Rajkumar Rao: మరోసారి నల్లకోటు ధరించి...
ABN, Publish Date - Jun 21 , 2025 | 11:08 AM
జాతీయ ఉత్తమ నటుడు రాజ్ కుమార్ రావ్ మరోసారి లాయర్ పాత్రను పోషిస్తున్నాడు. ముంబైకు చెందిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ పాత్రను రాజ్ కుమార్ రావ్ చేయబోతున్నాడు.
ప్రముఖ బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావ్ (Rajkumar Rao) మరోసారి వెండితెరపై నల్లకోటు ధరించబోతున్నాడు. ఇప్పటికే 'షహీద్' (Shahid) చిత్రంలోని షహీద్ అజ్మీ (Shahid Azmi) పాత్రకు గానూ రాజ్ కుమార్ రావ్ జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డును అందుకున్నాడు. అంతేకాదు. తాజా మరోసారి లాయర్ పాత్రను పోషించడానికి సిద్థమౌతున్నాడు.
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హత్య, ఉగ్రవాదానికి సంబంధించిన కేసులను వాదించడంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ (Ujjwal Nikam) కు మంచి పేరుంది. ముంబైలో జరిగిన 26/11 దాడి కేసును సైతం ఆయనే వాదించారు. జాతీయ స్థాయిలో మంచి న్యాయవాదిగా పేరున్న ఉజ్వల్ నికమ్ ఆ తర్వాత బీజేపీలో చేరి ముంబై నార్త్ సెంట్రల్ నుండి 2024 పార్లమెంట్ కు పోటీ చేశారు. అయితే ఈ ఎన్నికల్లో ఆయన 16 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2016లోనే పద్మశ్రీ (Padmasri) అవార్డుతో ఆయన్ని కేంద్ర ప్రభుత్వం గౌరవించింది.
1993 ముంబై బాంబ్ బ్లాస్ట్స్, గుల్షన్ కుమార్ మర్డర్ కేస్, ప్రమోద్ మహాజన్ మర్డర్ కేస్, 2008 ముంబై అటాక్స్, 2013 ముంబై గ్యాంగ్ రేప్ కేస్... వంటి వాటిని ఉజ్వల్ నికమ్ సమర్థవంతంగా వాదించారు. ఆయన బయోపిక్ ను తీయబోతున్నట్టు, ఆయన పాత్రను బాలీవుడ్ స్టార్ హీరో ఆమీర్ ఖాన్ చేయబోతున్నట్టు గతంలో వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఉజ్వల్ నికమ్ పాత్రను రాజ్ కుమార్ రావ్ పోషిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇది ఉజ్వల్ నికమ్ బయోపిక్ కాదని, 26/11 ముంబై దాడి కేసు మీద మాత్రమే సినిమా నిర్మిస్తున్నామని మడాక్ ఫిల్మ్స్ సంస్థ తెలిపింది. ముంబై దాడి అనంతరం కోర్టులో నిందితులపై జరిగిన విచారణకు ఇందులో ప్రాధాన్యం ఇవ్వబోతున్నారట. ఈ కోర్ట్ డ్రామా ను 'పాతాళ్ లోక్, ఖిల్లా, త్రీ ఆఫ్ ఆజ్' లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన అవినాశ్ అరుణ్ ధవారే డైరెక్ట్ చేయబోతున్నారట. మరి గతంలో పౌరహక్కుల కోసం కృషి చేసిన షాహిద్ ఆజ్మీ పాత్రను చేసి మెప్పించిన రాజ్ కుమార్ రావ్... ఇప్పుడీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పాత్రకు ఏ మేరకు న్యాయం చేస్తాడో చూడాలి.
Also Read: Harihara Veeramallu: అఫీషియల్ రిలీజ్ డేట్ వచ్చేసింది
Also Read: Mohanlal: శ్రీలంక పర్యటన మరచిపోలేని జ్ఞాపకం..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి