Bollywood: యాక్షన్ హీరోగా బాలీవుడ్ లోకి ధోని...
ABN, Publish Date - Sep 10 , 2025 | 11:30 AM
క్రికెటర్ ఎమ్మెస్ ధోనీ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. మాధవన్ తో కలిసి ది ఛేజ్ మూవీలో హీరోగా నటించాడు. ఇటీవల విడుదలైన ఈ మూవీ టీజర్ అందరినీ బాగా ఆకట్టుకుంటోంది. అలియాభట్ జిగ్రా ఫేమ్ వాసన్ బాలా దీనికి దర్శకుడు.
దేవుడు ఒకదారి మూస్తే రెండో దారి తెరుస్తాడని చాలామంది విశ్వసిస్తూ ఉంటారు. ఎమ్మెస్ ధోనీ అభిమానులు కూడా ఇప్పుడు అదే నమ్ముతున్నారు. క్రికెటర్ గా మైదానంలో ఆటకు ధోని
(MS Dhoni) స్వస్తి చెబుతున్న తరుణంలో ఇప్పుడాయన ఇకపై వెండితెరపై మెరుస్తాడని నమ్ముతున్నారు. దీనికి తార్కాణంగా నిలిచింది ఇటీవల విడుదలైన 'ది ఛేజ్' (The Chase) టీజర్. ఐదేళ్ళ క్రితమే ఇంటర్నేషనల్ క్రికెట్ కు ధోనీ గుడ్ బై చెప్పేశాడు. అయితే మొన్నటి వరకూ ఐపీఎల్ కు చెన్నయ్ సూపర్ కింగ్స్ తరఫున ఆడుతూ వచ్చారు. రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో బ్యాట్ ను పక్కన పెడితే మా లాంటి అభిమానుల పరిస్థితి ఏమిటీ అని కొందరు కలవర పడటం మొదలు పెట్టారు. ధోనీ ఇప్పటికీ ఇండియాలో చాలా ప్రాడక్ట్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు. ఆ రకంగా తరచూ బుల్లితెర మీద రకరకాల గెటప్స్ తో కనిపిస్తూనే ఉన్నాడు. అలానే సినిమా నిర్మాణానికీ ధోనీ చాలా కాలం క్రితమే శ్రీకారం చుట్టాడు. ఓ తమిళ సినిమాను కూడా తన భార్య పేరుతో తీశాడు.
ఇప్పుడు ధోనీ కొత్త అవతారం ఎత్తాడు. ఏకంగా నటుడిగా సిల్వర్ స్క్రీన్ పైకే వచ్చేస్తున్నాడు. ఆర్. మాధవన్ (R Madhavan) తో కలిసి ఎమ్మెస్ ధోని 'ది ఛేజ్' అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ యాక్షన్ ఫ్యాక్డ్ మూవీలో బుర్రపెట్టి ఆలోచించే కాప్ గా ధోనీ, మనసు పెట్టి నిర్ణయాలు తీసుకునే కాప్ గా ఆర్. మాధవన్ నటిస్తున్నారు. వీరు చేపట్టిన అస్సైన్ మెంట్ ఏమిటనేది తాజా టీజర్ లో చూపించలేదు కానీ... ఇది వినోద ప్రధానంగా సాగే యాక్షన్ మూవీ అని అర్థమౌతోంది. పలు చిత్రాలకు రచన చేసి, అలియాభట్ నాయికగా 'జిగ్రా' మూవీని తెరకెక్కించిన వాసన్ బాలా ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. లూసిఫర్ సర్కస్ సంస్థ దీనిని నిర్మిస్తోంది. గతంలో తమిళ చిత్రంలో గెస్ట్ అప్పీయరెన్స్ ఇచ్చిన ధోనీ ఇప్పుడు ఏకంగా హీరోగా నటించడం అభిమానులల్లో ఆనందాన్ని కలిగిస్తోంది. ఈ సినిమా గురించి పూర్తి సమాచారం ఇంకా బయటకు రాలేదు. ఇదిలా ఉంటే మాధవన్ నటించిన 'ఆప్ జైసా కోయీ' మూవీ ఇటీవలే విడుదలైంది. ఇందులో ఫాతిమా సనా షేక్ హీరోయిన్ గా నటించింది. మాధవన్ నటిస్తున్న యాక్షన్ మూవీ 'ధురంధర్' డిసెంబర్ 5న విడుదల కాబోతోంది. ఇందులో రణవీర్ సింగ్ హీరో కాగా, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా కీలక పాత్రలు పోషించారు.
Also Read: Karishma Kapoor: దివంగత తండ్రి ఆస్తి హక్కుల కోసం...