Pahlaj Nihalani: పగలు డైట్ ఫుడ్.. రాత్రిళ్లు డ్రగ్స్
ABN, Publish Date - Jul 11 , 2025 | 05:44 AM
బాలీవుడ్ నిర్మాత, సెన్సార్ బోర్డ్ మాజీ ఛైర్మన్ పహ్లాజ్ నిహలానీ ఇండస్ట్రీలోని పరిస్థితులపై..
యాక్టర్ల తీరును తప్పుబట్టిన పహ్లాజ్ నిహలానీ
బాలీవుడ్ నిర్మాత, సెన్సార్ బోర్డ్ మాజీ ఛైర్మన్ పహ్లాజ్ నిహలానీ ఇండస్ట్రీలోని పరిస్థితులపై, యాక్టర్ల జీవనశైలిపై సంచలన కామెంట్స్ చేశారు. ఇటీవలె ఓ పాడ్‌కాస్ట్‌లో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ‘‘ఒకప్పుడు యాక్టర్లు కాస్టింగ్ విషయంలో తలదూర్చేవారు కారు. అది దర్శక నిర్మాతల చేతుల్లోనే ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. నటులే డైరెక్టర్లను ఎంపిక చేసుకోవడంతో పాటు కాస్టింగ్‌ను నిర్ణయిస్తున్నారు. దీంతో నిర్మాతల పరిస్థితి కొరియర్ సర్వీస్‌లా మారింది. నేను 2003లో ‘తలాష్: ద హంట్ బిగిన్స్’ సినిమా నిర్మించేటప్పుడు అక్షయ్‌కుమార్ ‘సినిమాను రేపే ప్రారంభించొచ్చు. నాకు పారితోషికంగా మీకు నచ్చినంత ఇవ్వండి. కానీ నాదొక్కటే షరతు. ఈ సినిమాలో హీరోయిన్‌గా కరీనా కపూర్ ఉండాలి’ అని చెప్పారు. నా కెరీర్‌లో ఒక నటుడు నాతో అలా ప్రవర్తించడం అదే తొలిసారి. వయసు పెరిగిన స్టార్ హీరోలు కొత్త హీరోయిన్లతో నటించాలనే ఆసక్తి చూపించడానికి కారణం. వారి వయస్సు తక్కువగా కనిపించాలనే. సినిమా నిర్మాణంలో కూడా ఇప్పుడు అనవసర ఖర్చులు ఎక్కువయ్యాయి. ఒకప్పుడు హీరో, హీరోయిన్లలతో పాటు పర్సనల్ మేకప్ మ్యాన్ మాత్రమే ఉండేవాడు. ఇప్పుడేమో అదనంగా హెయిర్ డ్రెస్సర్, అద్దం పట్టుకోవడానికి వ్యక్తులు ఉంటున్నారు. అప్పట్లో తారలు ఇంటినుంచి ఆహారం తెచ్చుకునేవారు. ఇప్పటి వారికి పగలేమో ప్రత్యేక డైట్ ఫుడ్ కావాలి. రా త్రయితే డ్రగ్స్ కావాలి’’ అని అన్నారు.