Brahmanda Movie: ప్రివ్యూ చూస్తూ దర్శకుడు రాంబాబు కన్నుమూత
ABN , Publish Date - Jul 09 , 2025 | 01:57 PM
ఆమని, బన్నీ రాజు, జయరామ్ తదితరులు కీలక పాత్ర పోషించిన 'బ్రహ్మాండ' చిత్ర దర్శకుడు రాంబాబు హఠాన్మరణం చెందారు. నిన్న తన సినిమా ప్రివ్యూ చూస్తూ ఆయన తుదిశ్వాస విడిచారు.
ఒగ్గు కథ తెలంగాణ జానపద కళారూం. ఒగ్గు అంటే శివుని చేతిలోని డమరుకం. ఈ పదం ఎక్కవగా తెలంగాణ ప్రాంతంలోనే వినిపిస్తుంది. అలాంటి ఒగ్గు కళాకారుల నేపథ్యంలో, వారి సంస్కృతి సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తూ తెరకెక్కిన సినిమా 'బ్రహ్మాండ' (Brahmanda). దీనిని దాసరి సురేశ్ (Dasari Suresh) నిర్మించారు. ఈ సినిమా ద్వారా రాంబాబు (Rambabu) దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. దురదృష్టకరమైన విషయం ఏమంటే... ఈ సినిమా ప్రివ్యూ చూస్తూ థియేటర్ లోనే దర్శకుడు ఎస్. రాంబాబు కన్నుమూశారు.
సహజంగా వయసు మళ్ళిన నటీనటులు నటిస్తూనే కన్నుమూయాలని కోరుకుంటూ ఉంటారు. అలానే కొందరు రంగస్థలం మీద తుది శ్వాస విడవాలనీ అనుకుంటారు. అలాంటిది ఓ తొలి చిత్ర దర్శకుడు తన సినిమా ప్రివ్యూ చూస్తూ హఠాన్మరణ చెందడం అనేది అందరికీ షాక్ గురిచేసింది. మంగళవారం రాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. దర్శకుడు రాంబాబును మిత్రులు హాస్పిటల్ కు హుటాహుటిన తీసుకెళ్ళినా... అప్పటికే ప్రాణం విడిచినట్టు తెలిపారు. బుధవారం సాయంత్రం ఆయన స్వగ్రామం అల్లీపూర్ లో అంత్యక్రియలు జరుగబోతున్నాయి.
మిత్రులు ప్రేమగా నగేశ్ అని పిలిచే ఎస్. రాంబాబుకు తెరకెక్కించిన 'బ్రహ్మండ' మూవీ టీజర్ ను ఇటీవలే 'తండేల్' (Tandel) దర్శకుడు చందు మొండేటి (Chandu Mondeti) విడుదల చేశారు. ఈ సినిమాలో బన్నీ రాజు హీరోగా నటించారు. ఆమని, జయరామ్, కనిక వాద్య, జోగిని శ్యామల, విజయ రంగరాజు తదితరులు కీలక పాత్రలు పోషించారు. సెన్సార్ కార్యక్రమాలు సైతం పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది.