Shah Rukh Khan: షూటింగ్‌లో డూప్ లేకుండా స్టంట్స్.. తీవ్రంగా గాయపడ్డ షారుఖ్ ఖాన్
ABN, Publish Date - Jul 19 , 2025 | 02:26 PM
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఏడాది విరామం అనంతరం కొత్తగా నటిస్తోన్న చిత్రం కింగ్.
పఠాన్, జవాన్ సినిమాల విజయంతో తిరిగి ఫుల్ స్వింగ్‌లోకి వచ్చిన బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) ఏడాది విరామం అనంతరం కొత్తగా నటిస్తోన్న చిత్రం కింగ్ (King). ఈ చిత్రం ప్రస్తుతం ముంబైలోని గోల్డెన్ టొబాకో స్టూడియోలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఈ సినిమా చిత్రీకరణ సమయంలో అనుకోని ప్రమాదం జరిగినట్లు వార్తలు వస్తుండగా షారుఖ్ సైతం గాయపడడంతో మసిల్/బ్యాక్ ఇంజూరీ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే.. గాయానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా బయటకు రాకపోయినా అత్యవసర చికిత్స నిమిత్తం షారుక్ బృందం అమెరికా వెళ్లినట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఓ యాక్షన్ సన్నివేశం చిత్రీకరణలో డూప్ లేకుండా స్టంట్ చేస్తుండగా ఆయనకు ఈ గాయాలైనట్లు కథనాలు వస్తుండగా నెల రోజులు పూర్తి విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పినట్లు సమాచారం. దీంతో ఇప్పుడు ఈ కింగ్ సినిమా షూటింగ్‌ను సెప్టెంబర్ కు వాయిదా వేసినట్లు తెలుస్తోంది. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ఇదిలాఉంటే.. ఈ సినిమాకు సిద్ధార్థ్ ఆనంద్ (Siddharth Anand) దర్శకత్వం వహిస్తోండగా దీపికా పదుకొణె (Deepika Padukone), అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan), రాణి ముఖర్జీ, అనిల్ కపూర్, జైదీప్ అహ్లావత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ (Suhana Khan) బాలీవుడ్ సినిమాల్లోకి ఆరంగేట్రం చేస్తోండడం విశేషం. కాగా ఈ సినిమాను వచ్చే సంవత్సరం అక్టోబర్‌లో ప్రేక్షకుల ఎదుటకు రానుంది.