Udaipur Files: సినిమా విడుదల ఆగింది...
ABN , Publish Date - Jul 11 , 2025 | 02:55 PM
శుక్రవారం ఉదయ్ పూర్ ఫైల్స్ సినిమా విడుదల కావాల్సి ఉంది. అయితే ఇప్పుడీ మూవీ ఢిల్లీ హైకోర్ట్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల కారణంగా ఆగిపోయింది.
రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయ్ పూర్ (Udaipur) లో నివాసం ఉండే టైలర్ కన్హయా లాల్ ను ముస్లిం దుండగులు కొందరు 2022లో నరికి చంపేశారు. ఈ ఉదంతం ఆధారంగా రూపుదిద్దుకుంది 'ఉదయ్ పూర్ ఫైల్స్: కన్హయా లాల్ టైలర్ మర్డర్' (Udaipur Files) చిత్రం. రెండు గంటల నిడివి ఉన్న ఈ సినిమాకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సర్టిఫికేషన్ (CBFC) 'ఎ' సర్టిఫికెట్ ఇచ్చింది. శుక్రవారం ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. అయితే ఇప్పుడీ సినిమా ఢిల్లీ హైకోర్ట్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల కారణంగా ఆగిపోయింది.
'ఉదయ్ పూర్ ఫైల్స్' సినిమా మొదలైన దగ్గర నుండి వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచింది. టైలర్ ను ముస్లిం యువకులు హత్య చేయడాన్ని ఖండిస్తూ అప్పట్లో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ కథాంశాన్నే దర్శకుడు భరత్ ఎస్ శ్రీనాధే సినిమాగా తీశాడు. రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్ ఈ చిత్రాన్ని పంపిణీ చేయడానికి ముందుకొచ్చింది. విజయ్ రాజ్ (Vijay Raaz, రజనీష్ దుగ్గల్ (Rajneesh Duggal), ప్రీతి జంగ్యాని (Preeti Jhangiani), కమలేష్ సావంత్, కాంచీ సింగ్ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. సి.బి.ఎఫ్.సి. సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత కూడా తమ చిత్రంపై కోర్టు కు వెళ్ళడాన్ని ఆ చిత్ర దర్శకుడు భరత్ ఎస్ శ్రీనాధే (Bharath S Shrinate) తప్పుపట్టాడు. సినిమా విడుదలకు ఒక్కరోజు ముందు ఢిల్లీ హైకోర్టు తలుపుతట్టి తమ చిత్రాన్ని ఆపుతారని ఊహించలేదని అన్నాడు. న్యాయస్థానాలంటే గౌరవం ఉన్న వ్యక్తిగా సుప్రీమ్ కోర్టును తాము ఆశ్రయిస్తామని చెప్పాడు.
ఢిల్లీ హైకోర్ట్ లో దాఖలైన రెండు పిటీషన్లను చీఫ్ జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ, జస్టిస్ అనీశ్ దయాల్ తో కూడిన ధర్మాసనం విచారణ చేసింది. పిటీషనర్ల తరఫున ప్రముఖ న్యాయవాది కపిల్ సిబాల్ వాదించారు. కేవలం టైలర్ కన్హయా లాల్ హత్య గురించి మాత్రమే కాకుండా ఇతర సున్నితమైన అంశాలను సైతం ఈ చిత్రంలో చర్చించారని, ఈ సినిమా విడుదలైతే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని వాదించారు. అయితే ఒకసారి సెన్సార్ అయిన సినిమాను ఆపడం సమంజసం కాదని మేకర్స్ తరఫున లాయర్ వాదించినా... కోర్టు ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. కేంద్ర ప్రభుత్వం ఈ సినిమాను వీక్షించి, ఇది విడుదలకు అర్హమైంది అవునా? కాదా? అనే నిర్ణయం తీసుకోవాలి తెలిపింది. దాంతో 'ఉదయ్ పూర్ ఫైల్స్' బాల్... కేంద్ర ప్రభుత్వం కోర్టులో పడినట్టు అయ్యింది. ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడాన్ని తప్పుపట్టడమే కాకుండా పూర్తి దీనిని నిషేధించాలంటూ జమాయత్ ఉలేమా ఇ హింద్ సంస్థ, జర్నలిస్ట్ ప్రశాంత్ టాండన్ కోర్టు కెక్కారు.
Also Read: Prabhas: డార్లింగ్.. లుక్ తోనే చంపేస్తున్నాడుగా
Also Read: Pawan Sentiment: వీరమల్లుకు తొలి ప్రేమ సెంటిమెంట్