Salman khan: ధర్మేంద్రను తలచుకుని వెక్కివెక్కి ఏడ్చాడు.. ఎందుకంటే..
ABN, Publish Date - Dec 08 , 2025 | 12:11 PM
హిందీ ‘బిగ్‌బాస్ 19’ ఫైనల్ వేదికపై వ్యాఖ్యాత సల్మాన్ ఖాన్ కన్నీరుమున్నీరయ్యారు.
హిందీ ‘బిగ్‌బాస్ 19’ ఫైనల్ వేదికపై వ్యాఖ్యాత సల్మాన్ ఖాన్ (Salman khan) కన్నీరుమున్నీరయ్యారు. బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్రను (Dharmendra) గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. గతంలో బిగ్‌బాస్ షోలో ధర్మేంద్ర పాల్గొన్న వీడియోను ప్రదర్శించగా సల్మాన్ భావోద్వేగానికి గురయ్యారు. 'డిసెంబర్ 8వ తేదీ ధర్మేంద్రజీ పుట్టిన రోజు. మా అమ్మ పుట్టిన రోజు కూడా ఈరోజే. నా తండ్రి పుట్టిన రోజున (నవంబర్ 24) ధర్మేంద్రజి మరణించారు. ‘మనం హీ-మ్యాన్‌ను కోల్పోయాం. ఆయనకంటే గొప్పవారు ఎవరూ లేరు’ అంటూ ధర్మేంద్రతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ కన్నీరు పెట్టుకున్నారు.
హిందీ చిత్రసీమ అందగాడు... కమర్షియల్ విజయాలకు కేరాఫ్ గా నిలిచిన సీనియర్ నటుడు ధర్మేంద్ర గత నెల 24వ తేదీన మరణించిన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం క్షీణించడంతో సోమవారం కన్నుమూశారు. ధర్మేంద్ర అనారోగ్యానికి గురవడంతో కుటుంబ సభ్యులు అక్టోబరు 31న ముంబయిలోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో ఆయన చనిపోయారంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. ధర్మేంద్ర ఆరోగ్యం నిలకడగానే ఉందని, అభిమానులు ఆందోళన చెందొద్దని ఆయన సతీమణి హేమామాలిని, కుమారుడు సన్నీ దేఒల్ విజ్ఞప్తి చేశారు. అయితే 24వ తేదీన ధర్మేంద్ర ఆరోగ్యం విషమించడంతో తుది శ్వాస విడిచారు.