Udaipur Files: సుప్రీమ్ కోర్ట్ ను ఆశ్రయించిన నిర్మాత
ABN , Publish Date - Jul 15 , 2025 | 02:35 PM
ఉదయ్ పూర్ ఫైల్స్ సినిమా విడుదలను చివరి నిమిషంలో ఢిల్లీ హై కోర్టు అడ్డుకోవడంపై నిర్మాణ సంస్థ సుప్రీమ్ కోర్ట్ తలుపు తట్టింది. సి.బి.ఎఫ్.సి. సర్టిఫికెట్ పొందిన తమ చిత్రం విడుదలకు సహకరించమని కోరింది. దీనిపై బుధవారం వాదనలు జరుగనున్నాయి.
ఉదయ్ పూర్ లో 2022లో జరిగిన టైలర్ కన్హయా లాల్ హత్య (Kanhaiya Lal Muder) నేపథ్యంలో తెరకెక్కిన 'ఉదయ్ పూర్ ఫైల్స్' (Udaipur Files) సినిమా విడుదలకు ఢిల్లీ హైకోర్ట్ మోకాలడ్డింది. ఈ కేసు విచారణలో ఉండగానే ఏకపక్షంగా తీసిన ఈ సినిమా విడుదల అయితే... తమకు న్యాయం దక్కదనే భావనను ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మహ్మద్ జావేద్ వెలిబుచ్చారు. ఆయన తరఫున కపిల్ సిబాల్ వాదించి, ఈ సినిమా విడుదలకు కొన్ని గంటల ముందు హై కోర్ట్ నుండి స్టే ఆర్డర్ సంపాదించారు.
అయితే ఇప్పుడు దీనిని ప్రశ్నిస్తూ చిత్ర నిర్మాణ సంస్థ జానీ ఫైర్ ఫాక్స్ మీడియా ప్రై.లిమిటెడ్ సుప్రీమ్ కోర్ట్ గడప తొక్కింది. దాదాపు యాభై కట్స్ చెప్పి, సినిమాకు సి.బి.ఎఫ్.సి. (CBFC) క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత సినిమా రిలీజ్ కు ఒక్కరోజు ముందు దీనిని ఆపివేయడం దారుణం అని నిర్మాణ సంస్థ తరఫున సీనియర్ లాయర్ గౌరవ్ భాటియా ఆవేదనను వెలిబుచ్చారు. కోర్టులు సినిమాను ప్రీ-రిలీజ్ సెన్సార్ కు పాల్పడటం అనేది రాజ్యాంగం ఇచ్చిన అధికరణం 19 (1)(ఎ) కాలరాయడమే నని ఆయన వాదించారు. ఇరు పక్షాల వాదనలను విన్న సుప్రీం కోర్టు ఈ కేసును బుధవారం విచారిస్తామని తెలిపింది. జూలై 11న విడుదల కావాల్సిన ఈ సినిమా ఢిల్లీ హైకోర్టు మధ్యతర ఉత్తర్వుల వల్ల ఆగిపోయింది కాబట్టి వీలైనంత త్వరగా తమ వాదనలు విని, సినిమా విడుదలకు సహకరించాల్సిందిగా నిర్మాత తరఫు లాయర్ సుప్రీం కోర్ట్ ను కోరారు. మరి బుధవారం నాడు ఈ సినిమా ఎలాంటి తీర్పు వెలువడుతుందో చూడాలి.
Also Read: Nidhhi Agerwal: ‘హరిహర వీరమల్లు’ పార్ట్-2 అప్డేట్ అప్డేట్