Apoorva Lakhia: వార్ ఫిల్మ్ పై సల్మాన్ ఆసక్తి...
ABN , Publish Date - May 01 , 2025 | 07:07 PM
బాలీవుడ్ సీనియర్ హీరో సల్మాన్ ఖాన్ తో అపూర్వ లఖియా ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నాడట. అయితే ఫ్యాన్ మాత్రం ఆ డైరెక్టర్ తో మూవీ వద్దేవద్దంటూ సందేశాలు పంపుతున్నారని తెలుస్తోంది.
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) కు ఇప్పుడు టైమ్ బాగోలేదు. ఆయనకు హిట్ వచ్చి చాలా యేళ్ళంది. ఎన్నో ఆశలు పెట్టుకుని చేసిన మురుగదాస్ (Murugadas) 'సికిందర్' (Sikhandar) సైతం ఘోర పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్ ఓ వార్ మూవీపై ఆసక్తి చూపుతున్నాడని తెలిసి ఫ్యాన్స్ వారించడం మొదలు పెట్టారు. నిజానికి వారు వద్దని చెప్పింది... ఆ సినిమా కథ నచ్చక కాదు... ఆ సినిమా ప్రపోజల్ తెచ్చిన దర్శకుడు నచ్చక!
బాలీవుడ్ లో దర్శకుడు అపూర్వ లఖియా (Apoorva Lakhia) కు మంచి పేరే ఉంది. అయితే గత కొంతకాలంగా ఆయన తెరకెక్కించిన సినిమాలేవీ కమర్షియల్ సక్సెస్ ను అందుకోలేదు. అపూర్వ లఖియా అంటే తెలుగువారికి అర్థం కావాలంటే... రామ్ చరణ్ (Ram Charan) ను హిందీ వారికి పరిచయం చేసిన దర్శకుడు అని చెప్పొచ్చు. ఆయన హిందీలో తీసిన 'జంజీర్' మూవీతోనే చెర్రీ బాలీవుడ్ బాట పట్టాడు. ఆ సినిమా కూడా డిజాస్టర్ కావడంతో మళ్ళీ అటువైపుకు పోలేదు. ఆ సినిమానే తెలుగులో 'తుఫాన్'గా డబ్ అయ్యింది.
ఇక విషయానికి వస్తే... అపూర్వ లఖియా 2020లో జరిగిన గాల్వాన్ వ్యాలీ వార్ మీద ఓ సినిమా తీయాలని అనుకున్నాడట. ఈ నేపథ్యంలోనే వచ్చిన 'ఇండియాస్ మోస్ట్ ఫియర్ లెస్ -3' అనే నవల హక్కుల్ని కూడా అపూర్వ లఖియా తీసుకున్నాడట. సల్మాన్ తో పాటు మరో ముగ్గురు ప్రధాన పాత్రధారులుగా మూవీని అపూర్వ లఖియా ప్లాన్ చేస్తున్నాడట. ఇదే విషయాన్ని అతను సోషల్ మీడియాలో పెట్టగానే... సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ ఒక్కసారిగా రియాక్ట్ అయ్యారు. 'అసలే మీ టైమ్ బాగాలేదు... వరుస ఫ్లాప్స్ లో ఉన్నారు. ఈ సమయంలో ఫ్లాప్ డైరెక్టర్ అపూర్వ లఖియాతో సినిమా ఎందుకు చేయడం!? వద్దే వద్దు!!' అంటూ సల్లూభాయ్ కు సందేశాలు పంపుతున్నారట. జోగీ జోగీ రాసుకుంటే బూడిద రాలినట్టు అవుతుందనేది వారి సందేహం కావచ్చు. మరి అభిమానుల మొరను సల్మాన్ ఆలకిస్తాడో లేదో చూడాలి.
Also Read: Retro Review: సూర్య యాక్షన్ ఎంటర్టైనర్ ఎలా ఉందంటే..
Also Read: Hit - The Third Case: హిట్ -3 మూవీ రివ్యూ
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి