయితే నన్ను స్లిమ్‌గా మారమనేవారు. నేను మొదట్లో నా వంతుగా చాలా ప్రయత్నాలు చేశా. నా శరీరాన్ని చాలా కష్టపెట్టాను. కానీ ఆ తర్వాతే నిజాన్ని గ్రహించాను. ఎవరెన్ని రకాలుగా విమర్శించినా నేను నాలా ఉండాలనుకున్నా. సిద్ధార్థ్ కపూర్ నా జీవితంలోకి ప్రవేశించిన తర్వాత నన్ను నేను ప్రేమించుకోవడం మొదలెట్టాను. అలా చేయగలిగితే, విమర్శలు వాటంతట అవే వెనక్కి వెళతాయి’
ఇమేజ్ అనేది ఓ ట్రాప్...
‘నా ఇమేజ్‌ను అలాగే కొనసాగించాలనే కోరిక నాకు ఏమాత్రం లేదు. అదొక ట్రాప్ అని తెలుసు. అందుకే దాన్నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తా. మహిళా ప్రాధాన్య చిత్రాలకు నన్ను ఒక ప్రతీకలా చెప్పుకోవడాన్ని ఆస్వాదిస్తా. అయితే ఎప్పుడైనా సరే నేనొక బలమైన కథను చెప్పాలనే అనుకున్నా. నేనిక్కడ సందేశాలు ఇచ్చేందుకు లేను. నటించేందుకు మాత్రమే ఉన్నా. ఆ స్పృహ నాకు ఎప్పటికీ ఉంటుంది’
ఏదీ సీరియస్‌గా తీసుకోను..
‘అందరిలా కాకుండా నేను కాస్త ఆలస్యంగానే సినిమాల్లోకి వచ్చానని చెప్పాలి. నా తొలిచిత్రం ‘పరిణీత’ విడుదలైనప్పుడు నా వయస్సు 26 ఏళ్లు. ఎలాంటి సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చాను. నాకు నటన అంటే ఇష్టం. నాకు ఏది ఇష్టమో అదే చేసుకుంటూ వస్తున్న కాబట్టి ఒకరకంగా నేను అదృష్టవంతురాలినే. హిట్, ఫ్లాప్‌ల గురించి అస్సలు పట్టించుకోలేదు కాబట్టి నాకు ఎలాంటి సమస్యలు ఎదురవ్వలేదు. నా వయసు కన్నా ఎక్కువ మెచ్యూర్డ్‌గా ఉంటానని మా అమ్మ అంటుంది. అది నిజం. నేను ఏదీ సీరియస్‌గా తీసుకోను’
మనసు చెప్పిందే వింటా...
‘దర్శకుడు ఆర్.బాల్కీ ఒకసారి అమితాబ్‌బచ్చన్‌కు తల్లిగా చేయాలని అడిగినప్పుడు ఆశ్చర్యపోయా. ‘పా’ స్ర్కిప్ట్ చదివి నా సన్నిహితులకు ఆ విషయం చెప్పినప్పుడు... అందరూ తల్లిపాత్రలో నటిస్తే నీ కెరీర్ ముగుస్తుందని హెచ్చరించారు. కానీ చివరికి నా మనసు చెప్పిందే విన్నాను. అమితాబ్‌కు తల్లిగా నటించా’.
అనుభవాలు చాలా విలువైనవి...
‘చిత్ర పరిశ్రమలో నా 20 ఏళ్ల అనుభవంతో, ఇప్పుడొస్తున్న కొత్త తరానికి చెబుతున్నా. మీరు మీలా ఉండేందుకు ఎప్పుడూ భయపడకండి. మీలో ఉన్న బెస్ట్ మీకు మాత్రమే తెలుసు. ఒకవేళ ఏదైనా ఊహించినట్టు జరగకపోయినా, ఆ అనుభవం నుంచి మీరు కొన్ని పాఠాలు నేర్చుకుంటారు. ఒకరకంగా ఆ అనుభవాలు చాలా విలువైనవి’