Young Tiger: గూఢచారిగా ఎన్టీఆర్...
ABN, Publish Date - May 20 , 2025 | 09:39 AM
ఇవాళ యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు. అభిమానులు అతని జన్మదినోత్సవాన్ని భిన్నమైన రీతుల్లో జరుపుకుంటున్నారు. మరో పక్క సినిమా రంగానికి చెందిన తోటి నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎన్టీఆర్ కు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు.
యంగ్ టైగర్ యన్టీఆర్ (NTR) ఫ్యాన్స్ కు రాబోయే రోజుల్లో కనువిందు ఖాయమనిపిస్తోంది. ఎందుకంటే యన్టీఆర్ తో తెలుగువారే కాదు ఉత్తరాది నిర్మాతలు సైతం సినిమాలు తీయడానికి ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ 'స్పై యూనివర్స్'లో యన్టీఆర్ రోల్ కీలకంగా మారనుందని తెలుస్తోంది. టాప్ స్టార్స్ ఎక్కువ చిత్రాల్లో నటించినప్పుడే థియేటర్లకు సరైన ఫీడ్ ఉంటుందని ఓ వైపు ఎగ్జిబిటర్స్ గగ్గోలు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో టాప్ స్టార్స్ ఏడాదికి ఒకటో, లేదా రెండేళ్ళకో మూడేళ్ళకో ఓ సినిమా చేయడం విచారకరం. మొన్నటి దాకా యంగ్ టైగర్ యన్టీఆర్ ను కూడా సినీజనం అలాగే అనుకున్నారు. అయితే ఇప్పుడు యన్టీఆర్ స్పీడ్ పెంచిన వైనం కనిపిస్తోంది. ఈ యేడాది ఆగస్టు 14న 'వార్ 2' (War -2) హిందీ మూవీతో వస్తోన్న యంగ్ టైగర్ వచ్చే సంవత్సరం ప్రశాంత్ నీల్ (Prasanth Neel) సినిమాతోనూ, అటుపై 'దేవర పార్ట్ 2' (Devara -2) తోనూ కనువిందు చేయనున్నారు. అయితే బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ సైతం యన్టీఆర్ పై కన్నేసినట్టు తెలుస్తోంది. 'వార్ 2' మూవీలో యన్టీఆర్ పాత్ర అత్యంత ప్రాధాన్యమైనదిగా రూపొందింది. ఇది నిర్మాణంలో ఉండగానే యశ్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ యన్టీఆర్ కాల్ షీట్స్ కొన్ని పట్టేసినట్టు వినికిడి.
'వార్ 2'లో యన్టీఆర్ ధరించిన పాత్ర హృతిక్ రోషన్ (Hrithik Roshan) రోల్ కు ఏ మాత్రం తగ్గదని మొదటి నుంచీ వినిపిస్తోంది. అంతేకాదు గతంలో యశ్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ నిర్మించిన 'స్పై మూవీస్'లోని హీరోల పాత్రల్లాగే యన్టీఆర్ రోల్ ఉంటుందని తెలుస్తోంది. 'పఠాన్'లో షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) లాగా, 'టైగర్' సిరీస్ లో సల్మాన్ ఖాన్ (Salman Khan) పోలినట్టు యన్టీఆర్ పాత్ర రూపొందిందని సమాచారం. అంతటితో ఆగలేదు, యన్టీఆర్ సోలో హీరోగానే ఓ స్పై మూవీ తీసే యోచనలో యశ్ రాజ్ ఫిలిమ్స్ అధినేత ఆదిత్య చోప్రా ఉన్నట్టు వినికిడి. 'వార్ 2'లోని యన్టీఆర్ పాత్రను డిజైన్ చేసిందే చిత్ర నిర్మాత ఆదిత్య చోప్రా అని తెలుస్తోంది.
యంగ్ టైగర్ దే ఆ క్రెడిట్!
నందమూరి ఫ్యామిలీలో నటరత్న యన్టీఆర్ నాలుగు హిందీ సినిమాల్లో నటించారు. అయితే ఆ నాలుగు సినిమాలు కూడా సౌత్ ప్రొడ్యూసర్స్ తెరకెక్కించినవే కావడం విశేషం! నందమూరి నటవంశంలో మరో టాప్ స్టార్ బాలకృష్ణ హీరోగా హిందీ స్ట్రెయిట్ మూవీస్ చేయలేదు. అలా యన్టీఆర్ ఫ్యామిలీ నుండి స్ట్రెయిట్ హిందీ మూవీలో నటించిన క్రెడిట్ ను యంగ్ టైగర్ సొంతం చేసుకుంటున్నారు. 'వార్ 2' రిలీజ్ కాగానే, మరో స్పై మూవీలో యన్టీఆర్ నటించనున్నాడని ముంబైలో విశేషంగా వినిపిస్తోంది... మరి నార్త్ ను నందమూరి ఫ్యామిలీ మూడోతరం స్టార్ యన్టీఆర్ ఏ తీరున షేక్ చేస్తాడో చూద్దాం.
Also Read: Megastar: చిరంజీవితోనే రీ-ఎంట్రీ...
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి