Bhool Chuk Maaf: థియేటర్ల తర్వాతే ఓటీటీ...

ABN , Publish Date - May 15 , 2025 | 02:26 PM

రాజ్ కుమార్ రావ్, వామికా గబ్బి నటించిన 'భూల్ చుక్ మాఫ్' సినిమాపై కోర్టు తీర్పు వెలువడింది. ముందు థియేటర్లలో విడుదల చేసిన తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్ చేయాలని కోర్టు ఆదేశించింది.

జాతీయ ఉత్తమ నటుడు రాజ్ కుమార్ రావ్ (Raj Kumar Rao), వామికా గబ్బి (Wamiqa Gabbi) జంటగా నటించిన 'భూల్ చుక్ మాఫ్' (Bhool Chuk Maaf) సినిమా అనివార్య కారణంగా థియేటర్లలో కాకుండా ఓటీటీ స్ట్రీమింగ్ కు వెళ్ళిపోయింది. అయితే... ఆ చిత్ర నిర్మాణ సంస్థ మ్యాడ్ డాక్ ఫిలిమ్స్ (Maddock films) తమతో చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించిందంటూ పీవీఆర్ ఐనాక్స్ (PVR Inox) సంస్థ కోర్టుకు వెళ్ళింది. థియేటర్లలో రిలీజ్ అవుతుందనే నమ్మకంతో అడ్వాన్స్ బుకింగ్ కూడా చేశామని, చివరి నిమిషంలో నిర్మాణ సంస్థ మనసు మార్చుకుని, దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను సాకుగా చూపి ఓటీటీ స్ట్రీమింగ్ నిర్ణయం తీసుకుందని తెలిపింది. దాంతో కోర్టు తాజాగా ఈ కేసును విచారించి తీర్పును ఇచ్చింది.


ఓటీటీ స్ట్రీమింగ్ కంటే ముందు... 'భూల్ చుక్ మాఫ్'ను థియేటర్లలో విడుదల చేయాల్సిందేనని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దాంతో ఈ నెల 23న ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేసి... ఆ తర్వాత రెండు వారాలకు ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలనే నిర్ణయాన్ని నిర్మాణ సంస్థ తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే థియేటర్ రిలీజ్ కు, ఓటీటీ స్ట్రీమింగ్ కు మధ్య కనీసం ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలని పీవీఆర్ ఐనాక్స్ సంస్థ చిత్ర నిర్మాణ సంస్థలతో అగ్రిమెంట్ చేసుకుంటోంది. మరి ఇప్పుడు కేవలం రెండు వారాలకే దానిని కుదించడానికి అంగీకరిస్తుందా లేదా అనేది వేచి చూడాలి. ఏదేమైనా థియేట్రికల్ రిలీజ్ విషయంలో మాత్రం పీవీఆర్ ఐనాక్స్ మాటే నెగ్గింది. మరి నిర్మాణ సంస్థ థియేట్రికల్ రిలీజ్, ఓటీటీ స్ట్రీమింగ్ విషయంలో అధికారిక ప్రకటన ఎప్పుడు చేస్తుందో చూడాలి.

Also Read: Junior: హీరోగా ఎంట్రీ ఇస్తున్న గాలి తనయుడు...

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - May 15 , 2025 | 02:27 PM